– వివేకా హత్యపై ఇన్నేళ్ల విచారణలో తేల్చింది శూన్యం
– అటుతిప్పి – ఇటు తిప్పి ఒకే దిశలో విచారణ
– సీబీఐ అసమర్థతను ఎండగట్టిన జాతీయ స్థాయి ఇంగ్లిష్ వెబ్ సైట్ ది వైర్
సీబీఐ… ఆ పేరు వింటే చాలు అప్పట్లో దడదడ.. పెద్దపెద్ద కేసులను ఇట్టే పసిగట్టి గుట్టువిప్పేసే ఢిల్లీస్థాయిలోని అతిపెద్ద దర్యాప్తు సంస్థ . డేగకళ్లతో వేటాడుతుంది. ఎంతటి పెద్ద కేసు, సంక్లిష్టమైన కేసు అయినా చిటికెలో పట్టేసుకుంటుంది అని పేరున్న సంస్థ ఇప్పుడేమో మూడునెలలు కర్ర సాము నేర్చుకుని మూలనున్న ముసలమ్మను కొట్టిన వీరుడిలా మారింది. వైయస్ వివేకానంద హత్య కేసులో మాత్రం నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా ఏమీ తేల్చలేదు. పట్టపగలు దాగుడుమూతలు ఆడుతున్న తీరున ఇప్పటికి ఆ హత్యకేసును సంబంధించి ఒక్క ఆధారమూ సేకరించలేదు. ఎక్కడో దొరికిన ఒక కాగితం ముక్కనో, ఓ చెక్కముక్కనో పట్టుకుని అదే ఆధారం అని నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ అసమర్థతను జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ది వైర్ ఆంగ్ల వెబ్సైట్ పలు కోణాల్లో వివరించింది. ఇన్నాళ్లలో సీబీఐ సాధించింది జీరో అని ఆ వెబ్సైట్ తేల్చేసింది. దర్యాప్తు మొత్తం ఒకే కోణంలో సాగిందని, ఆయన హత్యకు వేరేకారణాలు ఉండొచ్చన్న భావన కూడా సీబీఐకి రాలేదంటూ ఆ వెబ్సైట్ పలు ప్రశ్నలు సంధించింది. అంటే మనసులో ఏదో పెట్టుకుని, అప్పటికే నిందితుడిని సెలెక్ట్ చేసుకుని ఆయన్ను నిజంగానే నిందితుడిగా రుజువు చేసేందుకు ఆధారాలు వెతుకుతున్న సీబీఐ తీరును ఆ వెబ్సైట్ అభిశంసించింది.
కడప ఎంపీ అభ్యర్థిత్వం ఆప్పటికే తేలిపోయింది
వాస్తవానికి కడప ఎంపీ టికెట్ కోసం ఈ హత్య జరిగింది అన్నట్లుగా సీబీఐ వాదన ఉంటోంది. కానీ అప్పటికే కడప టికెట్ అవినాష్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రకటించేసారు. అంతేకాదు ఆ ప్రకటన వచ్చాక సైతం వివేకా అవినాష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసారు. ఆ విషయాన్నీ సీబీఐ అసలు పట్టించుకోనేలేదు. కేవలం ఎంపీ టికెట్ కోసమే వివేకా, అవినాష్ రెడ్డి మధ్య పోటీ ఉన్నట్లు భవిస్తూ… ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తూ వెళ్ళింది. కానీ దానికి సంబంధించి ఒక్క ఆధారమూ సంపాదించలేకపోయింది.
అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆయనకు ఈ హత్యతో ప్రమేయం ఉందని చెప్పే ఒక్క ఆధారమూ కోర్టుకు చూపలేదు. అసలు అవినాష్ రెడ్డి బలమైన అభ్యర్థి కాదని వివేకా భావించారు అంటూ వైయస్ షర్మిళ గతంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని మహాప్రసాదంగా తీసుకుని ముందుకు వెళ్లిన సీబీఐ అసలు అవినాష్ ట్రాక్ రికార్డ్ గుర్తించలేదు. 2014లో 1. 90 వేల ఓట్ల మెజారిటీ ఇంకా 2019లో 3. 80 లక్షల మెజారిటీతో గెలిచారు. అయన మెజారిటీ పెరిగిందే తప్ప తగ్గలేదు. మరి అలాంటపుడు అవినాష్ రెడ్డి బలహీనమైన అభ్యర్థి అని వివేకా ఎలా భావిస్తారు. ఈ పాయింట్ ఎందుకు సీబీఐ మర్చిపోయింది. పోనీ షర్మిళ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారం ఉందా అంటే అదీ లేదు. ఆమె అలా చెప్పారు కాబట్టి ఆ పాయింట్ మీద ఫిక్స్ అయిపోయి దర్యాప్తు చేస్తూ వెళ్లారు. ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్ రెడ్డి కారణం అని సీబీఐ చెబుతోంది తప్ప దీనికీ ఆధారాల్లేవు.
రెండో పెళ్ళికి సునీత, సౌభాగ్యమ్మ వ్యతిరేకం
ఇదిలా ఉండగా వివేకా షమీమ్ అనే మహిళను రెండో పెళ్లి చేసుకోవడం ఇటు ఆయన కూతురు సునీతకు, భార్య సౌభాగ్యమ్మకు ఇష్టంలేదని, అందుకే ఆయనకు ఉన్న చెక్ పవర్ సైతం లాగేసుకున్నారన్నది జగద్విదితమ్. ఇక సౌభాగ్యమ్మ సోదరులు తనను బెదిరించినట్లు షమీమ్ వెళ్లి సీబీఐ వద్ద వాంగ్మూలం ఇచ్చారు. మరి ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారించలేదు. ఆ హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చనే కోణం ఎందుకు సీబీఐ తీసుకోలేదు. హత్యకు ఏయే కారణాలు ఉండొచ్చన్న సందేహాలు సీబీఐ మదిలో మెదిలి, ఇలా పలుకోణాల్లో విచారణ జరపాల్సి ఉండగా సీబీఐ అదేమీ పట్టించుకోకుండా కేవలం ఒకే కోణంలో అది కూడా అవినాష్ కు అందులో పాత్ర ఉందన్న విషయాన్నీ నిరూపించడానికి ఎక్కువ తాపత్రయపడింది..
ఇలా పలు కీలక అంశాలు వదిలేసి ఎటెటో దర్యాప్తు బృందం వెళ్ళిపోయి ఏమీ సాధిచకుండా నాలుగేళ్లు గడిపేసింది అంటూ సీబీఐని ది వైర్ వెబ్సైట్ దుయ్యబట్టింది. ఇన్నాళ్ల సమయంలో సీబీఐ దర్యాప్తు మొత్తం సరైనమార్గంలో వెళ్లలేదని, దారితప్పి విచారణ జరిగిందని వైర్ తన కథనంలో విశ్లేషించింది.