గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నో ఏళ్ళ నుండి తిష్ట వేసి ఉన్న ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీపడే ప్రసక్తే లేదని గుంటూరు పశ్చిమ నియోకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం నాడు డివిజన్ల పర్యటనల్లో భాగంగా 20వ డివిజన్ లోని కొబ్బరి తోట, నంబూరు సుభాని కాలనీ,బాబు రాజేంద్ర ప్రసాద్ కాలనీ, సంపత్ నగర్ లో జోరువానలో సైతం డివిజన్ పర్యటన కొనసాగించారు. ఈ సందర్భముగా డివిజన్ లో సమస్యలను పరిశీలించి, అధికారుల నుండి వివరాలు అడిగితెలుసుకున్నారు. నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటు వెనుకబడిన ప్రాంతాలలో కనీసమౌళిక సదుపాయాలకు కూడా నోచుకోకుండా ఉన్నాయని అవి 20వ డివిజన్ లోని ప్రాంతాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే పీకలవాగు ప్రాంత ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని, నంబూరు సుభాని కాలనీలో చిత్తడి రోడ్లు, మురుగు నీరుతో ప్రజారోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకొనివచ్చారు. అదేమాదిరిగా జనావాసాల మధ్య ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి, వర్షపు నీరు నిలిచి ఉండటాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. వెంటనే పిచ్చి మొక్కలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.పీకల వాగులోని వ్యర్ధాలను తొలగించి,రోడ్డు మీద వేయటం వలన తీవ్ర దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వాటిని వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పీకల వాగు కట్ట (నంబూరు సుభాని కాలనీ) లో రోడ్లు మరియు మంచి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలనీ కోరారు. కొబ్బరితోటలో నిర్మాణంలో ఉన్న మంచి నీటి రిజర్వ్ ట్యాంక్ వివరాలను అడిగి తెలుసుకొని, త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొనిరావాలని అధికారులను కోరారు. కొబ్బరితోట ప్రాంతంలో కూడా గంజాయి యధేచ్చగా అమ్ముతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొనివచ్చారు. గంజాయి విషయంలో పోలీసులు కూడా కఠినంగా వ్యవహారిస్తున్నారని, పోలీస్ పెట్రోలింగ్ పెంచి గంజాయిని అరికట్టాలని పోలీసుల దృష్టికి తీసుకొని వెళ్లారు.