వికేంద్రీకరణ, విశాఖ రాజధాని అంటూ రాష్ట్ర మంత్రులు వీధి నాటకాలతో ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ బూటకపు మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. శ్రీ జగన్ రెడ్డి నేతృత్వంలో అడుగడుగునా జన వంచక పాలన సాగుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించినందుకు మంత్రులు గ్రామ సింహాల్లా మారి మొరుగుతున్నారని తెలిపారు. అమర్నాథ్ లాంటి గ్రామ సింహాల అరుపులకి ఎవరూ భయపడరని చెప్పారు. మంగళవారం విశాఖలో పార్టీ రాష్ట్ర నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ కోన తాతారావు మాట్లాడుతూ “జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ మాధ్యమం ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. మంత్రులంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మొదలు పెట్టారు. ఉత్తరాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు తమ యజమానికి కాస్త ఎక్కువ విశ్వాసం చూపే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చెవాకులు పేలుతున్న మంత్రులు అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ధర్మానలకు ఉత్తరాంధ్ర ప్రాంతవాసులుగా చిన్న సవాలు విసురుతున్నాం. దాన్ని స్వీకరించి ఉత్తరాంధ్ర ప్రజలకుసామాధానం చెప్పే దమ్ము మీకుందా? వైసీపీ అధికారంలోకి వచ్చిన 40 నెలల కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? అమర్నాథ్ పరిశ్రమల మంత్రిగా విశాఖకు ఒక్క పరిశ్రమ గాని, ఒక్క ప్రాజెక్టుగాని తెచ్చారా? దసపల్లా భూముల నుంచి రుషికొండ వరకు దొరికిన భూమినల్లా అధికారుల్ని భయపెట్టి లాక్కోవడం, పర్యావరణాన్ని నాశనం చేయడం మినహా మీరు చేసిందేంటో ప్రజలకు చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీ యజమానురాలు.. ముఖ్యమంత్రి గారి సతీమణి శ్రీమతి భారతిరెడ్డి గారి కోసం ప్యాలెస్ నిర్మాణానికి రుషికొండ బహూకరించిన మాట వాస్తవమా? కాదా? ప్రజలకు చెప్పాలి.
• దమ్ముంటే విజయసాయి ఆక్రమణల్ని అడ్డుకోండి
విశాఖ వీధుల్లో రికార్డింగ్ డాన్సులు వేసుకునే మంత్రి అమర్నాథ్ లాంటి వారు ఏదో మంత్రి పదవి కాపాడుకోవడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారంటే సరే.. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన, బొత్సల బుద్ది ఏమయ్యింది. ఉత్తరాంధ్రలో పుట్టిన మీకు జన్మభూమి మీద నిజంగా ప్రేమ ఉంటే మీ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆక్రమణలను అడ్డుకోండి. విశాఖ చుట్టూ ఎవరి స్థాయిలో వారు భూ దోపిడి చేస్తున్నారు. మంత్రి అమర్నాథ్, అతని అనుచరులు బయ్యవరం కొండలు, వాగులు ఆక్రమించి అనధికారికంగా వేసిన లే అవుట్లపై గౌరవ లోకాయుక్త విచారణకు ఆదేశించిన మాట వాస్తవం కాదా? శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందే చెప్పారు వైసీపీకి ఓటు వేస్తే విశాఖ చుట్టూ ఉన్న కొండలు, గుట్టలు దోచేస్తారని. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే వైసీపీ నాయకులు ఖాళీగా కనబడిన భూములన్నీ మాయం చేస్తున్నారు.
• మీ ధ్వంస రచనలన్నీ విశాఖ ప్రజలు పసిగడుతున్నారు
శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక్క రాజధాని కట్టేందుకే శక్తి లేదు. మూడు రాజధానులు కడతామంటే విశాఖ ప్రజలు నమ్ముతారా? ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి, ప్రజల మధ్య గొడవలు పెట్టడానికే ఈ ధ్వంస రచనలన్న సంగతి ప్రజలు గ్రహించలేరనుకున్నారా? ఉత్తరాంధ్ర ప్రజలకు వైసీపీ కపట నాటకాలు అర్థమైపోయాయి. నిజాయితీ, నిబద్దతతో కూడిన రాజకీయాలు చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి” అన్నారు.
మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సుందరపు విజయ్ కుమార్, పార్టీ నాయకులు శ్రీ పీవీఎస్ఎన్ రాజు, డా.పంచకర్ల సందీప్, శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్, శ్రీ పీతల మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.