ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అవినీతి రాష్ట్ర సరిహద్దులను దాటిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. అనంతపురంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. తుంగభద్ర రిజర్యాయరు కింద హెచ్చెల్సీ, ఎల్లెల్సీ కాలువల ఆధునికీకరణ పనులను కర్ణాటక రాష్ట్ర పరిధిలో చేస్తున్న కాంట్రాక్టర్లను కమీషన్లు ఇవ్వాలని బుధవారం విప్ ‘కాపు’ బెదిరించడం దుర్మార్గమన్నారు. కమీషన్ల కోసం కర్ణాటక కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవడం ద్వారా ‘కాపు’ తన అవినీతిని పొరుగు రాష్ట్రాలకు విస్తరించాడన్నారు. మూడేళ్ళుగా రాయదుర్గం ప్రాంతంలో సహజ వనరులను, ప్రజల సొమ్మును యథేచ్ఛగా దోచుకుంటున్న ప్రభుత్వ విప్ పక్క రాష్ట్ర పనులపై కన్నేయడాన్ని అతని బరితెగింపునకు పరాకాష్టగా కాలవ అభివర్ణించారు. కర్ణాటక కాంట్రాక్టర్లను బెదిరించడం ద్వారా జగన్ ప్రభుత్వ పరువును తీసినట్లు అయిందన్నారు.
అనంతపురం జిల్లా సరిహద్దుల్లో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలో తుంగభద్ర ఎగువ కాలువ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా ఏనాడూ కన్నెత్తి చూడని కాపు రామచంద్రారెడ్డి కర్ణాటక కాలువపై బుధవారం పర్యటించి కాంట్రాక్టర్లను బెదిరించడం సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు. హేచ్చెల్సీ పొడవునా గట్లు బలహీనంగా మారడంతో పాటు చాలా వంతెనలు శిథిలదశకు చేరుకున్నాయన్నారు. మూడేళ్ళ నుండి కనీస రిపేర్లు కూడా చేయించలేని అసమర్థ ఎమ్మెల్యే కాపు తగుదునమ్మా అంటూ కమీషన్ల కోసం కర్ణాటక కాలువపై తిరగడమెంటని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్ బరితెగింపుపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.