టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జులై 12న గుంటూరు జిల్లా గోవాడలో, జులై 13న పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్దిగాంచిన ద్వారకా తిరుమలలో గురువందన మహోత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా భజన మండళ్ల గురువులను ఘనంగా సన్మానిస్తారు. ఇప్పటివరకు వివిధ నదీ తీరాల్లో, మల్ఖేడ జయతీర్థుల సన్నిధానం, తిరుక్కోయిళూరు, భద్రాచలం, రాజమహేంద్రవరం వద్దగల కొవ్వూరు గోష్పాదక్షేత్రం, ఉడిపి క్షేత్రం, మంత్రాలయం, తిరుమల తదితర పుణ్యక్షేత్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ద్వారకాతిరుమలలో జరుగనున్న ఈ కార్యక్రమంలో సుమారు 7 వేల నుండి 8 వేల మంది వరకు భక్తులు స్వచ్ఛందంగా పాల్గొననున్నారు. ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. సాక్షాత్ శ్రీమహావిష్ణువు ద్వాపర యుగం చివరి భాగంలో వ్యాస భగవానుడిగా అవతరించారు. మహాభారతం, భాగవతం, బ్రహ్మ సూత్రాలు లాంటి అద్భుత వాఙ్మయరాశిని సృష్టించిన వ్యాస భగవానుడికి ప్రతిరోజూ గురువందనం చేయాల్సిందే. పూర్వకాలంలో ఋషులు, మునులు ఆషాఢ పౌర్ణమి రోజు వ్యాస భగవానుడిని పూజించేవారు. ఈ సంప్రదాయాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు కొనసాగిస్తూ ప్రతి ఏటా గురువందన మహోత్సవం నిర్వహిస్తోంది.