రాజకీయంగా మహిళలకు 33 శాతం కాదు… 50 శాతం రిజర్వేషన్ కావాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ చెప్పారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే, విద్య, పరిశోధన, వాణిజ్యంతోపాటు రాజకీయ సహకారం కూడా ఎంతో ముఖ్యమన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో విజయవాడలో వి.వి.లక్ష్మీనారాయణ తన పుట్టిన రోజు వేడుకను అనాధ బాలల మధ్య జరుపుకున్నారు. స్థానిక బావాజీపేటలోని నవజీవన్ బాల భవనం బాలల మధ్య కేక్ కట్ చేసి, వారితో సహపంక్తి భోజనం చేశారు. అనాధ బాలబాలికలకు ఆయన దగ్గరుండి వడ్డన చేశారు. నవజీవన్ బాల భవనంలో ఉండి ఉన్నత చదువులు చదువుకుంటున్న బాలబాలికలతో ఇష్ఠాగోష్ఠిలో పాల్గొన్న జేడీ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కూడా సక్రమంగా అమలు కావడం లేదని, కొన్ని చోట్ల భర్త, ఇతరులు అధికారం చెలాయించే దుస్థితి ఉందన్నారు. రాజకీయ వ్యవస్థ బాగుంటేనే, దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో తాను ఎన్నికల బరిలో ఖచ్చితంగా నిలుస్తానని, చట్ట సభలకు తనను పంపితే మహిళా రిజర్వేషన్ పై నిలదీస్తానని చెప్పారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని, విద్యార్థులు ప్రశ్నించగా…తనది సరికొత్త ప్రజల పార్టీ అని జేడీ లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. యువతరం చదువులు చదివి, ఉన్నత స్థానాలను ఆక్రమించి, దేశాభివృద్ధికి రాజకీయ తోడ్పాటు కూడా అందించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర నాయకులు పోతిన వెంకట రామారావు, నవజీవన్ బాల భవనం ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫాదర్ అంతయ్య, ఫాదర్ ఇగ్నిషియస్, పి.ఆర్.ఓ. మస్తాన్ పాల్గొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణతోటు, ఆయన నిర్వహిస్తున్న జేడీ ఫౌండేషన్ సభ్యులు బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు.