రాజధాని అమరావతి లోని భూములను వేలం పాటల ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేస్తోందని, రాజధాని భూముల వేలం వేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హెచ్చరించారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, కనబడ్డ భూముల్ని, కాలువలను, గుట్టలను, కొండలను, భవనాలను తాకట్టుపెట్టి, దోపిడీ చేసిన ప్రభుత్వానికి రాజధాని భూములపై ఎప్పటి నుంచో కన్ను పడిందని చెప్పారు. జీవో నెంబర్ 389 ద్వారా తొలివిడతగా పలు సంస్థలకు కేటాయించిన 248.34 ఎకరాలను ఎకరం 10 కోట్లు చొప్పున 2,480 కోట్లకు అమ్మేందుకు సిఆర్డీఎ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమరావతి ఎడారి అని, స్మశానం అనీ పేర్లు పెట్టిన ప్రభుత్వం రాజధాని భూములను ఎలా అమ్ముతుందని ప్రశ్నించారు. రాజధాని అభివృద్ధి పేరుతో జరిగే ప్రభుత్వ కుట్రలను రైతులు,కూలీలు, అన్ని జెఎసి నాయకులు కలసికట్టుగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చిన రైతుల తరాల శ్రమను అమ్ముకోవడం కంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుండి దిగిపోవడం రాష్ట్రానికి మేలు అని బాలకోటయ్య అభిప్రాయ పడ్డారు.