రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు బాగు చేసేవరకూ పోరాటం ఆగదని, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాటు పరిశీలించడానికి జిల్లా పార్టీ నాయకులు పుట్టపర్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కొత్తచెరువు లో అద్వానపు రహదారి పరిశీలనకు అధినాయకుడు వస్తున్న సందర్భంలో.. రాత్రికి రాత్రి అధికార పార్టీ నాయకులు రోడ్ల మరమ్మతుల కు పూనుకున్నారని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఆగిపోయిందని.. రోడ్ల మరమ్మతులు పూర్తి చేసే వరకు జనసేన పోరాటం ఆగదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్భాటపు ప్రకటనలు తప్ప నేటికీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట లేదన్నారు. నేడు జరిగే పవన్ కళ్యాణ్ పర్యటనలో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అభిమానులు తరలిరావాలని, శ్రమదానం లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పవన్ షెడ్యూల్ : పవన్ కళ్యాణ్ పర్యటన గురించి రాష్ట్ర పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త భవాని రవి కుమార్ వివరించారు. విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం రెండు గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా కొత్తచెరువు బయలుదేరి వెళ్తారు.నెహ్రూ సర్కిల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. కార్యకర్తలతో రహదారులపై శ్రమదానం చేపడతారు. అనంతరం ఐదు గంటలకు విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్తారని పేర్కొన్నారు. మరోవైపు జనసేన అధినేత స్వాగతం పలకడానికి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వరుణ్, ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, అబ్దుల్, జిల్లా కార్యదర్శి బొగ్గరం శీన, తిరుపతేంద్ర, విష్ణు వీర మహిళ కావేరి, పాల్గొన్నారు.