మనిషికి చదువుతో పాటు ఆటలు సైతం చాలా ముఖ్యం అని చదువు జ్ఞానాన్ని పెంచితే, క్రీడలు ఆరోగ్యాన్ని అందిస్తాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
దివంగత మంత్రి పేర్ని కృష్ణమూర్తి స్మారక 7 వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ 2021 క్రీడా పోటీలు మచిలీపట్నం మండలం తాళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం ఆర్బాటంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మంత్రి పేర్ని నాని, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి, కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ ఛైర్మెన్ గూడవల్లి నాగరాజు, యువనేత పేర్ని కిట్టు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ప్రతి మనిషి జీవితంలో క్రీడలు దైనందిక జీవితంలో భాగం కావాలని సూచించారు. విద్యా ర్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని తప్పక పెంపొందించుకొని, నైపుణ్యంతో క్రీడ ల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా శారీరక ధృఢత్వంతో పాటు, మాన సికోల్లాసం వృద్ధి చెందుతుందన్నారు. క్రీడలు మంచి సమాజానికి నాంది అని అలాగే అలాగే క్రమశిక్షణకు మారుపేరు క్రీడలని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, ఉత్తేజంతో పాటు చక్కని ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆ దిశగా తల్లితండ్రులు విద్యార్ధులను ప్రోత్సహించాలని సూచించారు. తమ పిల్లలకు చిన్ననాటి నుండే క్రీడలపై ఆసక్తి ఉండేవిధంగా తల్లితండ్రులు చొరవ చూపాలన్నారు. వివిధ జిల్లాల నుంచి సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, భోజనం, వసతి ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక క్రీడాకారిణి తమకు కేటాయించిన గదులలో ఫ్యాన్ , లైట్లు లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై స్పందించిన ఆయన తక్షణమే ఆ బాలికలకు ఆ సౌకర్యం కలుగచేయాలని సాయంత్రం వేళకు ఆయా ఏర్పాట్లు నిర్వాహకులు చేయకపోతే, మీ మొబైల్ ఫోన్లో గూగుల్ లో పేర్ని నాని ఫోన్ నెంబర్ అడిగి ఆ నెంబర్ ద్వారా తనకు తెలియచేయాలని సూచించారు.
అనంతరం రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి మాట్లాడుతూ, కష్టపడకుండా పేరు ప్రఖ్యాతులు లభించవని, ఒక స్థానానికి చేరుకోవాలంటే జీవితాంతం శ్రమించాల్సిందేనని అన్నారు. ఒకవేళ కష్ట పడినా నష్టపోయామంటే ఆ తప్పు మనది కాదన్నారు. క్రీడల వలన మంచి భవిష్యత్ ఉంటుందని తల్లితండ్రులు నమ్మాలని, ఆదిశగా చిన్ననాటి నుండే క్రీడాకారులను తయారు చేయాలని చెప్పారు. క్రీడలను ఒక కెరీర్ గా ఎంచుకోవాలని బైరెడ్డి సూచించారు. కృష్ణాజిల్లాలో క్రీడల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎంతో ప్రతిభ ఉండి కేవలం మట్టిలో మాణిక్యాలు మాదిరిగా వెలుగొందే వర్ధమాన క్రీడాకారులను వెలికి తీసేందుకు వైస్సార్ సీపీ యువజన నాయకులు పేర్ని కృష్ణమూర్తి ( కిట్టు ) ఈ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సాహించి తన వంతు సహాయ సహకారాలు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఆయా క్రీడలకు సంబంధించిన కోచ్ ల నియామకానికి అవసరమైన చర్యలను చేపడుతామన్నారు. క్రీడారంగంలో నూతన పాలసీని తీసుకువచ్చి.. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి పెద్దపీట వేయాలనేది.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష అన్నారు. ఆ దిశగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని స్పోర్ట్స్ అతరిటీల్లో మౌలిక వసతులు, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు అందివ్వడం జరుగుతోందన్నారు. క్రీడారంగం అభివృద్ధి చెందాలంటే.. క్రీడల గురించి బాగా తెలిసిన వారే ఖచ్చితమైన న్యాయం చేయగలరన్నారు. క్రీడలపై ప్రత్యేక అభిమానం వున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థను మరింత పటిష్టం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రభావం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితో పాటు.. క్రీడా రంగంపై అధికంగా పడిందన్నారు. దాంతో పాటు గత ప్రభుత్వ హయాంలో కూడా.. క్రీడారంగం ఆదరణకు నోచుకోలేక పోయిందని బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్నారు
తర్వాత కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ ఛైర్మెన్ గూడవల్లి నాగరాజు ప్రసంగిస్తూ, క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.
ఈ కార్యక్రమంలో తాళ్లపాలెం గ్రామ సర్పంచ్ ఎం. అశ్విని , రాష్ట్ర ఎస్సి కమీషన్ ఛైర్మెన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.