మంగళగిరి: అడిగిన వెంటనే పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ఒంగోలులో కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్టు బాలినేని తెలిపారు.
”పవన్ ఆదేశాల మేరకు పనిచేస్తా. అందరినీ కలుపుకొని జనసేన అభివృద్ధికి కృషిచేస్తా. జగన్‌ను బ్లాక్‌మెయిల్ చేసినట్టు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు రాశాయి. గతంలో నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైకాపాను వీడలేదు. జగన్‌ను నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నా. సమావేశాల్లో జగన్ ఎప్పుడూ నా గురించి మాట్లాడలేదు. నాతో పరిచయం లేకపోయినా పవన్ నా గురించి మంచిగా మాట్లాడారు. నాకు పదవులు ముఖ్యం కాదు.. గౌరవం కావాలి. స్వచ్ఛందంగా జనసేనలో చేరుతున్నా.. పదవులు ఆశించలేదు” అని బాలినేని తెలిపారు.