ఇరవైనాలుగు గంటలు ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు అధికారులను అదేశించారు. ఎవరు ఎక్కడినుండైనా ఏ సమయంలోనైనా ఇసుక బుకింగ్ చేసుకోగలిగేలా ఇసుక పోర్టల్ విధానాన్ని నవీకరించాలని స్పష్టం చేసారు. గురువారం సచివాలయంలో ఉచిత ఇసుక పంపణీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఇసుక నిర్వహణ విధానం నూతన పోర్టల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేస్తూ ఇసుక బుకింగ్ విషయంలో ఎటువంటి సమయ నిబంధనలు అవసరం లేదన్నారు. పోర్టల్ ఆవిష్కరణ నేపధ్యంలో ఇసుక బుకింగ్ కు సంబంధించి తదుపరి రోజుకు అందుబాటులో ఉన్న ఇసుక మాత్రమే బుక్ అవుతుందని అధికారులు వివరించగా, ప్రజల సౌకర్యార్ధం దానిని వారం రోజుల నిడివికి పొంచాలని ఆదేశించారు. ఫలితంగా రానున్న వారం రోజులలో అందుబాటులో ఉన్న ఇసుకను ఎవరైనా బుక్ చేసుకునే వెసులు బాటు లభించినట్లయ్యింది. ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని తక్షణ పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక హామీకి కట్టుబడి ఉందని , ఆక్రమంలోనే ప్రతి ఒక్కరూ ఇసుకను పొందగలిగేలా పారదర్శకతకు పెద్దపీట వేయాలని సూచించారు. మరో వైపు చిన్న వాగులు, వంకలలో ఉండే ఇసుక విషయంలో సమీప గ్రామాల ప్రజలకు ఇబ్బంది పట్టరాదన్నారు. వారు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఎటువంటి రుసుము చెల్లించకుండా ఇసుక తీసుకువెళ్లగలిగేలా నిబంధలను రూపొందించాలన్నారు. అక్రమ రవాణఆ మైనింగ్ కు అవకాశంలేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ వ్యవస్ధను పటిష్టపరిచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు అధికారులకు స్ఫష్టమైన అదేశాలు జారీ చేసారు.
అబ్కారీ, గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇసుక సరఫరా కు సంబంధించి మూడో పార్టీ తనిఖీకి పెద్ద పీట వేస్తున్నామని, ప్రతి అంశాన్ని మూడో పార్టీ ఎప్పటి కప్పుడు నిశితంగా గమనిస్తూనే ఉంటుందన్నారు. నూతన ఇసుక పోర్టల్ వల్ల వివిధ దశలలో అనుక్షణం నిఘా ఉంటుందని, అధికారుల మొదలు రవాణా దారుల వరకు ఏఒక్కరూ తప్పు చేయలేని విధంగా దీనిని రూపొందించామని తెలిపారు. అయా జిల్లాలకు సంబంధించి కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్ధాయి కమిటీలు స్దానిక వ్యవస్ధలను నియంత్రిస్తాయని తెలిపారు. పోర్టల్ లో జిల్లాల వారిగా సప్లయ్ పాయింట్ లు, రవాణ చార్జీలు, ఆరోజుకు అందుబాటులో ఉన్న ఇసుక వంటి వివరాలను చూపుతుందన్నారు. లారీల యజమానులు, మధ్యవర్తులు పేరిట వసూలు చేస్తున్న అధిక ధరలను నియంత్రిటానికి పోర్టల్ మార్గం చూపుతుందన్నారు. రవాణా కోసం లారీలను ఎంపానల్ చేస్తున్నామన్నారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలు ఎదుర్కునే ఇబ్బందులను టోల్-ఫ్రీ నంబర్ 1800-599-4599, ఇమెయిల్-ఐడి: dmgapsandcomplaints@yahoo.com., ద్వారా కాని ఫిర్యాదు చేయవచ్చని, ప్రతి ఫిర్యాధు పైనా తప్పని సరిగా చర్య తీసుకుని, సంబంధిత వ్యక్తులకు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల నుండి తిరిగి సమాచారం అందిస్తారని సిఎంకు వివరించారు. ఉచిత ఇసుక ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వం మేరకు వ్యవహరిస్తున్నమన్నారు.
ఈ సందర్భంగా గనులు, భూగర్భ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఇసుక రవాణా లారీలకు జిపిఎస్ అనుసంధానం చేయటం వల్ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయగలుగుతామన్నారు. ఫీడ్ బ్యాక్ మెకానిజంకు పెద్దపీట వేసామని, ఐవిఆర్ ఎస్ కాల్స్ ద్వారా ఎప్పటి కప్పుడు వినియోగదారుల నుండి స్పందనను తీసుకుంటామన్నారు. రాష్ట్రమంతా ఒకే రీతిన రవాణా చార్జీలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, లారీల యజమనూలు నిర్దేశిత మొత్తం కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకునేలా నిబంధనలను రూపొందించామని వివరించారు. అన్ని రకాల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ పోలీసు యంత్రాంగం నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసామని, పటిష్టంగా చెక్ పోస్టులను నిర్వహిస్తామని తెలిపారు. ఇసుక కొరత లేకుండా స్టాక్‌యార్డ్ లలో లోడింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. గనుల శాఖ సంచాలకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇసుక ఎగుమతి కేంద్రాలలో సిసి టివి నిఘా ఉంచుతున్నామని ముఖ్యమంత్రి దృష్టకి తీసుకువచ్చారు. జిల్లా స్ధాయి కమిటీలను తగిన బాధ్యతలు, అధికారాలు అప్పగించామని పేర్కొన్నారు. పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిఎంఓ అధికారులు, గనుల శాఖ అధికారులు పాల్గొన్నారు.