తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో శ్రీ జె శ్యామల రావు చెప్పారు.
శ్రీనివాసమంగాపురం, శ్రీవారి మెట్టు మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కొంతమంది భక్తులు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు, జేఈఓ (విద్యా, వైద్యం) శ్రీమతి గౌతమి పర్యవేక్షణలో టీటీడీ ఎస్టేట్ అధికారి శ్రీ గుణ భూషణ్ రెడ్డి శ్రీవారి మెట్టు వద్ద ఉన్న మూడు షాపులను తనిఖీ చేశారు. ఇందులో షాప్ నంబర్-3లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో తిరుమల, తిరుపతిలలో ఎక్కడైనా భక్తులకు టీటీడీ నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.
అదేవిధంగా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించిన షాప్ నెంబర్ -3 శ్రీ వినోద్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, రూ.25 వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది.