‘ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాల మధ్య ఎల్లపుడూ ఓ సహృద్భావ వాతావరణం ఉంటుంది. రెండు పొరుగు రాష్ట్రాలు పాలనపరమైన విషయాల్లో, ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో ఒకరికొకరు సహకరించుకోవడంలో ముందుంటాయి. అటవీ శాఖపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల సమష్టి సమావేశంలో ఏడు ప్రత్యేకమైన అంశాలు చర్చకు వచ్చాయి. దీనిపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు ఏకాభిప్రాయం వెలిబుచ్చి మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఏంఓయూ) చేసుకోవడం ఆనందం కలిగించింది. కీలకమైన అంశాలపై చర్చ జరగడంతో పాటు భవిష్యత్తులో రెండు రాష్ట్రాల అటవీ అధికారులు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గురువారం బెంగళూరు విధానసౌధలో కర్ణాటక అటవీశాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ బి. ఖండ్రే గారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై ఎంఓయూలు కుదుర్చుకొని సంతకాలు చేశారు. ఈ సమావేశం అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “అటవీ శాఖా మంత్రిగా అధికారులతో సమీక్ష సందర్భంగా కర్ణాటక సరిహద్దును పంచుకుంటున్న చిత్తూరు జిల్లా గ్రామాలతో పాటు పార్వతీపురం మన్యం ప్రాంతంలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉందని నా దృష్టికి వచ్చింది. ఇవి పంట పొలాలను నాశనం చేయడం వల్ల విపరీతమైన ఆస్తినష్టం జరగడంతో, ప్రాణనష్టం కూడా జరుగుతోంది. దీనికి పరిష్కారంగా ఏనుగుల దారి మళ్లించేందుకు ఎంతగానో ఉపయోగపడే కుంకీ ఏనుగుల ప్రస్తావన వచ్చింది. కుంకీ ఏనుగులు కర్ణాటక అటవీశాఖ వద్ద ఉన్నాయని అధికారులు చెప్పగానే, కర్ణాటక పాలకులతో మాట్లాడాను. వారు వెంటనే స్పందించి నన్ను బెంగళూరు రావాలని ఆహ్వానించడం ఆనందం కలిగించింది. ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందించడానికి సిద్ధమైన కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక మీదట కూడా రెండు రాష్ట్రాలు ఇదే సహకారంతో సమష్టిగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను.
• ఏడు అంశాలపై ప్రత్యేకంగా చర్చించాం
సమావేశంలో ఏడు ప్రత్యేక అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాం. ముఖ్యంగా శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనం నరికివేత మీద చర్చించాం. ఎంతో విలువైన ఎర్రచందనం ఇతర దేశాలకు అక్రమంగా తరలివెళ్లడం మీద కర్ణాటక అధికారులు కూడా దృష్టి సారించాలని కోరాం. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా కర్ణాటక, తమిళనాడు ఇతర ప్రాంతాల మీదుగా ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతోంది. కర్ణాటక అధికారులు కూడా అక్రమంగా రవాణా అవుతున్న రూ.140 కోట్ల ఎర్రచందనాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. ఇది కర్ణాటక అటవీశాఖ ఆధీనంలో ఉంది. ఇంత భారీ మొత్తంలో ఎర్రచందనం పట్టుకున్న అధికారులకు అభినందనలు. దీన్ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కు తీసుకెళ్లాలనే దానిపై మరోసారి చర్చించి ముందుకు వెళ్తాం. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి కర్ణాటక అధికారులు తగిన విధంగా సహకరించాలని కోరాం.
అటవీ ఉత్పత్తులు పక్కదారి పట్టకుండా సాంకేతికను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా శాటిలైట్ ఆధారిత నిఘా పెట్టి అటవీ ఉత్పత్తులు పక్కదారి పట్టకుండా చూడాలని నిర్ణయించాం. టెక్నాలజీని పంచుకునే విషయంలో కూడా ఇరు రాష్ట్రాలు తగిన విధంగా సహకరించుకుంటాయి.
వేటగాళ్లను నియంత్రించడం, వణ్యప్రాణుల వేట విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించాం. ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు వేటను పూర్తిగా నిషేధించేందుకు, దాని వెనుక కారణాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు తగు విధంగా ఉమ్మడిగా ముందుకు వెళ్తారు. అడవుల్లో వణ్యప్రాణులు సైతం వసుధైక కుటుంబంలో ఓ భాగం. వాటి రక్షణకు కట్టుబడి ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగిన వెంటతనే 8 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఇవ్వడానికి అంగీకరించింది. వీటికి తగిన శిక్షణ ఇచ్చి పంపడమే కాకుండా, పర్యవేక్షణ చేసేందుకు కూడా అంగీకరించింది. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనుగుల వల్ల పంట, ఆస్తి నష్టం తగ్గుతుందని ఆశిస్తున్నాం. కుంకీ ఏనుగులపై సత్వర నిర్ణయం తీసుకున్నందుకు ఆనందంగా ఉంది.
ఎకో టూరిజం అభివృద్ధికి రెండు రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను చర్చించాం. అలాగే సఫారీ, జంగిల్ టూర్ వంటి పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించాం. పర్యావరణ హితమైన ఎకో టూరిజం ప్రోత్సాహం మీద చర్చించాం.
పూర్తిస్థాయిలో అడవులు, వాటి రక్షణ విషయంలో రెండు రాష్ట్రాల అధికారులు సమష్టి సహకారంతో ముందుకు సాగుతారు. వర్క్ షాపులు, సమావేశాలు నిర్వహణతో ముందుకు వెళ్తారు. పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించాం.
కన్నడలో అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంటాను
కన్నడ సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు అమితమైన గౌరవం. ఇక్కడి భాష గొప్పగా ఉంటుంది. కన్నడలో అనర్గళంగా మాట్లాడేలా నేర్చుకుంటాను. కన్నడ కంఠీరవ, అగ్ర కథానాయకులు శ్రీ రాజ్ కుమార్ గారు నటించిన ‘గంధద గుడి’ సినిమాలో అటవీ పరిరక్షణ గురించి చెబుతుంది. అడవులకు రక్షణగా ఉండే డి.ఎఫ్.ఓ. పాత్రను హీరోగా ఆ చిత్రంలో చూపారు. ఇప్పుడు సినిమాల్లో ఆ తీరు మారింది. అడవులు కొట్టేవారు హీరోగా కనిపిస్తున్నారు. అడవుల రక్షణకు సామాజిక చైతన్యం కూడా చాలా అవసరం. ప్రజల్లో కూడా దీనిపై చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు మొదలు కావాలి. అటవీ ఉత్పత్తుల రక్షణ, వణ్య ప్రాణులకు భద్రత, స్మగ్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు అడవుల పెంపుదలకు ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ ఉమ్మడిగా పనిచేస్తాయి. ఎంఓయూ ప్రకారం ఓ ప్రణాళికతో ముందుకు వెళ్తాం. అలాగే కర్ణాటక నుంచి అధికంగా యాత్రికులు శ్రీశైలం, తిరుమలకు వస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో యాత్రీకుల సదన్ నిర్మాణం నిమిత్తం తగిన భూమి కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి స్థలాలు కేటాయించేలా చొరవ తీసుకుంటాను’’ అన్నారు.
• అంతరాష్ట్ర ఒప్పంద మేరకు సమష్టిగా ముందుకెళ్తాం : శ్రీ ఈశ్వర్ బి.ఖండ్రే గారు
కర్ణాటక రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ బి.ఖండ్రే గారు మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి కర్ణాటకతో మంచి సంబంధాలున్నాయి. అటవీ శాఖకు సంబంధించి రెండు రాష్ట్రాలు కీలకమైన అంశాలను చర్చించాయి. సమావేశం చక్కగా సాగింది. ఎర్రచందనంతో పాటు ఏనుగుల సమస్యను అధికారులు చెప్పారు. అలాగే సాంకేతికత అంశాలు పంచుకోవడం, అధికారులు కలిసి ఎలా పని చేయాలనే అంశాలను చర్చించాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిక మేరకు 8 కుంకీ ఏనుగులను ఇచ్చేందుకు అంగీకరించాం. తగిన శిక్షకుల సాయంతో వాటిని చక్కగా పనిచేసేలా చూస్తాం. కుంకీ ఏనుగులను ఇప్పటికే ఛత్తీస్ ఘడ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు అందించాం. పర్యావరణ రక్షణ, అడవులపై మమకారం చూపించే శ్రీ పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఇక్కడకు వచ్చి సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులోనూ రెండు రాష్ట్రాల మధ్య సహాయసహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.’’ అన్నారు. విలేకర్ల సమావేశంలో కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ ఎన్.ఎస్.బోసు రాజు గారు పాల్గొన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
సమావేశానికి వచ్చే ముందు ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. శ్రీ సిద్ధరామయ్య గారు తన మంత్రివర్గ సహచరులను, అధికారులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. అనంతరం శ్రీ సిద్ధరామయ్య గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సత్కరించారు.
మీడియా సమావేశం తరువాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ ఈశ్వర్ బి.ఖండ్రే గారు కర్ణాటక అరణ్య భవన్ కు వెళ్లారు. అక్కడ అటవీ శాఖ అధికారులు లీవరేజింగ్ టెక్నాలజీ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అడ్మినిస్ట్రేషన్, మేనేజ్ మెంట్ అంశాలను వివరించారు. అటవీ, వణ్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశాలను ఇరువురు మంత్రులకు చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు మరోసారి సమావేశం అవుదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.
ఈ సమావేశంలో కర్ణాటక రాష్ట్ర అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శ్రీ బ్రిజేష్ కుమార్ దీక్షిత్, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శ్రీ చిరంజీవి చౌదరి, కర్ణాటక అటవీశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ శ్రీ మంజునాథ్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అనంతరాము తదితరులు పాల్గొన్నారు.