ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బలగం సినిమా టీంకు ఘనంగా సన్మానం జరిగింది. ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమా ఖచ్చితంగా జనాదరణ పొందుతుందని నాకు నమ్మకం ఎప్పటి నుంచో ఉందని అన్నారు. ఒకానొక సమయంలో ఓటిటి కి ఇద్దామని అనుకున్నప్పటికీ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించామని అన్నారు.
ఈ సినిమా ను థియేటర్లలోనే చూసే ఫీలింగ్ వేరని అన్నారు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించే సినిమా అని అన్నారు
దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇలా అందరూ అద్భుతంగా నటించారని అన్నారు.
వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమౌతున్న ‘బలగం’ చిత్రానికి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు సభాధ్యక్షులుగా వ్యవహరించారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ…
54 సంవత్సరాల క్రితం ఏర్పడిన ప్రఖ్యాత సంస్థ అయిన ఈ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌కు నేను రెండోసారి అధ్యక్షుడిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు ఈ అసోసియేషన్ అభినందన సభలు ఏర్పాటు చేయడం ఒక రిపోర్టర్‌గా నేను చూశాను. ఈ ‘బలగం’ సినిమా విషయానికి వస్తే.. మంచి కంటెంట్.. కంటతడి ఉన్న సినిమా. మొట్ట మొదటి సారిగా దిల్‌రాజు గారు ఆయన పేరుతో దిల్‌రాజు ప్రొడక్షన్స్ అనే ఒక బ్యానర్‌ను స్థాపించి.. అంతా కొత్త వారితో సినిమా చేస్తున్నారు అంటే.. ఏదో విషయం లేకుండా చేయరు అనుకున్నా.. ఈ సినిమా విజయం నా అంచనాను నిజం చేసింది. దర్శకుడు వేణు నాకు మంచి మిత్రుడు. తెలుగు సినిమా పరిశ్రమకు దిల్‌రాజు గారు ఒక బలం.. ఆయన వెనుక ఎంతో బలగం ఉంది. ఈ బ్యానర్‌లో ఇలాంటి మంచి సినిమాలు సంవత్సరానికి ఒకటన్నా తీయాలని కోరుకుంటున్నాను. యూనిట్ అందరికీ మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం అన్నారు.
సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ…
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అనేది 54 సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప అసోసియేషన్. అటు ప్రేక్షకులకు, ఇటు పరిశ్రమకు వారధిగా ఉంటూ ఎన్నో మంచి చిత్రాలను ప్రేక్షకుల దగ్గరకు చేర్చిన చరిత్రగల అసొసియేషన్ ఇది. చిత్ర పరిశ్రమ కూడా ఈ అసోసియేషన్‌కు గొప్ప స్థానం ఇచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు నంది అవార్డ్ గ్రహీతలను ఈ అసోసియేషన్ సన్మానిస్తే వాళ్లు.. నంది అవార్డ్ అంత గొప్పగా ఈ క్రిటిక్స్ సన్మానాన్ని కూడా భావించేవారు. అక్కినేని నాగేశ్వరరావు గారి నట జీవితం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాంగా ఎన్నో సంస్థలు వారిని సన్మానించాలని అడిగాయి. అయితే ఆయన మా క్రిటిక్స్ అసోసియేషన్‌ను సభ్యులను పిలిచి.. మిగిలిన వారి నుంచి సన్మానాలు పొందటానికి ముందు మీ అసోసియేషన్ నుంచి సన్మానం పొందితే నాకు గౌరవంగా ఉంటుంది అని అడగడం ఎంత గొప్ప విషయం. పేరుకే మేం క్రిటిక్స్ కానీ.. మేమంతా సినిమా ప్రేమికులం. సినిమా ఇండస్ట్రీలో మేం కూడా ఓ క్రాఫ్ట్‌కిందే లెక్క. ఇటీవల కాలంలో క్రిటిక్స్ నుంచి అభినందనలు అందుకున్న సినిమా ఈ ‘బలగం’. దీన్ని అప్రిషియేట్ చేయడం మా బాధ్యత. తెలంగాణ మట్టి వాసనతో రూపొందిన ఇలాంటి మంచి సినిమాలకు ప్రేక్షకులో పాటు, సినిమాలకు సంబంధించిన అసొసియేషన్‌లు కూడా తమ ప్రోత్సాహాన్ని అందించాలి అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ…
ఈ సినిమా చూస్తుంటే మా ఇంట్లో నా చిన్నతనంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. ఇలాంటి మంచి సినిమా తీసిన నిర్మాత దిల్‌రాజు గారికి, యూనిట్ అందరికీ హృదయ పూర్వక అభినందనలు అన్నారు.
హీరోయిన్ కావ్య మాట్లాడుతూ…
ఎన్నో వేల సినిమాలను చూస్తూ.. వాటిలోని లోటుపాట్లను గమనిస్తూ.. తమ రివ్యూల ద్వారా వ్యక్త పరిచే ఫిలిం క్రిటిక్స్‌ను మెప్పించడం అంటే మాటలు కాదు.. మా ‘బలగం’ వారి మెప్పు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. క్రిటిక్స్ అభినందన సభతో నిజంగా మేం గెలిచాం అనిపిస్తోంది అన్నారు.
హీరో దర్శి మాట్లాడుతూ…
మా బలగం క్రిటిక్స్ సత్కారానికి నోచుకోవడం నిజంగా మా అదృష్టం.. ఇందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మీ అభినందన మాకు ఎక్కడలేని బలాన్ని తెచ్చిపెడుతుంది. కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజమ్ అనేది నటీనటుకు, టెక్నీషియన్స్‌కు ఎంతగానో ఉపయోగ పడుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత దిల్ రాజుగారికి, దర్శకుడు వేణు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్నారు.