ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లను విక్రయించనున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి పేర్ని నాని స్పందించారు.
ఈ విషయంలో ప్రభుత్వంపై విపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు.
సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అమరావతిలో స్పష్టం చేశారు.
ఈ అంశంపై కమిటీలు వేశామని, అధ్యయనం జరుగుతోందని మంత్రి చెప్పారు.
త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.
ఈ విషయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం మంచి పని ఏది చేపట్టినా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మాలని సినీ ప్రముఖులే కోరారని, సినీ పెద్దల సూచనలనే ప్రభుత్వం పరిశీలించిందని మంత్రి స్పష్టం చేశారు.
పన్ను ఎగవేత జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం గమనించిందన్నారు.
బ్లాక్ టిక్కెట్లను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.
నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతో త్వరలోనే భేటీ అవనున్నట్లు నాని వెల్లడించారు.
ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వ ప్రయత్నమన్న నాని టికెట్ ధర, ఎక్కువ షోలు నియంత్రిస్తూ ఏప్రిల్ 8న జీవో ఇచ్చినట్లు స్పష్టం చేశారు.