అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివారులోని సర్వే నం.329లో ఒక్క సెంటు భూమి తన పేరున ఉన్నా…. తాను ఆక్రమించినట్లు నిరూపించినా.. తన పదవికి రాజీ నామా చేస్తానని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. సుబేదారు చెరువు కబ్జా చేశారంటూ రెండు రోజుల క్రితం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉమా మహేశ్వర నాయుడు హైకోర్టులో పిటీషన్ వేయడంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఉన్న మంత్రి గురువారం ఫోన్ ద్వారా స్థానిక విలేకరులతో మాట్లాడారు. తన పేరున ఎకరం కాదు..సెంటు ఉన్నా కళ్యాణదుర్గంలో అడుగు పెట్టనన్నారు. “నీకు దమ్మూ, ధైర్యం ఉంటే ఆరోపణలను రుజువు చెయ్.. లేనిపక్షంలో కళ్యాణదుర్గంలో అడుగు పెట్టకుండా ఉండగలవా..?” అని ఉమా మహేశ్వర నాయుడుకు ఆమె సవాల్ విసిరారు. అవన్నీ పట్టా భూములని అప్పటి జేసీ ఢిల్లీరావు తేల్చారని..
గుర్తుచేశారు. పట్టాభూములని తెలిసినా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ గోవిందప్ప ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆక్రమణలు గుర్తు రాలేదా.. అతను మీ పార్టీకి చెందిన వాడు కాదని చెప్పగలవా… అని ప్రశ్నించారు. అక్కడ చెరువు ఉన్నట్లు కోర్టు తేల్చితే… కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులతో పాటు సుబేదారు చెరువుకు కచ్చితంగా సాగునీరు తీసుకువస్తానని మంత్రి స్పష్టంచేశారు. సదరు సర్వే నంబర్లో చెరువు ఉందా..పట్టాలున్నాయా.. అనే అవగాహన కూడా లేని స్థానికేతరుడు ఉమా అని మండిపడ్డారు. అధినేత మెప్పు కోసం ఒక బీసీ మంత్రిపై అక్కసు వెళ్లగక్కడానికి సిగ్గు లేదా అంటూ విరుచుకుపడ్డారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ఉండి మంచి చేయాలన్నారు. టికెట్ కోసం ఇలా అడ్డదారులు తొక్కుతూ ఆరోపణలు చేయడం సరైంది కాదని హితవు పలికారు.