ప్రతి చిన్నారీ సురక్షితమైన, ప్రోత్సాహకరమైన వాతావరణంలో ఎదగడానికి, ఆడుకోవడానికి, నేర్చుకోవడానికి అవకాశం ఉండాలి. విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, చట్టాలను అమలు చేయడం, జనంలో అవగాహన పెంచడం, కుటుంబాలకు మద్దతు అందించడం ద్వారా ఏ ఒక్క చిన్నారీ బాలకార్మికులుగా మారే పరిస్థితులు లేని భవిష్యత్తును మనం సృష్టించవచ్చు” అని CRY సౌత్ రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ చెప్పారు.
అమరావతి, జూన్ 12, 2024: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినాన్ని పాటిస్తూ, ప్రముఖ భారతీయ స్వచ్ఛంధ సంస్థ CRY – చైల్డ్ రైట్స్ అండ్ యు ఈ ఏడాది ‘‘బాలలకు బాల్యాన్నిద్దాం.. బాలకర్మికతను తిరస్కరిద్దాం‘‘ (లెట్ చైల్డ్ హుడ్ థ్రైవ్, సే నో టు చైల్డ్ లేబర్) అనే పేరుతో మూడు రోజుల క్యాంపెయిన్ నిర్వహించింది. ఇందులో భాగంగా జూన్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులలోని వివిధ అవగాహన, బాలకార్మికుల రక్షణ కార్యక్రమాలను చేపట్టింది.
ఈ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో CRY ప్రాజెక్టులు అమలవుతున్న ప్రాంతాల్లో 18 జిల్లాలు, 25 మండలాలు, 350 గ్రామాలలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కృష్ణ, అన్నమయ్య, తిరుపతితో నాలుగు జిల్లాల్లో, తెలంగాణలోని ఖమ్మం, మేడ్చల్ రెండు జిల్లాల్లో నిర్వహించిన ఈ క్యాంపెయిన్లో బాల కార్మికతను నిర్మూలించాలన్న CRY నిబద్ధతకు అనుగుణంగా అవగాహన, బాలకార్మికుల రక్షణ కార్యక్రమాలు సాగాయి. CRY తన ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో బాలకార్మికతను నిర్మూలించడానికి గత ఏడాది ప్రారంభించిన క్యాంపెయిన్ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తోంది.
CRY సౌత్ రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ ఈ క్యాంపెయిన్ ప్రాధాన్యతను ఉద్ఘాటించారు: ‘‘పిల్లల హక్కులను పరిరక్షించటంలో మన సామూహిక బాధ్యతను ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం మనకు గుర్తు చేస్తుంది. మేం పనిచేస్తున్న ప్రాంతాల్లోని అన్ని గ్రామాలను బాల కార్మిక రహితంగా మార్చడం మా క్యాంపెయిన్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మేము మా అవిశ్రాంత కృషిని కొనసాగిస్తాం.’’
క్యాంపెయిన్ ముఖ్యాంశాలు:
డ్రాయింగ్, పెయింటింగ్ కార్యక్రమాలు: బాల కార్మికతను నిర్మూలించాల్సిన ప్రాధాన్యత గురించి అవగాహన పెంచుతూ, చిన్నారులు తమ కలలు, ఆకాంక్షలను వ్యక్తీకరించడానికి చిన్నారులను డ్రాయింగ్, పెయింటింగ్ కార్యకలాపాలలో నిమగ్నం చేయడం జరిగింది.
పాఠశాలల్లో అవగాహన ప్రచారాలు: బాల కార్మికత దుష్ప్రభావాల గురించి, విద్య ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేయడానికి పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
బాలల సంఘాల్లో అవగాహన: బాలల సంఘాల్లోని చిన్నారులకు వారి హక్కుల గురించి, పనికి వెళ్లడంకంటే బడికి వెళ్లాల్సిన ప్రాధాన్యత గురించి అవగాహన సెషన్లను నిర్వహించడం జరిగింది.
కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు: బాల కార్మికత దుష్ప్రభావాలు, పర్యవసానాల గురించి పెద్దలకు అవగాహన కల్పించడానికి, పిల్లల చదువుకు, వారి శ్రేయస్సుకు మద్దతును అందించేలా ప్రోత్సహించడానికి సమాజిక బృందాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
బాల కార్మికుల రక్షణ కార్యక్రమాల సమన్వయం: బాల కార్మికులుగా ఉన్న పిల్లలను రక్షించడం, వారికి పునరావాసం కల్పించే కార్యక్రమాల్లో స్థానిక అధికారులకు సహకరించడం, సమన్వయం చేసుకోవడం జరిగింది.
‘‘అత్యవసరంగా స్పందించాల్సిన సమయం’’
అంతులేకుండా కొనసాగుతున్న బాల కార్మికత సమస్యపై జాన్ రాబర్ట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు: “వ్యవసాయ పనులు, ఇంటి పనులు, వస్త్ర పరిశ్రమలు, బాణసంచ పరిశ్రమలు, ఇటుక బట్టీలు వంటి చిన్న పరిశ్రమలు.. ఇలా చాలా రంగాల్లో బాల కార్మికులు కొనసాగుతున్నారు. ఆర్థిక కష్టాలు, నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడంతో పాటు.. పిల్లలు పనిచేయటం తప్పుకాదు అనే సామాజిక సాంస్కృతిక ఆమోదం వల్ల బాల కార్మికత ఇప్పటికీ కొనసాగుతోంది. చాలా కుటుంబాలకు తమ పిల్లల చదువును పణంగా పెట్టి, వారి భవిష్యత్తుతో రాజీపడుతూ, చిన్నారులను పనికి పంపడం తప్ప వేరే దారి కనిపించదు.”
బాలకార్మికత తీవ్ర పర్యవసానాల గురించి జాన్ రాబర్ట్స్ వివరించారు: బాల కార్మికత అనేది చిన్నారుల బాల్యాన్ని కాలరాస్తుంది. వారు బడికి వెళ్లే అవకాశాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆడుకునే అవకాశాన్ని, సురక్షితంగా సమగ్రంగా ఎదిగే అవకాశాన్ని కోల్పోతారు. చిన్నారులు శారీరకంగా, మానసికంగా ప్రమాదకర పరిస్థితులకు గురవుతారు. ఇది వారి అభివృద్ధిని కుంగదీస్తుంది. వారి భవిష్యత్తు అవకాశాలను పరిమితం చేస్తుంది. ఈ ప్రమాదకర పర్యవసానాలు చిన్నారులు జీవిత పర్యంతం కొనసాగుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, పరిమిత ఉద్యోగ అవకాశాల కారణంగా వారు ఒక శాశ్వత పేదరిక విషవలయంలో చిక్కుకుపోతారు.’’
బాల కార్మికత (నిషేధం, నియంత్రణ) చట్టం, విద్యా హక్కు చట్టం వంటి ప్రస్తుత చట్టాలు ఉన్నప్పటికీ, అవి పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. “వ్యవస్థీకృత సమస్యలు, సమాజంలో అవగాహన కొరవడడం వల్ల చాలా మంది చిన్నారులు చితికిపోతున్నారు” అని రాబర్ట్స్ పేర్కొన్నారు.
ఈ పరిస్థితులపై తక్షణ స్పందన, చర్యలకు పూనుకోవాలని జాన్ రాబర్ట్స్ పిలుపునిచ్చారు: “భారతదేశంలో బాల కార్మికతను అంతం చేయడానికి ప్రభుత్వాలు, పౌర సమాజం, కార్పొరేట్ సంస్థలు, పౌరులు సామూహికంగా కృషి చేయాలి. “ప్రతి చిన్నారీ సురక్షితమైన, ప్రోత్సాహకరమైన వాతావరణంలో ఎదగడానికి, ఆడుకోవడానికి, నేర్చుకోవడానికి అవకాశం ఉండాలి. విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, చట్టాలను అమలు చేయడం, జనంలో అవగాహన పెంచడం, కుటుంబాలకు మద్దతు అందించడం ద్వారా ఏ ఒక్క చిన్నారీ బాలకార్మికులుగా మారే పరిస్థితులు లేని భవిష్యత్తును మనం సృష్టించవచ్చు.”
ఈ పోరాటంలో పాలుపంచుకోవాలని ఆయన సమాజాన్ని కోరారు: “బాలల హక్కులను బలోపేతం చేసే కార్యక్రమాలకు మీ మద్దతు ఇవ్వండి. మీ సమయాన్ని స్వచ్ఛందంగా అందించండి. అవగాహనను వ్యాపింపజేయండి. మరింత బలమైన విధానాల కోసం గొంతెత్తండి. మనం ఉమ్మడిగా కృషిచేయడం ద్వారా మన సమాజంలోని ప్రతి చిన్నారీ స్వేచ్ఛగా, సురక్షితంగా ఎదిగే అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయగలం. బాల కార్మికత అంతం అనేది మనతోనే మొదలవుతుందని గుర్తుంచుకోండి. ఆ లక్ష్యాన్ని సాధిద్దాం’’ అని పిలుపునిచ్చారు.