విద్యుత్ బిల్లు నెలకు రెండు వేల రూపాయలు ఒకవైపు చెల్లిస్తూ, మరోపక్క పేదలకు దక్కాల్సిన రేషన్ కొందరు ధనికవర్గ పెద్దలు తింటున్నరని, ఆ వ్యక్తుల జాబితా.. వారి ఆర్ధిక స్థితిగతులు పరిశీలిస్తే, తనకు ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) విస్మయం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని ముఖాముఖిగా సంభాషించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
స్థానిక 25 వ డివిజన్ కార్పొరేటర్ కొలుసు హరిబాబు తన పరిధిలో కొందరు పింఛన్ దారులకు పింఛన్ తొలగించనున్నట్లు నోటీసులు వచ్చినట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై మంత్రి స్పందిస్తూ, ఈ నెల 11లోగా మరోసారి తనిఖీలు చేపట్టి అనర్హుల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇటీవల అందాయిని దీంతో అధికారులు ఆ నిబంధనల మేరకు లేని పింఛన్లను పార్టీలకు అతీతంగా తొలగించేందుకు సిద్ధమయ్యారన్నారు. ఇందులో అత్యధికంగా కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందనో, లేక ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నాయనో లేక ఇంట్లో రెండు పించన్ల ఉన్నాయనే నిబంధన ప్రకారం అనర్హత కారణంగా ఆయా పింఛన్ల తొలగింపు తధ్యం అంటూ అధికారులు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసేరన్నారు. రాష్ట్రంలో పెన్షన్, రేషన్ కార్డులను తొలగించకుండా ఉంచాలంటే, కొత్తది మంజూరు చేయాలంటే కరెంటు బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావించండన్నారు. రాష్ట్రంలో 200 యూనిట్‌లు దాటితే తెలుపు రేషన్ ఆగిపోవడం , 300 యూనిట్‌లు దాటితే పెన్షన్ నిలిచిపోయే నిబంధన అమల్లో ఉందన్నారు. కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్నారా? లేదా? అనే విషయాలను వాలంటీర్లు ఇప్పటికే ఇంటింటికి సర్వే చేస్తున్నారని మంత్రి వివరించారు.
మచిలీపట్నం మండలం శిరివెళ్లపాలెం గ్రామానికి చెందిన శిరివెళ్ల నాగేశ్వరమ్మ మంత్రిని కలిసి తన కష్టాలు ఏకరువు పెట్టింది. తన కోడలు తనను సరిగా చూడదని, తాను నీటి బోరు వేయించానని, కోడలు ఆ నీరు పట్టుకోనివ్వకుండా పైప్ కోసివేసిందని ఆమె మాత్రం వేరే నీటి పైప్ కొనుక్కొని ఆమె మాత్రమే నీరు పట్టుకొంటుందని దారుణమైన బూతులు తిడుతూ నిత్యం వేధిస్తోందని పిర్యాదు చేసింది.
స్థానిక చిలకలపూడికి చెందిన ఒక చర్చికు కొందరు పెద్దలు వచ్చి మంత్రిని కలిశారు. తమ చర్చికు అత్యధిక పన్ను విధించారని తమ స్థలంలోనే లైసెన్సుడ్ సర్వెయర్ ద్వారా ప్లాన్ ఏర్పర్చుకొంటామని తమకు వస్తున్న పన్ను తగ్గించాలని అభ్యర్ధించారు. ఈ విషయమై స్పందించిన మంత్రి మునిసిపల్ ఏ సి పి ని సంప్రదించాలని సూచించారు.
తనపై ఇటీవల 124 ఏ సెక్టన్ దేశద్రోహం కేసు పెట్టారని కమ్యూనిస్టు నాయకుడు కొడాలి శర్మ మంత్రికి తెలిపారు.
జిల్లా వికలాంగ సంక్షేమ శాఖ ఇటీవల దివ్యాoగులకు 35 వేల రూపాయల ఖరీదు చేసే ఛార్జింగ్ బ్యాటరీతో నడిచే మూడు చక్రాల వాహనం ఇచ్చారని అది కేవలం నెలరోజులు మాత్రమే నడిచిందని , ఆ తర్వాత ఛార్జింగ్ నిలవడం లేదని స్థానిక నిజాంపేటకు చెందిన ఆళ్లకుంట చిన్నింటయ్య మంత్రికి తెలిపారు. కార్యాలయంకు వెళ్లి చెబుతుంటే ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదని, మచిలీపట్నంలో ఇచ్చి న 6 వాహనాలు , గ్రామీణ ప్రాంతాలలో ఇచ్చిన మరో ఆరు వాహనాల పరిస్థితి ఇదే విధంగా ఉందని మంత్రికి ఆయన చెప్పారు.
మచిలీపట్నం మండలం పోలాటితిప్ప గ్రామంలో తమ పొలంలో సర్వే చేసేందుకు 2009 సర్వేయర్ ను భూమి వద్దకు తీసుకెళ్లామని నాడు తమ పొలం అది కాదని వేరే డొంక ప్రాంతం చూపించాడని ఖాసిమ్ అనే వ్యక్తి మంత్రి వద్ద తెలిపాడు, తిరిగి 2018 లో మరోమారు ఆదే సర్వేయర్ సర్వే చేసి హద్దులు చూపించి మీరు చెప్పిందే కరెక్ట్ అని అదే పొలం మీదేనని ఒప్పుకున్నారని మంత్రికి చెప్పారు. తమ పొలం ఎవరి ఆక్రమణలో లేదని అయితే, కొందరు తమ భూమిని తక్కువ రేటుకు అమ్మాలని వత్తిడి తెస్తున్నారని ఖాసీం చెప్పారు.