నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి 61వ రోజున మూలాపేట లోని యాదవ వీధి ప్రాంతంలో నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ “గుడ్ మార్నింగ్ సీఎం సార్” #GoodMorningCMSir కార్యక్రమాన్ని నెల్లూరు సిటీలోని మైపాడు రోడ్డు వద్ద నిర్వహించి ఆ రోడ్డు పైన గుంతలకు వైసీపీ బులుగు, పచ్చ రంగులను అద్దారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 3, 4, 5 డివిజన్లు మైపాడు రోడ్డు కనెక్టివిటీతోనే ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో 13వేలకు పైగా కుటుంబాలు, 50వేలకు పైగా జనాభా నివసిస్తున్నారని, ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో అందరికీ ఎంతో ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. 50 రోజుల పాటు ఈ ప్రాంతంలో పవనన్న ప్రజాబాట ద్వారా ప్రతి ఇంటికి తిరిగితే అనేకమంది ఈ రోడ్డు కారణంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించారన్నారు. ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని, అందుకే నేడు జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా ప్రభుత్వానికి బుద్ధి రావాలని అధికార వైసీపీ రంగులను రోడ్డుపై గుంతలకు వేసామని తెలిపారు. రానున్నది పవనన్న ప్రభుత్వమే అని, తమ ప్రభుత్వంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లన్నింటినీ బాగు చేస్తామని, నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు.