YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై లేఖ రాసారు, తక్షణమే చర్యలకు ఉపక్రమించాలి అని ఆవిడ ప్రధానిని కోరారు. ఇందులో భాగంగా ఆవిడ ప్రధానిని ఉద్దేశించించిన సందేశంతో కూడి ఉన్న పోస్టరును లేఖతో పాటుగా మీడియాకు విడుదల చేసారు. ప్రధాని దృష్టికి కాళేశ్వరం అవినీతిని తీసుకురావటానికి, ఈ గోడపత్రాలు, యావత్ రామగుండం, గోదావరిఖని, మరియు సమీప ప్రాంతాల్లో విస్తృతంగా అతికించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నారు, “తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి, YSR తెలంగాణ పార్టీ తరపున, భారతదేశంలోనే అతిపెద్ద నీటిపారుదల కుంభకోణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ, చర్యలు తీసుకోవాలని కోరాము. తెలంగాణ రైతుల భవిత, బాగు దృష్టిలో పెట్టుకుని స్పందించాలని ప్రధానిని కోరుతున్నాము.”
“కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ 40000 కోట్ల నుండి రూ 1.20 లక్షల కోట్లకు పెంచి, రాష్ట్ర ఖజానాకు కేసీఆర్, అయన కాంట్రాక్టర్లు చిల్లు పెట్టి దోచుకున్నారు. అత్యంత దారుణమైన రీతిలో అవినీతి, నిధుల పక్కదారి, ధరలను అడ్డగోలుగా పెంచి జేబులను నింపుకోవడం, అన్నిటినీ మించి నాణ్యతలో రాజీపడి, వరదల వలన ప్రాజెక్టు దెబ్బతినటం, వీటన్నిటిమీద YSR తెలంగాణ పార్టీ తీవ్రంగా పోరాడుతున్నా, ఎటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. కేంద్రమంత్రులు కూడా తెలంగాణకు వచ్చినప్పుడు ప్రాజెక్టు అవినీతిపై మాట్లాడతారు కానీ చర్యలు లేవు. మేము కాగ్ మరియు సీబీఐకి కూడా ఆధారాలతో కూడని ఫోర్యాదులు అందించాము.”
“మేము ప్రధాన మంత్రికి మరొకసారి చేసే మనవి ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, నిధులు ఇచ్చే సంస్థలు, వీటిని మాయ చేసి కేసీఆర్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసింది, కాబట్టి, ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయి కుంభకోణం. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమిస్తున్నది అని ఆశిస్తున్నాము.”
కొన్ని రోజుల క్రితం, వైఎస్ షర్మిల, సిబిఐ మరియు కాగ్ సీనియర్ అధికారులను ఢిల్లీ కలిసి, కాళేశ్వరం అవినీతిపై డాక్యూమెంట్లతో కూడిన ఆధారాలను వారికి సమర్పించి, అధికారికంగా ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవలసిందిగా కోరిన విషయం తెలిసిందే.