వెండితెరపై కనిపించాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే వాటిని సాకారం చేసుకునే వారు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన యువకుల్లో ‘ఊరికి ఉత్తరాన’ ఫేం నరేన్ వనపర్తి. వరంగల్ జిల్లాకి చెందిన ఈ యువకుడు సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి… ఏదైనా సాధించి మంచి పేరు తెచ్చుకోవాలనే తపనతో ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకున్నారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి… ఓ వైపు ఉద్యోగం చేస్తూనే… మరోవైపు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నాడు. దాంతో ఇండియాకు తిరిగొచ్చి…ఇక్కడ ‘ఈగల్ పిజ్జా’ అనే ఓ ఫాస్ట్ ఫుడ్ ఔట్ లెట్ ను ప్రారంభించి… దానిని ఇప్పుడు సుమారు 25 బ్రాంచిల వరకు విస్తరించారు. అయితే తను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలను చూస్తూ పెరగడంతో… ఎప్పటి నుంచో వెండితెరపై కనిపించాలనే ఆసక్తి ఉంది. దాంతో ఓ వైపు ఎలాగు బిజినెస్ లో సక్సెస్ ఫుల్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నాం కదా… ఇక హీరోగా కూడా సిన్సియర్ గా ట్రై చేసి… అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుందామని తన బృందంతో కలిసి ‘ఊరికి ఉత్తరాన’ అనే ఓ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని వనపర్తి వెంకయ్య నిర్మించారు. తన సొంత జిల్లా అయిన వరంగల్ లో సెట్ వేసి… ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ప్రముఖ నటుడు, దివంగత జయప్రకాశ్ రెడ్డి(జేపీ) కూతురు శ్రీ మల్లికా రెడ్డి నిర్మాతగా వ్యవహరించే ఓ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ జయప్రకాశ్ రెడ్డి ప్రొడక్షన్స్ లో అవినాశ్ కోకటి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇది ఇటీవలే ప్రారంభమైంది. మరో సినిమా కూడా త్వరలో ప్రారంభం అవుతుంది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న యువ హీరో నరేన్ వనపర్తి మాట్లాడుతూ… ‘ఎన్ని సినిమాల్లో నటించామనేది ముఖ్యం కాదు… మంచి సినిమాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలనేదే నా ధ్యేయం. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలను చూస్తూ పెరిగా. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని అనుకునే వాణ్ని. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు ఫస్ట్ బాగా చదువుకోవాలి. జీవితంలో స్థిరపడాలి అని అనుకున్నా. అందులో భాగంగానే ఆస్ట్రేలియాలో ఎంఎస్ పూర్తి చేసి… ఇండియాకి వచ్చి ఇక్కడ బిజినెస్ ప్రారంభించా. అందులో సక్సెస్ అయిన తరువాత… సినిమా రంగం వైపు అడుగులు వేశా. ఇక్కడ కూడా మొదటి సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక నుంచి కూడా అందిరినీ మెప్పించే సినిమాల్లోనే నటించి మంచి పేరు తెచ్చుకుంటా. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు.