ఎపి లో సినిమా టిక్కెట్లు ఆన్ లైన్లోనో, స్వయానా ప్రభుత్వమో అమ్మితే తప్పు ఏమిటి ? పైగా ఇది హర్షించ తగ్గ విషయం. కొన్ని సినిమా టిక్కెట్ ధరలు తమకు ఇష్టం వచ్చినట్లు పెంచి అమ్ముకోవడం అరికట్ట బడుతుంది. బ్లాక్ మార్కెట్ వ్యవస్థ నశిస్తుంది. థియేటర్ల దగ్గర తోసుకోవడాలు ఉండవు. సమయం ఆదా అవుతుంది. ఖాళీ ఉన్న రోజే ఆన్ లైన్లో టికెట్ తీసుకుని సినిమా చూస్తాడు. ఇప్పు డున్న సినిమా వారి మీద జాలి పడవలసిన పని లేదు. సినిమాల్లో వారే నటిస్తారు. సినిమాలూ వారే తీస్తారు. మరలా తీసిన సినిమాను అమ్మేసుకుంటారు. థియేటర్లు అన్నీ వారి గుప్పిటే ఉంటాయి. వారు చెప్పిన ధరకే పంపిణీ దారులు తీసుకోవాలి. వారు చెప్పిన థియేటర్ల లోనే సినిమా విడుదల చెయ్యాలి. దీనివల్ల బయ్యర్లు దివాళా తీసిన వారు ఆత్మహత్యలు చేసుకున్న వారు అనేకులు ఉన్నారు. ఆంధ్రా ప్రజల బాధలు, కష్ఠాలను పంచుకోలేని ఈ సినీ యాక్టర్లు , సినీ పరిశ్రమ గురించి ప్రజలు ఎందుకు స్పందించాలి ? ఈ నటుల వల్ల ప్రజలు ఎందుకు నష్ఠ పోవాలి ? అభిమానులు అంటే గొర్రెలు కాదు. ఎటు తల తిప్పితే అటు తిప్పడానికి . ఏ పార్టీకి ఓటు వెయ్యమంటే అటు వెయ్యడానికి వ్యక్తిత్వం లేని మనుషులు కాదు వీరు. అభిమానం వేరు . రాజకీయం వేరు. మీకు అభిమానులైన మాత్రాన ఓట్లు వెయ్యాలా? ఏ పార్టీ అయితే ఇష్ఠమో వారికి ఓటు వేసుకుంటారు. ఎ.పి లో మూడు రాజధానులు పాలన అద్భుతం అని ప్రకటనలు గుప్పించిన కొందరు నటుల గురించి ప్రజానీకం ఎందుకు ఆలోచించాలి ? 6 వందల రోజులుగా అమరావతి ప్రజల, రైతుల నిరశనకు ఏ ఒక్క నటుడైనా మద్దతు ఇచ్చారా? 130 మంది రైతులు చనిపోతే ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా పరామర్శించారా? కొందరు నటులు అమరావతి మీద ఎంతటి విషం కక్కారు. కనీసం మానవత్వం తో కూడా వ్యవహరించ లేదు. పోనీ ఏ విధమైన ప్రకటన ఇవ్వకుండా నోరు మూసుకుని కూర్చోలేక పోయారు. వీరికి స్టుడియోలకు స్థలాలు ఎందుకు ఇవ్వాలి? ఏ నటుడైనా ఎ.పి లో నివాసం ఉంటున్నాడా ? వీరి ఆస్థులు, కార్యాలయాలు , స్టుడియోలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. టాక్సులు అంతా ఆయా రాష్ట్రాలకు కడుతున్నారు. ఇందులో ఎ.పి కు వచ్చిన లాభం ఏ ముంది? ఏమీ లేనప్పుడు వారి గురించి ఎందుకు ఆలోచించాలి? రాష్ట్రం విడిపోయి 7 సం.లు దాటింది. ఎన్ని స్టుడియోలను ఎ.పి కి తరలించారు? పైగా ఓటు రాజకీయాలు చేసి ప్రజలను చీలికలు, పీలికలు చేస్తున్నారు కొందరు సినీ ప్రముఖులు. కరువులు, వరదలు, కరోనా వల్ల నష్ఠపోయిన ప్రజలను ఎలా ఆదుకున్నారని వీరి మీద జాలి చూపించాలి? ప్రభుత్వం వారికి రావల్సిన పన్ను రాబట్టుకుని మిగతాది నిర్మాతకో, పంపిణీ దారునికో ఇస్తుంది. నిజాయితీగా పన్నులు కడుతుంటే ఎవరు డబ్బు వసూలు చేస్తే ఏమవు తుంది. దానికి ప్రజ లెందుకు వారి మీద సానుభూతి చూపాలి ? ప్రజల తరుపున , ప్రజల బాధల పట్ల ఏరోజూ మాట్లాడని సినీ పరిశ్రమ కోసం ఇదే ప్రజలు వారి కెందుకు మద్దతు తెలపాలి. స్వలాభం మాత్రమే చూసుకునే ఈ సినీ పెద్దల కోసం ప్రజలెందుకు త్యాగాలు చెయ్యాలి? ఎ.పి డబ్బును కోటాను కోట్లు ఇతర రాష్టాలకు తరలించుకు పోతున్న ఈ సినీ వాసుల పట్ల జాలి చూపించ వల్సిన అవసరం లేదు. కొందరు సినీ మోజులోనో, కుల మోజులోనో పడి ప్రకటనలు గుప్పించే అవకాశం ఉంది. పార్టీలు కూడా దీని మీద స్పందించ కుండా ఉంటేనే మంచిది. సాటి ఎ.పి ప్రజల బాగోగు లను పట్టించుకోని ఏ సినీ నటుడి మీదా కరుణా, జాలీ చూపించ నవసరం లేదు. ఇప్పటికే వందల, వేల కోట్లు సంపాదించారు. ఇక వారు సంపాదించుకున్నది చాలు. కుల తత్వంతో , మత తత్వంతో జాతిని నిర్మించలేరని చెప్పిన BR అంబేద్కర్ ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇలాంటి నటుల వెంట పడవల్సిన అగత్యం ఏముంది ఎ.పి ప్రజలకు. వీరి సినిమాలు చూసినందు వల్ల జేబుకు చిల్లు పడడమే గాని వీరి నుండీ నేర్చుకునేది ఏమీ లేదు. అయినా వీరిని చూసి నేర్చుకునేది ఏముంటుంది. వీరేమైనా జ్ఞానులా , సైంటిస్టులా, డాక్టర్లా ? పెట్టు బడి దారులు వీరు. నిర్మాత స్క్రిప్ట్ ను బట్టి కూలికి నటించే నటులు వీరు. వీరేమైనా దేశోద్ధారకులా? త్యాగ దనులా ? ఆదర్శ వంతులా ? కోటాను కోట్లు తీసుకుని నటించే ఈ నటులు ప్రజల తరపున , సమాజం పట్ల భాజ్యతతో మెలగాలి. నిర్మాత డబ్బు, దర్శకుని ప్రతిభ మీద నటుడు ప్రజాభి మానం పొందుతాడు. నిర్మాత లేకపోతే నటులు లేరు. నటులు కావాల్సినంత మంది దొరుకు తారు. నిర్మాతలు దొరకరు. అది గుర్తెరిగి మసలు కోవాలి. మనం ఎక్కడి నుండీ వచ్చామో గుర్తుంచుకోవాలి. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మసలు కోవాలి. ఇబ్బందులు ఉంటే నోరు మూసుకుని ఎవరి పని వారు చేసుకోవాలి. ఎవరి ధర్మం వారు నిర్వహించాలి. ఒకరి పని ఒకరు చేస్తే ఇలాగే ఉంటుంది. ప్రజలకు మేలు చేయక పోగా కీడు చేసిన వారు అవుతారు. చేసిందంతా చేసి ఇప్పుడు తమ దాకా వస్తే సర్రున కాలి ప్రజల, అభిమానుల సానుభూతి కోసం దిక్కులు చూసే ప్రయత్నాలు , చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంటుంది. ఇది వ్యర్ధ వృధా ప్రయాస అని తెల్సుకుంటే అందరికీ మంచిది. సినిమా అంటే ఒక్క వినోదమే కాదు. విజ్ఞానం ఉండాలి, సామాజిక సృహ ఉండాలి. ప్రజల కష్ఠ , నష్టాలకు పరిష్కార మార్గం చూపించేదిగా ఉండాలి. సినిమా , మీడియా అనేది ఒక బలీయ మైన శక్తి. ప్రజల్లోకి వేగంగా చొచ్చుకు వెళ్ళే ఒక సాధనం. దాన్ని వ్యాపారం చేసేసి , ఒక మాఫియా లాగా మార్చేసారు కొందరు నిర్మాతలు, నటులు , మీడియా ప్రతినిధులు. వస్తువు లాగా సినిమాను భావించి నప్పుడు ఇష్ఠమైతే కొంటాం లేకపోతే లేదు . సినీ పరిశ్రమకు ఏదో అన్యాయం జరిగిందని ప్రజలు మీ వెంట పరుగెత్త వల్సిన అవసరం అంతకన్నా లేదు. వారికి ఇంకెన్నో జీవన్మరణ సమస్యలు ఉన్నాయి.
–వి. యల్. ప్రసాద్ .