రాజ్యాంగపరంగా గవర్నర్ రాష్ట్రంలో ప్రధమ పౌరుడు/పౌరురాలిగా చెలామణి అవుతారు. వారికి ఆ గౌరవం దక్కుతుంది. అంతమాత్రాన గవర్నర్ పదవిలో ఉండేవారు ముఖ్యమంత్రికన్నా గొప్పవారు కారు. మన ప్రజాస్వామ్య విధానం ప్రకారం ముఖ్యమంత్రిని ఆ రాష్ట్రప్రజలు అందరూ కలిసి ఎన్నుకుంటారు. రాష్ట్రానికి సంబంధించి ఏ విషయంలో అయినా ముఖ్యమంత్రి సార్వభౌమాధికారి. గవర్నర్ అనే పదవి ద్వారా రాజ్యాంగం నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి నియమించబడతారు. అంతమాత్రాన గవర్నర్ కు ముఖ్యమంత్రి సబార్డినేట్ కాదు. గవర్నర్ ఆదేశాలను ముఖ్యమంత్రి పాటించాల్సిన అవసరం లేదు.
ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆ పదవిలో ఉన్నా, లేకున్నా ఆయన రాష్ట్రానికి చెందిన సొంతమనిషి. గవర్నర్ అనే వ్యక్తి ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆ రాష్ట్రప్రజలు భాష, ఆచారవ్యవహారాలు, సంప్రదాయాల పట్ల గవర్నర్ కు అవగాహన ఉండదు. గవర్నర్ ఇవాళ ఉండొచ్చు రేపు మరొక రాష్ట్రానికి వెళ్ళచ్చు లేదా మరొక పదవిలోకి మారవచ్చు. గవర్నర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రితో సత్సంబంధాలు నెరపుకోవాలి. అంటే నా అభిప్రాయం గవర్నర్ ముఖ్యమంత్రికి భజన చెయ్యాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం తన విధులు తాను నిర్వహిస్తే ఇద్దరి మధ్యా సంబంధాలు సక్రమంగా కొనసాగుతాయి.
నిన్న రాజ్ భవన్ లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. కావాలని నిబంధన లేదు. ఎందుకు హాజరు కావాలో చెప్పాల్సిన అగత్యం ఆయనకు లేదు. కేసీఆర్ హాజరు కాలేదని ఆయన మీద నిష్టూరాలు ఆడుతున్నాయి కొన్ని పత్రికలు. ఇటీవలనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై గవర్నర్ తో ఆత్మీయంగా మాట్లాడారు. ఇద్దరిమధ్యా మళ్ళీ సఖ్యత నెలకొంటుందని చాలామంది ఆశించారు. కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని ఆమె నిలుపుకున్నదా?
మళ్ళీ బాసర ఐఐటీకి వెళ్లి అక్కడ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు గవర్నర్. అక్కడి తిండి, వసతులు గురించి కామెంట్స్ చేశారు. రాజ్ భవన్ మీకు అండగా ఉంటుందని సెలవిచ్చారు. వాస్తవంగా అలాంటిది సాధ్యం అవుతుందా? అలాగే ప్రజాదర్భార్ అంటూ హడావిడి చేశారు. ముఖ్యమంత్రి మంచితనాన్ని అలుసుగా తీసుకోవడం కాదా? మంచితనాన్ని అసమర్ధతగా భావించడం కాదా? ముఖ్యమంత్రిని రెచ్చగొట్టడం కదా? ఆమె గవర్నర్ లా కాకుండా బీజేపీ కార్యకర్తలా పనిచెయ్యడం కళ్లారా కనిపిస్తున్నది. నిన్న ఆమె చుట్టూ ఉన్నది బీజేపీ నాయకులే.
రాజ్ భవన్ ప్రతిష్టను దెబ్బతియ్యడం గవర్నర్ గారికి తగినపని కాదు. ముఖ్యమంత్రితో సఖ్యత లేనిదే అటెండర్ కూడా ఆమె ఆదేశాలను పాటించడు. కేసీఆర్ అనే వ్యక్తి ఎవరినో వెన్నుపోటు పొడిచో, వేరే పార్టీలను చీల్చో, గాలివాటంగానో అధికారలక్ష్మిని చెరపట్టినవాడు కాదు. పదమూడేళ్ల ఉద్యమం, పోరాటం తరువాత రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని సాధించి మూడున్నర కోట్లమందితో అత్యున్నత పీఠం మీద కూర్చోబెట్టబడినవాడు. రెండోసారి మరింత పెద్ద మెజారిటీతో విజయలక్ష్మితో వరించబడిన వాడు. గవర్నర్ గారు కేసీఆర్ నేపధ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఆయనతో ఆమె మెలిగే విధానం మారుతుంది. నరసింహన్ స్వయంగా కేసీఆర్ చరిత్రను, జీవితాన్ని చూశారు కాబట్టి పదేళ్ల ఆయన గవర్నర్ పదవీకాలం అత్యంత సుఖప్రదంగా సాగిపోయింది.
Score -https://www.facebook.com/ilapavuluri.murali