ప్రపంచ వేదికపై తెలుగు సినీ కీర్తి పతాకం రెపరెపలాడింది. ఖండాంతరాలకు వ్యాపించిన తెలుగోడి పాటకు ఆస్కార్ పట్టం కట్టింది. హాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలు పొందిన ‘RRR’కు ఆస్కార్ అవార్డు దక్కింది. USలోని లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో జరిగిన వేడుకలో ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో అవార్డు పొందింది. సంగీత దర్శకుడు కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ అవార్డును అందుకొన్నారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ… నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం ప్రతి భారతీయుడికీ ఎంతో గర్వకారణం అన్నారు. ఈ విషయాన్ని తన పాట రూపంలో పాడి వినిపించడంతో… వేడుకకు హాజరైన వారంతా కరతాళ ధ్వనులతో నీరాజనం పలికారు.