అమ్మాయిలకు ఇంట బయటా ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నాయో మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఇంట్లో అమ్మాయి పుట్టిందంటే చాలు భారంగా భావించే తల్లిదండ్రులు నేటికీ ఉన్నారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని సినిమా అంటే కేవలం వినోదం పంచడమే కాదు… ఇలాంటి పవర్ ఫుల్ మాధ్యమం ద్వారా ఓ సందేశం ఇవ్వాలనే తలంపుతో ‘నేనే సరోజ’ ఉరఫ్ కారంచాయ్ నిర్మించారు రచయిత కం నిర్మాత డాక్టర్ సదానంద్ శారద. S-3 క్రియేషన్స్ పతాకంపై శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శాన్వి మేఘన, కౌశిక్ జంటగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ ఏంటి అంటే… సరోజ(శాన్వి మేఘన) చాలా చురుకైన అమ్మాయి. తన వైపు తప్పులేకుంటే… ఎదుటి వారు ఎంతటివారైనా సరే… ఎదురించే రకం. చివరకు తన తండ్రిని కూడా. అలాంటి అమ్మాయికి ఇంట్లోనే ఆటుపోట్లు ఎదురవుతాయి. అమ్మాయిని ఎక్కువగా చదివిస్తే… అంతంకంటే పై చదువులు చదివిన అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి… అందుకు బోలెడన్ని కట్నకానుకలు ఇచ్చుకోవాల్సి వస్తుందని తన సమీప బంధువు మాటలు విన్న సరోజ తండ్రి… ఆమెను పెళ్లి పీటలెక్కించాలని చూస్తాడు. అది నచ్చని సరోజ… తను బాగా చదువుకుని డాక్టర్ ను అవుతానని పట్టుబడుతుంది. అయితే… ఈక్రమంలో సరోజ తల్లిదండ్రులు పోట్లాడుకుంటూ ఉండగా… సరోజ చేసిన చిన్నపాటి పని వల్ల తండ్రి ఆసుపత్రి పాలవుతాడు. దాంతో సరోజ పుట్టింటిని వదిలి పట్టణానికి చేరుకుంటుంది. అలా పట్టణానికి చేరుకున్న సరోజకి ఎదురైన అనుభవాలు ఏంటి? తను చదువుకుని ఎలా వైద్యురాలిగా ఎదిగింది? అందుకు సహకరించిన వారెవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ: సమాజంలో అమ్మాయిలు పుట్టుక దగ్గర నుంచి జీవితంలో స్థిరపడేదాకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్మాయి పుట్టడమే కుటుంబానికి మైనస్ అనే తలంపుతో ఉన్న చాలా మంది తండ్రులకు ఇలాంటి సినిమా ఓ మంచి మెసేజ్ ఇస్తుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే… వారిని సరైన మార్గంలో పెంచి… విద్యాబుద్ధులు నేర్పిస్తే… సమాజంలో వారే ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని ఇందులో కొన్ని కొన్ని ఉదాహరణలతో అమ్మాయిల మనో స్థైర్యాన్ని పెంచారు దర్శకుడు. చదుకునే అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేయడం, ప్రేమను ఒప్పుకోకపోతే వారి మీద దాడులు చేయడం, అధికార మదంతో అమ్మాయిలను బలవంతంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం, వర్క్ ప్లేసులో వేధింపులు, పాఠశాల, కళాశాలల్లో ఉపాధ్యాయుల వేధింపులు తదితర వాటిని ఇందులో చూపించి… వాటిని సరోజ ఎలా తిప్పికొట్టిందనేది చాలా చక్కగా… అమ్మాయిలకు ఉపయోగపడేలా చపించారు. గ్రామీణ ప్రాంతాలలో పెరిగే అమ్మాయిలతో పాటు… పట్టణ ప్రాంతాల్లో పెరిగిన అమ్మాయిలు కూడా అబ్బాయిలతో ఎలా లైంగిక వేధింపులకు గురవుతున్నారు… వాటిని ఎలా ఎదుర్కోవాలనేది ఓ చిన్న సాంకేతిక అలర్ట్ నెస్ తో ఇందులో చూపించారు.
టైటిల్ రోల్ పోషించిన శాన్వి మేఘన ఇందులో చలాకీ అమ్మాయిగా నటించి మెప్పించింది. తేడా వస్తే… తన కరాటే విన్యాసాలతో అబ్బాయిల మక్కీలు ఇరగ్గొట్టే గడుసు అమ్మాయి పాత్రలో మెప్పించింది. యాక్షన్ సీన్స్ ను చాలా అవలీలగా చేసింది. గ్రామీణ యువతి నుంచి వైద్య విద్యార్థినిగా ఎదిగే క్రమంలో శాన్వి ట్రాన్స ఫర్మేషన్ చాలా బాగుంది. ఆమెకు జోడీగా నటించిన కౌశిక్ పాత్ర ఓకే. ఓ సాధారణ యువకుని పాత్రలో పర్వాలేదు అనిపించాడు. శాన్వి తండ్రిగా, ఆమె మామగా వేసిన పాత్రలు కూడా బాగున్నాయి. కళాశాలలో వచ్చే క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. వాళ్లు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సుమన్, చంద్రమోహన్ కాసేపు ఉన్నా… తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఇలాంటి కథలను తెరకెక్కించేటప్పుడు సమాజంలో జరగుతున్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ ఉండాలి. అప్పుడే ఇలాంటి కథలకు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. దర్శకుడు శ్రీమాన్ ఇలాంటి విషయాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించి… కథ… కథనాలను రాసుకున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడా డీవియేట్ కాకుండా అమ్మాయిలు ఇంటా బయటా ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారనే దానిని చాలా చక్కగా తెరపై చూపించారు. చాలా న్యాచురల్ గా శాన్వి పాత్రను తీర్చిదిద్దారు. ఇందులో శాన్వి చేసి యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాత డాక్టర్ సదానంద శారదా… ఈ సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. పైగా సందేశం ఇవ్వాలని తీశారు కాబట్టి… ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. సరదాగా ఓసారి చూసేయండి.!
రేటింగ్: 3