వైద్య రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖల మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను సోమవారం అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ తో కలిసి ఆయన పరిశీలించారు. డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా ఈ ఆసుపత్రి ఉన్నప్పటికీ 560 బెడ్లు మాత్రమే ఉన్నా యన్నారు. ప్రతిరోజు ఓపీకి 2000 నుంచి 3000 వరకు రోగులు, కనీసం 1500 మంది వరకు ఇన్ పేషెంట్లు వస్తుంటారని తెలిపారు. సిబ్బంది, బెడ్లు, మౌలిక సదుపాయాల కొరత ఉన్నప్పటికీ నాణ్యమైన సేవలు అందిస్తున్నారని కొనియాడా రు. 2019లో మెటర్నటీ చైల్డ్ హెల్త్ బ్లాక్ మంజూర యిందన్నారు. దీనికోసం 300 కోట్లు మంజూరయినా గత ప్రభుత్వం పునాదులు కూడా వేయలేదన్నారు. దీన్నిబట్టి పేదల ఆరోగ్యంపై వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో గమనించాలన్నారు. ప్రస్తుతం పై స్థాయి నుంచి కిందిస్థాయి వరకు రోగులకు నవ్వుతూ పలకరించి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. 2020లో ఎంసిహెచ్, సర్జికల్ బ్లాకులు మంజూరయ్యాయన్నారు.
వీటి పనులు మొదలుపెట్టి నాలుగు సంవత్సరాలు దాటినా అవి ఇంకా బేస్మెంట్ దశలోనే ఉన్నాయన్నారు. ఇవి పూర్తి అయి ఉంటే 1500 బెడ్లు పూర్తిగా అందుబాటులోకి వచ్చి ఉండేవన్నారు.గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. ఈ ఆస్పత్రిలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలి గించకుండా చిరునవ్వుతో వారికి కావలసిన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య సిబ్బందిపై ప్రజల్లో గౌరవం పెంపొందే విధంగా చూడాలన్నారు. ప్రత్యేక నిధుల కోసం ఇంటర్నేషనల్ ఏజెన్సీ ద్వారా కృషి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో పడకలను 560 నుంచి 1500కు పెంచాలని కోరారు.మౌలిక సదుపాయాలు, కొత్త భవనాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలోని శిశు సంజీవిని ప్రత్యేక నవజాతి చికిత్స కేంద్రం , ఆర్తో వార్డ్, స్టోర్ అండ్ రికార్డ్స్ రూమ్ లను పరిశీలించారు.