విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్ జంటగా నటించిన చిత్రం ‘కథ వెనుక కథ’. ఇందులో హీరో సునీల్ ఓ కీలక పాత్రలో నటించారు. యువ నటి శుభ శ్రీ ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఈచిత్రాన్ని దండమూడి బాక్సాఫీస్ బ్యానర్‌పై… కృష్ణ చైతన్య దర్శకత్వంలో నిర్మాత అవనీంద్ర కుమార్ నిర్మించారు. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఎలా అలరించిందో చూద్దాం పదండి.
కథ: అశ్విన్(విశ్వంత్) తన మేనమామ కూతురైన శైలు(శ్రీజిత గౌష్)ని ప్రేమిస్తూ ఉంటాడు. దర్శకుడిగా సెటిల్ అయ్యి… శైలుని వివాహం చేసుకోవాలని సినిమా ఇంస్ట్రీలో తిరుగతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో రియల్టర్ అయిన కృష్ణ(జయప్రకాశ్) సినిమా తీయడానికి ముందుకు వస్తాడు. దాంతో ‘తెరవెనుక కథ’ అనే సినిమాని తీస్తాడు. అయితే సినిమా రిలీజ్ చేయడానికి ముందు పబ్లిసిటీకి నిర్మాత దగ్గర బడ్జెట్ ఉండదు. దాంతో అశ్విన్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదే సమయంలో తన సినిమాలో నటించిన ఐదుగురు ఆర్టిస్టులు కనిపించకుండా పోతారు. దాంతో ఆర్టిస్టుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి… దర్శకుడు అశ్విన్ పై కేసు పెడతారు. దర్శకుడి పేరు చెప్పే తమ పిల్లలు రాత్రిపూట బయటకు వచ్చారని… తీర ఇప్పుడు కనిపించకుండా పోయారని కంప్లైంట్ ఇస్తారు? మరి ఆ ఐదు మంది ఆర్టిస్టులు ఏమైనట్టు? వారిని ఎవరు కిడ్నాప్ చేశారు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ కథలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సరైన కథ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాని తీస్తే… కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించొచ్చు. ఇప్పుడు వీటిని ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. ఓటీటీల ప్రభావమే ఇందుకు కారణం. రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ గా వచ్చిన అనేక క్రైం థ్రిల్లర్స్ మనం చాలానే చూశాం. ఇలాంటి నేపథ్యంతో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ అని చెప్పొచ్చు. ఫస్టాఫ్ అంతా… హీరో దర్శకుడు కావాలనే నేపథ్యంతో సినిమా షూటింగ్… ఆ సందర్భంగా వచ్చే కామెడీ సీన్స్, పాటలు వగైరాలతో ప్రీ ఇంటర్వెల్ దాకా సినిమాని నడిపించి… ఇంటర్వెల్ బ్యాంగ్ ని ఓ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ సీన్ తో వేసి… సెకెండాఫ్ పై క్యూరియాసిటీని పెంచేశాడు. ఇక సెకెండాఫ్ అంతా ట్విస్టుల మీద ట్విస్టులతో సినిమాని క్లైమాక్స్ వరకు తీసుకెళ్లి… పతాక సన్నివేశంలో కూడా మరో గ్రాండ్ ట్విస్టు ఇచ్చి… వావ్ అనిపించేలా సినిమాని ముగించాడు దర్శకుడు. ద్వితీయార్థం మొత్తం ఆడియన్స్ కి థ్రిల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ చివరిదాకా ఎంగేజ్ అయ్యేలా ఈ సినమాని సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా మలచడంలో దర్శకుడు కృష్ణ చైతన్య సక్సెస్ అయ్యారు. ఎక్కడా బోరింగ్ లేకుండా సినిమాని ట్విస్టులతో నడిపించాడు.
సునీల్ ఇందులో రౌద్రం బాగా చూపించాడు. పోలీసు ఆఫీసర్ ఎలా కనిపించాలో అలా కనిపించి మెప్పించాడు. క్లైమాక్స్ లో తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లాడు. యంగ్ హీరో విశ్వంత్ కూడా బాగా నటించాడు. సినిమా ప్రమోషన్ కి బడ్జెట్ లేక తన డెబ్యూ మూవీ ఆగిపోయిందని తెలిసినప్పుడు ఒక డైరెక్టర్ ఎలా ఫీల్ అవుతారో అచ్చం అలాంటి పెయిన్ ని ఇందులో చూపించాడు. అతనికి జోడీగా నటించిన శ్రీజిత గౌష్… శైలు పాత్రలో ఆకట్టుకుంది. ఆలీ కాసుపు ఉన్నా… నవ్విస్తాడు. నటుడు జయప్రకాశ్… ఇందులో రియల్టర్ గా, సినిమా నిర్మాతగా చక్కగా నటించారు. అలాగే… ప్రీక్లైమాక్స్ నుంచి తన అసలు స్వరూపం చూపించడంలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు. అతని అల్లుడిగా నటించిన మధు నందన్ పాత్ర కూడా ఓకే. అమ్మాయిలను అత్యాచారాలు చేస్తూ… వారిని చంపే క్రూరమైన ముఠా పాత్రల్లో సత్యం రాజేష్, భూపాల్ అండ్ బ్యాచ్… బాగా నటించారు. రఘు బాబు కూడా బాగా చేశాడు. ఛత్రపతి శేఖర్ పాత్ర కాసేపు మాత్రమే ఉన్నా పర్వాలేదు. మిగతా పాత్రలన్నీ ఓకే.
దర్శకుడు రాసుకున్న కథ… అందుకు తగ్గట్టుగా స్క్రీన్ ప్లేను ఎంతో గ్రిప్పింగ్ గా రాసుకుని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. క్రైం సస్పెన్స్ థ్రిల్లర్స్ కి కావాల్సిన ఆర్ఆర్ కూడా బాగా అందించారు సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్. గంగనమోని శేఖర్, ఈశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాత అవనీంద్ర కుమార్ ఎక్కడా వెనుకాడకుండా ఖర్చు చేశారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3