విడుదల తేదీ : జూన్ 14, 2024
నటీనటులు: యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్, షతాఫ్ ఫిగర్, సప్తగిరి, ఫ్రానియాత, గరిమ, స్నేహ గుప్తా, సునైనా, రిషిక, తనుశ్రీ
దర్శకుడు: స్టీఫెన్ పల్లం
నిర్మాత : స్టీఫెన్ పల్లం
సంగీత దర్శకుడు: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని
ఎడిటింగ్: రవితేజ కూర్మనా
భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఉమెన్ చిత్రంగా ఇంద్రాణి థియేటర్లలోకి వచ్చింది. యానీయా సూపర్ ఉమెన్ గా నటించగా, స్టీఫెన్ పల్లం దర్శకత్వం వహించారు. అజయ్, కబీర్ సింగ్, షతాఫ్ ఫిగర్, సప్తగిరి, ఫ్రానియాత, గరిమ, స్నేహ గుప్తా, సునైనా, రిషిక, తనుశ్రీ వంటి వారు ప్రముఖ పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
కథ:
భారతదేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందడం, అంతర్జాతీయ శాంతిని కాపాడే బాధ్యతను భారత్‌కు అప్పగించడం జరుగుతుంది. ఇతర దేశాలతో పోటీ పడేందుకు భారత ప్రధాని I.S.F (ఇండియన్ సూపర్ ఫోర్స్) పేరుతో ఒక సంస్థను స్థాపిస్తారు. కానీ చైనా భారతదేశంపై దాడిని ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో సూపర్ ఉమెన్ ఇంద్రాణి చేసిన పనులేంటి? ఇంద్రాణి ఎందుకు వెనక్కి వెళ్లిపోయింది? ఆమె తన పనిని నెరవేర్చిందా? ఈ విషయంలో ఆమె ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే థియేటర్లో సినిమాను చూడాల్సిందే.
నటీనటులు
టైటిల్ రోల్ పోషించిన యానీ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చింది. ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ కోసం కత్తియుద్ధం, నాంచాక్ వంటివి కూడా నేర్చుకుంది. ఆమె చేసిన ఈ యాక్షన్‌కు అందరూ తప్పనిసరిగా అభినందించాల్సిందే. సప్తగిరి కామెడీ ఆకట్టుకుంటుంది. విలన్‌గా కబీర్ సింగ్ నటన బాగుంది. యూట్యూబర్ సునైనా న్యూస్ రిపోర్టర్‌గా తన నటనతో ఆకట్టుకుంది. స్నేహ గుప్తా, సునైనా, రిషిక, తనుశ్రీ ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ
ఇంద్రాణి నిస్సందేహంగా ప్రతిష్టాత్మకమైన కథగా నిలుస్తుంది. కథాంశం కూడా భవిష్యత్ ఇతివృత్తాలతో చక్కగా ఉంది. తెరపై ఓ విజువల్ వండర్ చూసినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి ఫిక్షన్, వీఎఫ్ఎక్స్ మూవీస్‌లకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. మొదటి సగభాగం పర్వాలేదన్నట్టుగా సాగుతుంది. సెకండాఫ్‌లో యానీ, సప్తగిరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు అలరిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన కొన్ని సన్నివేశాలను చక్కగా డిజైన్ చేశారు. సెకండాఫ్‌లో కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి.
డబ్బింగ్ ఓకే అనిపిస్తుంది. డైలాగులు బాగున్నాయి. ఈ సూపర్ ఉమెన్ చిత్రాన్ని అన్ని అంశాలకు జోడించి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందించాలని చూసిన దర్శకుడి ప్రయత్నం సఫలం అయినట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇంద్రాణి అనేది మంచి సబ్జెక్ట్‌తో వచ్చింది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో మంచి విజువల్స్ ఉండటం కలిసొచ్చే అంశం.
సాంకేతికంగా చూసుకుంటే.. సాయి కార్తీక్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది ఆకట్టుకుంటుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమా నిడివి కూడా సమస్యగా అనిపించదు. ఆర్ట్ వర్క్ బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నిర్మాతలు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది.
రేటింగ్ 3