‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలపై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. ఆగస్ట్ 5 న విడుదలైన రెండు సినిమాలు `బింబిసార’, `సీతారామం’ హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ఓ సినిమా మాస్ కమర్షియల్ అంశాలతో మాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తుంటే, మరో సినిమా స్వచ్ఛమైన ప్రేమ కథతో, పొయెటిక్ లవ్ స్టోరీతో క్లాసీ ఆడియెన్స్ హృదయాలను కొల్లగొడుతుంది. ఇలా `బింబిసార`, `సీతారామం’ రెండూ విజయవంతంగా రన్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్విట్టర్ ద్వారా అభినందించారు. ” ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ, మరింత ప్రోత్సాహాన్నిస్తూ కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలైన చిత్రాలు రెండు విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా `సీతారామం`, `బింబిసార` చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు” అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.