మనసున్న ప్రభుత్వం…
పేదల ఇంట… నవ్వుల పంట…
పథకాలే పేదల పాలిట ఫలాలు…
పేదరికం తగ్గుతోంది… నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి
మనసున్న ప్రభుత్వం ఉంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి… పాలన అంటే అధికారం అనుకునే ఇదివరకటి పాలకులకు భిన్నంగా పాలన అంటే బాధ్యత అని కొత్త నిర్వచనం చెప్పి ముందడుగు వేసిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన మంచి ఫలితాలను సాధిస్తోంది. అభివృద్ధి అంటే రోడ్లు.. భవనాలు.. ప్రాజెక్టులు అనేది ఇదివరకటి పాలకుల భావన. కానీ దేశమంటే మట్టికాదోయ్ .. దేశమంటే మనుషులోయ్ అని ప్రవచించిన గురజాడ అడుగుజాడల్లో నడుస్తూ మన రాష్ట్రంలోని ప్రజల అభివృద్దే రాష్ట్రాభివృద్ధి అని సరికొత్త నినాదం ఇచ్చారు.
అందుకే రాష్ట్రమంతా పేదలే ఉంటే బిల్డింగులు నిర్మించి రోడ్లు వేసేస్తే ప్రయోజనం ఏముంది. ముందు రాష్ట్ర ప్రజలను పేదరికం నుంచి వేరు చేయాలి.. పేదరికం తగ్గాలి అనే సంకల్పంతో నాలుగేళ్లుగా పాలన సాగించిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. నా పేదలు.. … నా బీసీలు.. నా ఎస్సిలు.. నా ఎస్టీలు అని తరచూ కలవరించే జగన్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. వారి జీవితాలను పేదరికానికి దూరంగా జరిపి వారి ఇళ్లలో వెలుగులు.. కళ్ళలో దీపపు కాంతులు నింపారు..
*సొంత డబ్బా కాదు.. కేంద్రం చెబుతున్న వాస్తవాలివి*
మనగురించి మనం చెప్పుకోవడం.. మన జబ్బలు మనం చరుచుకోవడం.. ఎంతముద్దుగా ఉన్నానో అంటూ మన చెంపలు మనం ముద్దాడుకోవడం కాదు .. పక్కోళ్లు.. ఇరుగుపొరుగోళ్ళు.. కుదిరితే పక్కూరి వాళ్ళు.. పక్కజిల్లావాళ్ళు పొగడాలి. ఇలా మన పనితనం ఎల్లలు దాటాలి. పేదల సంక్షేమం.. పేదరిక నిర్మూలన కోసం అహోరాత్రులు కృషిచేస్తున్న జగన్ మోహన్ రెడ్డి కష్టానికి ప్రతిఫలం వచ్చింది. నాలుగేళ్ళ క్రిందట ఆయనవేసిన సంక్షేమ మొలకలు మొక్కలయ్యాయి.. చెట్లయ్యాయి.. కాపు కాస్తున్నాయి.. పేదల ఇళ్లలో పూలు.. పళ్ళు ఇస్తున్నాయి. 2016లో ఆంధ్రాలో పేదరికం 11.7 శాతం ఉండగా 2021 నాటికి అది 6.06 శాతానికి తగ్గింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2016 నాటికి 14.72 శాతం పేదరికం ఉండగా అది 2021 నాటికి 7.71 శాతానికి తగ్గిందని అదే సమయంలో పట్టణ ప్రాంత పేదరికం 4.63 శాతం నుంచి 2.20 శాతానికి తగ్గినట్లు కేంద్రప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వెల్లడించింది.
సంక్షేమ పథకాలే పహారా సైనికులు
రాష్ట్రంలో జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలపాలిట కావలికోటలుగా నిలిచాయి. ఈ పథకాలను దాటుకుని పేదరికం ప్రజల ఇళ్లలోకి చొరబడడం అసాధ్యం అవుతోంది. ఉచిత విద్య, వైద్యం. రైతులకు భరోసా.. బాలలకు పౌస్టికాహారం.. గర్భిణులకు ఇచ్చే ప్రత్యేక ఆహారం వంటివి ప్రజలకి ఎంతగానో మేలు చేశాయి. ఇలా ఏ వర్గాన్నీ వదలకుండా సంక్షేమ పథకాలు అనే రాతి గోడను నిర్మించిన జగన్ ఆ గోడ దాటి పేదరికం ఆయా ఇళ్లలోకి రావడానికి అవకాశం ఇవ్వడం లేదు.
ఇల్లు దాటి కదల్లేని వృద్ధులకు సైతం ఇళ్లకే పెన్షన్లు… ఇంటి ముంగిటకు ఆరోగ్య సేవలు అందిస్తూ పేదరికపు కాటు నుంచి ప్రజల్ని కాపాడే సైనికుడి బాధ్యత జగనన్న తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో పేదరికపు ఛాయలు తగ్గుతూ వస్తున్నాయని. ప్రజలు సంక్షేమ రాజ్యంలో సుభిక్షంగా ఉంటూ పోషకాహారం తీసుకుంటూ ఉన్నత జీవన ప్రమాణాల్లో పొందుతున్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది.