తిరుమలకు మరింత ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా ఇంజినీరింగ్ పనులు చేపట్టాలని, ఇందులో ఫుట్‌పాత్‌లు, తాగునీటి కొళాయిలు, మరుగుదొడ్లు ఇతర ఇంజినీరింగ్ పనులు ఉండాలని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో బుధవారం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యానమందిరానికి సంబంధించిన దాత, ఆర్కిటెక్ట్‌తో చర్చించి పనులు వేగవంతం చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 24 గోశాలలను నోడల్ గోశాలలుగా గుర్తించడం జరిగిందని, వీటిని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు స్థానిక దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని కోరారు. ఇప్పటికే తిరుపతిలోని గోశాలను మెరుగ్గా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని, ఇదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని గోశాలలను అభివృద్ధి చేసేందుకు దాతల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. స్థానికాలయాల్లో గోపూజ నిర్వహణ మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోశాలలో గోమాతకు ఇష్టమైన సంగీతం వినిపించేలా పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబరులోపు ఎస్వీ గోశాలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పూర్తి చేయాలని, దాణాను ఇక్కడే తయారు చేసి జనవరి నుండి బయట కొనుగోలు చేయడం నిలిపివేయాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.