రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేస్తున్న నూతన జిల్లాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రియను ఈనెల 25నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలక్టర్లను ఆదేశించారు.జిల్లాల పునర్విభజన అంశంపై గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరం నుండి వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు,శాఖాధిపతులు,జిల్లా కలక్టర్లు,ఎస్పిలతో ఆయన సమీక్షించారు.ఈసందర్భంగా నూతన జిల్లాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం,ఆర్డీఓ,డిఎస్పి,ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అందుబాటులో ఉన్నభవనాలను గుర్తించి వినియోగించు కునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఈనెల 25నాటికి నూతన జిల్లాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఇతర పనులన్నీ పూర్తి చేయాలని సిఎస్ డా.సమీర్ శర్మ జిల్లా కలక్టర్లను ఆదేశించారు.వారం రోజుల్లోగా నూతన కలక్టరేట్లకు వీడియో సమావేశం సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.అలాగే వెబ్ సైట్లను కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుందని సిఎస్ పేర్కొన్నారు.
నూతన జిల్లాల్లో ఐటి సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వివరాలను నిర్దేశిత ఫార్మాట్ లో నమోదు చేసి వెంటనే పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ జిల్లా కలక్టర్లను ఆదేశించారు.త్వరలో నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీడియో సమావేశం ద్వారా సమీక్షించనున్నారని సిఎస్ డా.సమీర్ శర్మ చెప్పారు.నూతన జిల్లాల్లో కార్యాలయాల భవనాలకు తీసుకునే భవనాలకు ఆర్అంబ్బి ధరల ప్రకారం అద్దె నిర్ణయించాలని కలక్టర్లను సిఎస్ ఆదేశించారు. నూతన జిల్లాల్లో ఇ-ఆఫీసు విధానాన్ని పటిష్టంగా నిర్వహించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఐటి శాఖ అధికారులతో సమన్వయంతో ఆదిశగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఈసమావేశంలో ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.రావత్ మాట్లాడుతూ సచివాలయశాఖలను,ఆయా శాఖాధిపతుల కార్యాలయాలను నూతన జిల్లాలతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపారు.టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి యం.టి.కృష్ణ బాబు మాట్లాడుతూ నూతన జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలక్టరేట్లకు ఏర్పాటుకు సంబంధించి అందుబాటులో ఉన్న భవనాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలక్టర్లకు సూచించారు.ఇప్పటికే నూతన జిల్లాల్లో 17 ఆర్డీఓ కార్యాలయాల ఏర్పాటుకు తగిన భవనాలను గుర్తించి వివరాలు పంపారని చెప్పారు.నూతన కార్యాలయాల్లో అవసరమైన ఫర్నిచర్ సమకూర్చుకునేందుకు వివిధ కంపెనీలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.అంతేగాక ఇంటిగ్రేడ్ కలక్టరేట్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి వాటి నిర్మాణాలకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కరికల వల్లవన్,పూనం మాలకొండయ్య, ప్రవీణ్ కుమార్,ముఖ్య కార్యదర్శులు ముఖేశ్ కుమార్ మీనా,శ్యామలరావు,కార్యదర్శులు వి.సునీత,మధుసూదన రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.వీడియో లింక్ ద్వారా జిల్లాల నుండి జిల్లా కలెక్టర్లు,ఎస్పిలు పాల్గొన్నారు.