కనిగిరి : సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని..టీడీపీ పిలుపునిచ్చిన రా..కదలిరా కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన రా..కదలిరా కార్యక్రమం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….ఐదేళ్ల జగన్ పాలనలో ప్రజలు నరకం అనుభవించారు. ఈ నూతన సంవత్సరంలో సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపి మనకు మంచి రోజులు రావాలని సంకల్పం చేద్దాం. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటే అది ప్రభంజనం అయింది. ప్రజలే సారధ్యం వహించి తెలుగుదేశాన్ని గెలిపించారు. నేడు సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అని పిలుపునిస్తున్నా…ఇది మనందరి సమిష్టి బాధ్యత. ప్రపంచంలో తెలుగు జాతి నెం.1 కావాలి, అందుకు తగ్గ సత్తా తెలివితేటలు మనదగ్గర ఉన్నాయి. కానీ నేడు రాష్ట్రం లో ప్రజాస్వామ్యం లేదు, చైతన్యం ఉన్న తెలుగు జాతి భయపడే పరిస్ధితి వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలి.
పౌరుషాల పురిటి గడ్డ ప్రకాశం జిల్లా..
పౌరుషాల పురిటి గడ్డ ప్రకాశం జిల్లా, ఈ జిల్లా నుంచే నేడు రా కదలి రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. బ్రిటిష్ వారి తూటాలకు ఎదురొడ్డిన ప్రకాశం పంతులు జన్మించిన గడ్డపై పుట్టిన మీరు ఈ సైకో అక్రమ కేసులకు మీరు భయపడతారా? ఒంగోలు గిత్తకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. 21 సంవత్సరాల క్రితమే ఒంగోలు గిత్తను ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్ ఇక్కడే ఉంది. నేడు జగన్ రెడ్డి పులివెందుల నుంచి వచ్చి గ్రానైట్ ను దోచుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నవారు పేదలుగా ఉన్నారు, రాష్ట్రం వదలి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారు ఆర్దికంగా బలపడ్డారు. దీనికి కారణం ఈ చేతకాని వైసీపీ పాలన. భవిష్యత్ లో కనిగిరి దశ, దిశ మార్చే బాధ్యత టీడీపీ తీసుకుటుంది.
వైసీపీ పాలనలో ప్రజలు జీవన ప్రమాణాలు పెరిగాయా?
5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎవరికైనా న్యాయం జరిగిందా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? జగన్ రెడ్డి బటన్ నొక్కుడు అంటూ ఒక చేత్తో రూ. 10 ఇచ్చి మరో చేత్తో రూ. 100 దోచుకుంటున్నారు. నేను 25 ఏళ్ల కంటే ముందు ఐటిని ప్రమోట్ చేశా, హైదరాబాద్ కేంద్రంగా తెలుగు వారికి ఒక రాజధానిని అభివృద్ది చేశాం. ఐటి అభివృద్దితో మన తెలుగువారులో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్ధిరపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తే సంపద పెరుగుతుంది. ఆ సంపదతో ప్రజలకు సంక్షేమం అందించాలి. కానీ ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించడం, ఉద్యోగాలివ్వటం తెలీదు. 5 ఏళ్లలో ఒక్క సారైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా, డీఎస్సీ ఇచ్చారా, పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చారా? ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీనే, జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలి. 2029 నాటికి ఏపీ దేశంలో నెం.1 కావాలని ప్రణాళిక రూపొందించాం. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చా, మనకు సముద్ర తీర ప్రాంతం ఉంది, ఇక్కడ పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి.
జగన్ రెడ్డి పాలనలో అందరూ బాధితులే…
ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన జగన్ రెడ్డి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. గ్రామ పెద్ద చెడు వ్యక్తి అయితే ఆ గ్రామం నాశనమవుతుంది. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి సైకో అయితే రాష్ట్రం ఏమవుతుందో ఇప్పుడు అదే జరుగుతోంది. జగన్ రెడ్డి పాలనలో అందరూ బాధితులే. భర్త కళ్లదుటే మహిళలకు రక్షణ లేదు. మొన్న విశాఖలో ఒక యువతిని 11 మంది అత్యాచారం చేశారు. అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చూడండి. టీడీపీ హయాంలో యువతకు ఉద్యోగాలిస్తే నేడు జగన్ గంజాయి ఇస్తున్నాడు. నాడు ఐటి ఉద్యోగాలిస్తే జగన్ రెడ్డి రూ. 5 వేల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. వైసీపీ పాలనలో నిత్యసర ధరలన్నీ పెరిగాయి, సామాన్యుడు బ్రతికే పరిస్ధితిలేదు. దేశంలోకెల్లా పెట్రోల్ , డీజీల్ పై పన్నులు ఏపీలోనే ఎక్కువ. టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా కరెంట్ చార్జీలు పెంచలేదు. కానీ నేడు 9 సార్లు పెంచారు. అన్నింటిపై పన్నులు వేస్తున్నారు. నేను చెత్త నుంచి సంపద సృష్టిస్తే నేడు ఈ చెత్త ముఖ్యమంత్రి చెత్తపై పన్ను వేశాడు. రాష్ట్రంలోని ప్రజలందరి ఆదాయం ఎంత ఉందో అంత అప్పు రాష్ట్రంపై ఉంది. ఈ అప్పంతా మనమే కట్టాలి. వైసీపీ పాలనలో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ రివర్స్ అయిపోయాయి. నిరుద్యోగం తాండవిస్తోంది, రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే ఎలా చేస్తారని కొంతమంది నన్ను అడుగుతున్నారు. నాకున్న అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తా.
మద్యం, ఇసుక, మైనింగ్ లో కోట్లు దోచుకుంటున్నారు..
టీడీపీ హయాంలో ఉచిత ఇసుక ఇచ్చాం, కానీ నేడు ఎక్కడైనా ఉచితంగా ఇసుక దొరుకుతుందా? నేడు ట్రాక్టర్ ఇసుక రూ. 5 వేలు . ఈ డబ్బంతా సాయంత్రానికి తాడేపల్లి కొంపకు వెళ్తోంది. నాసిరకం మద్యంతో పేదల రక్తం త్రాగుతున్నారు. మద్యం, మైనింగ్ లో లక్షల కోట్లు దోచుకుంటున్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం రేట్లు తగ్గించి, నాణ్యమైన మద్యం విక్రయిస్తాం. జగన్ రెడ్డి నియంత పోకడ పోతున్నాడు. ప్రశ్నించినవారిపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు.
జగన్ తాను చేసిన తప్పులకు ఎమ్మెల్యేలను బలిపశువుల్ని చేస్తున్నాడు…
5 ఏళ్లు చేసిన పాపాలు జగన్ ని వెంటాడుతున్నాయి. సర్వేలతో ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. మీ ఇంట్లో చెత్త పక్కింట్లో వేస్తారా? కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నింటిలో దోపిడికి పాల్పడుతున్నాడు. ఆయన్ని ఎందుకు మార్చలేదు? యర్రగొండపాలెంలో మంత్రి బట్టలిప్పి తిరిగాడు, ఆయన్ని కొండపికి మార్చారు. యర్రగొండపాలెం చెత్త తీసుకెళ్లి కొండపిలో వేస్తే బంగారం అవుతుందా? మార్కాపురం ఎమ్మెల్యే నయీం, వాళ్ల తమ్ముడు చోటా నయీం అని అక్కడి ప్రజలే అంటున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే పోటీచేయలేనని పారిపోయాడు. సంతనూతలపాడు ఎమ్మెల్యేకు ప్రతి పనిలో వాటాలే ఆయనకు సీటు లేదు, రాష్ట్రం, జిల్లా అంతా నాదే అన్న బాలినేని అడ్రస్ గల్లైంతైంది. ఇది రాజకీయమా? జగన్ తాను చేసిన తప్పులకు తన ఎమ్మెల్యేలను బలిపశుల్ని చేశాడు.
గౌరవ సభలోనే అడుగుపెడతా…
వైసీపీలో ప్రజా సేవ చూసి కాదు నన్ను, పవన్ ని, లోకేశ్ ని తిట్టిన వాళ్లకే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లిస్తారంట. నన్ను మా ఆవిడను అసెంబ్లీ సాక్షిగా బూతులు తిడితే పెద్ద నాయకులు అవుతారా? 23 క్లైమోర్ బాంబులకే నేను భయపడలా? కానీ నా భార్యను అసెంబ్లీలో తిట్టినపుడు జీవితంలో మొదటిసారి బాధపడ్డా. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్లీ గౌరవ సభ చేశాకే సభలో అడుగు పెడతానని శపధం చేశా. నా శపధం నెరవేర్చుతారా? నేను అధికారం కోసం రాలేదు. తెలుగు జాతిని నెం. 1 చేయాలన్నదే నా తపన. నాడు ఐటిని అభివృద్ది చేయటం వల్లే నేడు తెలంగాణకు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వస్తోంది. త్వరలో తెలుగు జాతి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తయారవుతుంది.
పేదల కోసమే సూపర్ సిక్స్..
టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తాం, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద రూ. 15 వేలిస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. నిత్యవసర ధరలు తగ్గిస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తాం. రైతులకు అన్నధాత పధకం కింద ఏడాదికి రూ. 20 వేలిస్తాం. మైక్రో ఇరిగేషన్ తెస్తాం, రైతులను అన్ని విధాల ఆదుకుంటాం. యువత ఈ 100 రోజులు కష్టపడాలి. సైకిలెక్కి టీడీపీ జెండా పెట్టుకోండి, మీకు దారి చూపిస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం. డీఎస్సీ ఇస్తాం, ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. సురక్షిత మంచినీరు అందిస్తాం. జగన్ రెడ్డి వెలుగొండ కాంట్రాక్టర్లను మార్చాడు కానీ, ప్రాజెక్టు పూర్తి చేయలేదు. వెలుగొండ పనులను నేనే ప్రారంభించా, మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే వెలుగొండ పూర్తి చేస్తాం. టీడీపీకి బీసీలు వెన్నెముక.. వారి రుణం తీర్చుకుంటా. బీసీలను ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహిస్తాం. మైనార్టీలకు రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదు. ఎస్సీలకు 30 సంక్షేమ పధకాలు రద్దు చేశారు. ఎస్సీ యువకుడిని చంపి డోర్ డెలివరి చేసిన వైసీపీ ఎమ్మెల్సీని జైలు నుంచే ఊరేగింపుగా తీసుకెళ్తారా? ఎస్సీ,ఎస్టీ,బీసీలను ఆదుకునే బాధ్యత నాది. వైసీపీ పాలనలో సర్పంచులకు వాలంటీర్ కి ఉండే గౌరవం కూడా లేదు. నిధులు, విధులు లేవు. స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమర్థంగా ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. నిధులు లేక సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. సర్పంచ్ లకు గౌరవం పెంచే బాధ్యత టీడీపీదే.
ప్రకాశం జిల్లాను అన్ని విధాల అభివృద్ది చేస్తాం.
టీడీపీ హయాంలో కనిగిరికి ట్రిపుల్‌ఐటీ తెస్తే జగన్ ఒంగోలుకి తీసుకెళ్లి ప్రవేట్ భవనంలో పెట్టారు. త్రిపుల్ ఐటీని మళ్లీ కనిగిరికే తీసుకువస్తాం. నాడు నేషనల్ ఇండస్టీస్ మ్యానుపాక్చచరింగ్ జోన్ పెట్టాం. అది వచ్చి ఉంటే ఇక్కడి పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చేవి. దాన్ని తీసుకొచ్చే బాద్యత మాది. ఐదేళ్లలో రామాయపట్నం పోర్టును పూర్తి చేయలేకపోయారు. నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం పూర్తి చేస్తాం. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చూస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు ఇస్తాం. ఇది మెదటి దశలో పూర్తి చేస్తా. గుండ్లకమ్మ, కొరిశపాడు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. గుంటూరు ఛానల్‌ను పర్చూరుకు తీసుకెళ్లి గోదావరి నీరు ఇస్తాం. నాగార్జున సాగర్ కుడికాలువకు గోదావరి నీళ్లు తెచ్చి నీటి ఎద్దటి లేకుండా చేస్తాం. మార్కాపురం జిల్లా కావాలనే మీ కోరిక తీరుస్తాం. కందుకూరును ఒంగోలు జిల్లాలో కలుపుతా. ఒంగోలు, మార్కాపురం, కనిగిరిలో టిడ్కో ఇళ్లు పూర్తి చేయలేదు. టిడ్కో ఇళ్లు ప్రజల సంపద.. మీకు అప్పగించే బాధ్యత మాది. ప్రకాశం జిల్లాకు ఆక్వా, గ్రానైట్, ఫార్మా పరిశ్రమలు తెస్తాం. ప్రకాశం జిల్లా యువతకు స్థానికంగానే ఉపాధి కల్పిస్తాం. ప్రభుత్వం తెచ్చిన భూరక్ష చట్టం చాలా ప్రమాదకరమైంది. అది వస్తే మీ భూమి మీపేరు మీద ఉండదు. భూరక్ష చట్టం రద్దు చేస్తాం. ప్రకాశం జిల్లాలో జరిగిన భూకుంభకోణాలపై సిట్ దర్యాప్తు వేస్తాం. ఆ భూములన్నీ తిరిగి ప్రజలకు అప్పగిస్తాం. ఒంగోలు టౌన్ లో అమృత్ పధకం కింద రెండు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నిర్మాణం ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి చేశాం, మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ఆ పనులు మేమే పూర్తి చేస్తాం.
కొత్త ఏడాది స్వర్ణ యుగం రావాలంటే రాతి యుగం పోవాలి…
చిన్న పొరపాటు చేసి ఐదేళ్లు నరకం అనుభవించాం. కొత్త ఏడాదిలో అందరి జీవితాల్లో వెలుగులు రావాలి. కొత్త ఏడాది స్వర్ణ యుగం రావాలంటే రాతి యుగం పోవాలి. సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. పాతికేళ్ల క్రితం నా ఆలోచన వల్ల తెలుగు యువత బాగుపడ్డారు. తెలుగు యువతకు అండగా నిలబడతాం. మీరు ఒక అడుగు ముందుకేస్తే నేడు వంద అడుగులు ముందుకేస్తా.
వివేకానందరెడ్డిని హత్య చేసి మొదట గుండెపోటు, రక్తపు వాంతులు అన్నారు. నాపై అభాండాలు వేసి కోడికత్తి డ్రామా ఆడి అధికారంలోకి వచ్చారు. నాడ సీబీఐ కావాలన్నారు, అధికారంలోకి వచ్చాక సీబీఐ వద్దన్నారు. కోడికత్తి శ్రీను చేయని పాపానికి 5 ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. సొంత చెల్లెలు సునీతపై కేసులు పెట్టారు. సొంత చెల్లెలు వేరే పార్టీలో చేరితే మనల్ని తిడుతున్నారు. నేరాలు, ఘోరాలు చేసి వాటిని ఎ దుటివారిపైకి నెడుతున్నారు. టీవీ పేపర్ ఉందని అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారు. ఎన్నికల తర్వాత మూడు రాజధానులు అన్నారు. సూపర్ సిక్స్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తా. సంపదను ఎలా పెంచుకోవాలో ప్రజలకు నేర్పిస్తా. సమర్థ నాయకత్వం కోసమే ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరణ. నా నియోజకవర్గంలో కూడా నాపై అభిప్రాయం తీసుకుంటున్నా.
రా…కదలిరా...
తెలుగుజాతి స్వర్ణయుగం కోసం రా కదలి రా.. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అందరూ కదిలి రావాలి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం రా..కదిలిరా.. మార్కాపురం జిల్లా కోసం రా.. కదలి రా.. మీ పిల్లల ఉద్యోగాల కోసం రా.. కదలి రా.. రైతన్నల బాగు కోసం రా.. కదలి రా.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల భవిష్యత్తు కోసం రా.. కదలి రా.. ఆడబిడ్డల రక్షణ కోసం రా.. కదలి రా.. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా.. కదలి రా. అంటూ చంద్రబాబు నాయుడు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలందర్నీ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ రాజకీయాలకు అనర్హుడని ప్రజలంతా ఒక్కటై తిరుగులేని మెజార్టీతో టీడీపీ జనసేనను గెలిపించాలని చంద్రబాబు నాయుడు కోరారు.