27 మంది ఎమ్మెల్యేలపై జగన్ సీరియస్.. వారికి మళ్లీ సీట్లు ఇవ్వనన్న సీఎం..
పని తీరు బాగోని నాయకులకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్లో ఉండకపోతే టికెట్లు ఇవ్వనని స్పష్టం చేశారు. ఎన్నికలకు 6 నెలల ముందే టికెట్టు ఇవ్వనివారి పేర్లు ప్రకటిస్తానన్నారు.
ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా ఇన్‌ఛార్జిలతో ముగిసిన సీఎం జగన్ భేటీ ముగిసింది. నేతల పనితీరుపై ఐప్యాక్ టీమ్ నివేదికలను ఎమ్మెల్యేలకు వెల్లడించారు ముఖ్యమంత్రి. 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. గడప గడపకు కార్యక్రమంలో కొందరు సరైన పనితీరు కనపరచలేదన్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టాలని సదరు ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోకుంటే సీటు ఇచ్చేది లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. నవంబరులో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు రివ్యూ చేస్తామన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందే సీటు ఇవ్వనివారి పేర్లు ప్రకటిస్తానని సీఎం.. ఎమ్మెల్యేలతో చెప్పారు. వారంలో 4 రోజులు జనంలోనే ఉండాలని జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు. కొంతమంది నాయకులు ప్రజల్లోకి వెళ్లకుండా.. కొడుకులు లేదా వారసులను పంపడం కరెక్ట్ కాదన్నారు సీఎం. ఇకపై అలా కుదరదని.. నేతలే స్వయంగా వెళ్లాలన్నారు.
ఈసారి కుప్పంలోనూ గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్న సీఎం జగన్ అందుకోసం పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే వారానికి నాలుగు రోజులు జనంలోనే ఉండాలని ఆదేశించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోని వారికి గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షం విమర్శలకు సమాధానం చెప్పని మంత్రులను కేబినెట్ భేటీలోనే హెచ్చరించారు. తీరు మారకపోతే మళ్లీ పునర్ వ్యవస్థీకరణ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. గడప గడపకు సమీక్షలో 27 మందిపై ఫోకస్ పెట్టారు. ఈ 27 మందిలో మంత్రులు సైతం ఉన్నారు. తాను అనుకున్న 175 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదనే ఇండికేషన్స్‌ను చాలా గట్టిగా ఇస్తున్నారు జగన్.
175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్‌కి సంబంధించిన రిపోర్ట్‌ని పీకే టీమ్ తాజాగా ముఖ్యమంత్రి జగన్‌కు అందించింది. ఈ నివేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించారు సీఎం. టోటల్‌గా 175 సీట్లు గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై గడప గడపకు వైసీపీ ప్రభుత్వంలో అందిన ఫీడ్‌బ్యాక్‌ను సీఎం కొలమానంగా తీసుకున్నారని తెలిసింది టాక్ వినిపిస్తోంది. భవిష్యత్‌లో వాటి ఆధారంగానే టికెట్లను కేటాయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా? సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారా? సంక్షేమ పథకాల అమలు.. ప్రభుత్వ ఉద్దేశం ఎంత మేర నెరవేరుతోందన్న అభిప్రాయాలను సీఎం తీసుకున్నట్లు సమాచారం. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జీలకు త్వరలో కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అన్ని స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో అభ్యర్థుల విషయంలో కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగమే ఈ వర్క్‌షాప్ అని తెలుస్తోంది.