కాకినాడ జిల్లా-వేట్లపాలెం, ఫిబ్రవరి 28: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా పేలిన ఘటనలో మరణాలు సంభవించడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బాధితులకు.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల మేర ఎక్స్ గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు ప్రకటించారు. క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా ఇస్తామని వెల్లడించారు. ఈ ఘటనకు కారకులైన నలుగురు స్థానిక అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శనివారం విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రమాదం ఘటన గురించి తెలియగానే…జిల్లా అధికారులతో, వివిధ శాఖలకు చెందిన మంత్రులతో మాట్లాడారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎం ఆదేశించారు. అనంతరం నేరుగా కాకినాడ జిల్లా వేట్లపాలెం వచ్చారు. హెలీప్యాడ్ నుంచి సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ కారులోనే ముఖ్యమంత్రి ప్రయాణించారు. బాణాసంచా పేలుడు జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జిల్లా కలెక్టర్, ఎస్పీలు ముఖ్యమంత్రికి వివరించారు. ఘటన జరిగిన స్థలంలోనే సుమారు అరగంట పాటు అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కారులోనే సామర్లకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కాకినాడ జీజీహెచ్ కు చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించి… వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ…“బాణసంచా ఘటన చాలా దురదృష్టకరం. విచారకర ఘటన. ఇప్పటి వరకు 20 మంది చనిపోయారు. 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతుల్లో 12 మంది ఎస్సీలు, 9 మంది మహిళలు ఉన్నారు. కూలీ పని కోసం…పూట గడవడం కోసం బాణాసంచా తయారీ పనికి వెళ్లారు. ప్రభుత్వ పరంగా మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తాం. కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారిని కూడా ఆదుకుంటాం. చిన్న పిల్లలు ఉండి, చదువుకునే వారిని రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పిస్తాం. ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మిస్తాం. చనిపోయిన వారిని తీసుకురాలేము. కానీ వారి కుటుంబాలను అండగా నిలబడతాం. మృతి చెందిన వారి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.”అని సీఎం సంతాపం వ్యక్తం చేశారు.
*నలుగురు ఆఫీసర్ల సస్పెన్షన్… బాధ్యులను ఫిక్స్ చేస్తాం*
“జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది. కొద్దిరోజుల క్రితమే ఒక సంఘటన జరిగింది.. దాని తర్వాత ఇది రెండో ఘటన. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులను ఫిక్స్ చేస్తాం. ఆర్డీఓ, డీఎస్పీ, జిల్లా లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్లను తక్షణం సస్పెండ్ చేస్తున్నాం. విచారణ అనంతరం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. కొందరు విచ్చల విడితనానికి అలవాటు పడి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు… వారిని అరెస్టు చేయడంతోపాటు ప్రాసిక్యూట్ చేస్తాం. వాళ్ల ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అప్పగిస్తాం. ఇష్ట ప్రకారం చేయడానికి వీల్లేదు. అనుమతులు వచ్చాక మనుషులను నియమించుకున్నారు తప్ప జాగ్రత్తలు తీసుకోలేదు. పేలుడు పదార్ధాలు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఎన్ని బాణసంచా కేంద్రాలు ఉన్నాయో సమాచారం తీసుకుంటాం. ఉన్న ప్రొసీజర్స్ కూడా సరిపోవడం లేదు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూములకు అనుసంధానిస్తాం. బాణసంచా కేంద్రాలకు అనుమతులు కఠినతరం చేస్తాం.”అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు వెంట హోం మంత్రి అనిత, ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్, సానా సతీష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.










