సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ (SCC)
హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’
* అక్టోబర్ 14న సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
* గ్లోబల్ బిజినెస్ మీట్‌కు హాజరుకానున్న పద్మవిభూషణ్ చిరంజీవి
* పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి అంతర్జాతీయ వేదిక
* ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం
వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పించే లక్ష్యంతో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’ నిర్వహించనున్నారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ రెండు రోజుల సదస్సు జరగనుంది.అక్టోబర్ 14న ఉదయం 10.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ప్రారంభించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పద్మవిభూషణ్ కొణిదెల చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ కూడా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు.వ్యాపార భాగస్వామ్యాల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ, కొత్త మార్కెట్ల అన్వేషణ, పారిశ్రామిక రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించడం ఈ గ్లోబల్ బిజినెస్ మీట్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ద్వారా దక్షిణ భారతదేశంలో వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు టీవీఎన్ రావు, పీవీ రావు, ఏవీ రత్నం, తోట చంద్రశేఖర్,రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.









