అనంతపురం జిల్లా కళ్యాణదుర్గo నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాలు ఒకటయ్యాయి. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి,, నియోజకవర్గ ఇన్చార్జి మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి ఇకపై తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు.
గడిచిన ఎన్నికల్లో ఉమామహేశ్వర్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటి నుండి రెండు వర్గాలుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తమకే అంటూ ఇరు వర్గాలు పోటీపడ్డాయి. అయితే అధిష్టానం వీరిద్దరినీ కాదని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబును రంగంలోకి దించినట్లు సమాచారం అందడంతో వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. టిడిపిలో కష్టపడిన వారికి టికెట్ ఎవరికిచ్చిన పార్టీ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ భవన్లో ఇద్దరు నాయకులు ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. తమ ఇద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో పార్టీ కార్యక్రమాలు విడివిడిగా చేపట్టామని అయితే భవిష్యత్తులో సమన్వయంతో పని చేస్తూ పార్టీ విజయానికి కృషి చేస్తామని ఉన్నం హనుమంతరాయ చౌదరి ప్రకటించారు. టిడిపి ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఉన్నo కుటుంబంతో కొన్ని విభేదాలు వచ్చి విడివిడిగా కార్యక్రమంలో చేసాం. కానీ పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు ఏనాడు చేయలేదని తెలిపారు. 40 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన వారిని కాకుండా వ్యాపారస్తులు ఇక్కడ నుండి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టడంతో తామంతా ఏకమై స్థానికంగా పనిచేసిన వారికే టికెట్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. పార్టీ అధిష్టానం తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా విజయం సాధించి తీరుతామని తెలిపారు.
2019 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కార్యకర్తలను అంటిపెట్టుకొని వారిలో భరోసా నింపుతూ పార్టీ విజయానికి బాటలు వేస్తే ఎవరో వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి పోటీ చేసి గెలుపొందుతామంటే కుదరదని టిడిపి యువనేత మారుతి చౌదరి అన్నారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు కు కానుకగా ఇస్తామని పార్టీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేయాలని కోరారు.