‘గాలోడు’ ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా – సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న మాస్అండ్‌యాక్షన్ ఎంటర్‌టైనర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా హీరో సుధీర్ మీడియాతో ముచ్చటించారు.
గాలోడు కథ నాకు చాలా నచ్చింది. నా పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా బాగుంటుంది. అందుకే సినిమాను ఒప్పుకున్నాను. ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే వ్యక్తి సమస్యల్లో పడి సిటీకి రావడం, మళ్లీ సిటీలో ఇంకో సమస్యలో చిక్కుకోవడం, ఈ మధ్యలో ప్రేమ కథ ఉంటుంది.. చిన్న చిన్న టిస్టులతో మంచి మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా నడుస్తుంది.
గాలోడు కొత్త కథ అని చెప్పను గానీ.. మంచి మాస్ కమర్షియల్ అంశాలన్నీ ఉంటాయి. చిన్నతనం నుంచి మాస్ సినిమాలంటే ఇష్టం, చిరంజీవి, రజనీకాంత్ గారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. మా మాస్ ఆడియెన్స్‌ని మెప్పించేందుకు ఈ సినిమాను చేశాను.
కథకు తగ్గట్టుగానే ఈ సినిమా టైటిల్‌ను పెట్టాం. కాలేజ్‌లో గాలోడు చేష్టలు చేస్తుంటాడు. ఈ పాత్రను చూస్తేనే గాలోడులా అనిపిస్తుంది. కొన్ని సీన్లు నేను సుధీర్‌లా ఆలోచించి.. వద్దని అనేవాడ్ని. కానీ గాలోడు అలానే చేస్తాడు అని మా డైరెక్టర్ చెప్పేవారు.
సుధీర్ అంటే కామెడీ ఇమేజ్ ఉంది. మాస్ ఆడియెన్స్‌కి కూడా సుధీర్ అంటే ఇష్టమే. పూర్తి కమర్షియల్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే గాలోడు చేశాను. ప్రయోగాలు చేస్తుండాలని అందరూ చెబుతుంటారు. ఇమేజ్ మార్చే సినిమా వస్తే ప్రయత్నం చేయాలి. జనాలు చూస్తారా? లేదా? అన్నది తరువాత. కానీ మనం మాత్రం ప్రయత్నం చేయాలి.
మార్కెట్ రేంజ్ గురించి నాకు తెలీదు. కానీ ఏ నిర్మాతకు కూడా డబ్బులు పోకూడదని నేను కోరుకుంటున్నాను. సినిమాను కొన్న ప్రతీ ఒక్కరికీ నష్టం రాకూడదని అనుకుంటాను. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటే చాలు. ఈ సినిమాను ఎంతలో తీశారు..ఎంత పెట్టారు అనే విషయాలు నాకు తెలీదు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తే చాలు.
హీరోగా కంటే నేను ఎంటర్టైనర్ అని అనిపించుకునే దానిలో నాకు ఎక్కువ సంతోషం ఉంటుంది. కమెడియన్, హీరో అనిపించుకోవాలని నాకు లేదు.
నాకు మాస్ జానర్ అంటే ఇష్టం. ట్విస్టులుండే కథలంటే కూడా ఇష్టమే. కథ నచ్చితే సినిమా చేస్తాను.
ఢీ షో తరువాతే సినిమా అవకాశాలు వచ్చాయి. అక్కడ డ్యాన్సులు, మ్యాజిక్, కామెడీ చేయడంతో సినిమా ఆఫర్లు వచ్చాయి. ట్రై చేద్దామని కొంత మంది వచ్చారు. ఎదుటివాళ్ళు నన్ను నమ్మినప్పుడు.. నాపై నాకు కూడా నమ్మకం ఉండాలి కదా? అని సినిమాలను అంగీకరించాను. అలా అని సినిమాలే కాదు.. బుల్లితెరపై కూడా షోలు చేస్తుంటాను.
ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుంటే స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అని తేడా ఉంటుంది. కానీ నాకు అలా లేదు. మ్యాజిక్ షో చేయమని అడిగారు. చేస్తాను అని అన్నాను. అలానే షోలు అడిగితే కూడా చేస్తాను.
ముందుగా ఈ కథను రష్మీ గౌతమ్ గారికే చెప్పారు. ఆమె డేట్స్ కుదరలేదు. మేం ఇద్దరం కలిసి చేయాలని అనుకుంటున్నాం. మంచి కథ దొరికితే మాత్రం కచ్చితంగా చేస్తాం.
ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఉన్నన్నీ రోజులు నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని అనుకుంటాను. అది వెండితెర అయినా, బుల్లితెర అయినా పర్లేదు. అందర్నీ నేను నవ్విస్తూ ఉండాలని భావిస్తాను.
ఇండస్ట్రీలో అందరూ నన్ను ఫ్యామిలీలా చూస్తారు. టీవీ ఆర్టిస్ట్ అన్న కోణంలో నన్ను చూడలేదు. వారిలో ఒకరిలానే నన్ను చూస్తుంటారు.
ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. రష్మీ గారికి నాకు ఎందుకు అలా కుదిరిందంటే.. మేం ఇద్దరం పట్టుకోం.. ముట్టుకోం. కళ్లతోనే మా భావాలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం. ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ మాత్రం వద్దని చెబుతాను. కానీ డైరెక్టర్‌కు నేను చెప్పే పొజిషన్‌లో లేను. ఆ స్థాయికి వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా అలాంటివి వద్దని చెబుతాను.
జబర్దస్త్ స్టేజ్‌ను మిస్ అవుతుంటాను. కానీ నేను ఆ గ్యాప్ అడిగి తీసుకున్నదే. ఆరు నెలలు బ్రేక్ తీసుకుంటాను అని చెప్పా. ఇప్పుడు వచ్చేందుకు రెడీగా ఉన్నాను అని చెప్పా.
గాలోడు టీజర్, ట్రైలర్ వచ్చిన తర్వాత.. చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇన్నాళ్లకు ఓ సినిమా చేసినట్టు ఉంది.. హీరోగా అనిపించింది అని చాలామంది అన్నారు. అదే నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. రాం ప్రసాద్ గారి కెమెరా పనితనం, భీమ్ గారి సంగీతం, మా దర్శక నిర్మాత రాజశేఖర్ రెడ్డి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ రక్తం ధారపోసి పని చేశారు.
ఇప్పటి వరకు రకరకాల సినిమాలు చూశాం. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చూశాం. కానీ ఇలాంటి మాస్ ఆడియన్స్ పక్కా మాస్ చిత్రాలను మిస్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ గాలోడు చిత్రం. ఈ చిత్రం కచ్చితంగా మాస్ ఆడియెన్స్‌ను నిరాశపర్చదు.