ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందా రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోంది అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ప్రశ్నించారు. లోకేష్ అరెస్టుకు నిరసనగా కళ్యాణదుర్గం లోని ఎన్టీఆర్ భవన్ నుంచి స్థానిక సర్కిల్ వరకు తెదేపా శ్రేణులతో ఉమా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని వంచనకు గురైన కుటుంబాలను కనీసం పరామర్శించడానికి కూడా ప్రభుత్వం అనుమతించకుండా అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోందో,రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందో అర్థం కావటం లేదన్నారు. లోకేష్ బాబు ను అరెస్టు చేయడం సిగ్గుచేటని ఇందుకు నిరసనగా తాము కాగడాల ప్రదర్శన చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిపక్షాల పట్ల వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు.