రాష్ట్రంలో జరుగుతున్న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని, గ్లోబల్ వార్మింగ్, ఇతర పర్యావరణ సమస్యలకు ప్రకృతి వ్యవసాయాన్ని పరిష్కారంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గ్లోబల్ అలయెన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ అనే అంతర్జాతీయ సంస్థ త్వరలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిగారిని కలిసి ఈ విషయాలను చర్చించనున్నారని వివరించారు. గోశాల నిర్వాహకులు మరియు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారులకు రెండు రోజుల గోప్రాముఖ్యత సదస్సు బుధవారం తిరుపతిలోని శ్వేత భవనంలో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ఈవో ముఖ్య అతిథిగా వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర చెల్లించి వాటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని, ఇలాంటి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కూడా ప్రణాళిక రూపొందిస్తోందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీపై గోశాల నిర్వాహకులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నోడల్ గోశాలలను గుర్తించి ఇస్కాన్ సంస్థ సహకారంతో ప్రకృతి వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తామన్నారు. గోసంరక్షణ కోసం టిటిడి నడుం బిగించిందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోశాలల సహకారంతో గోసంరక్షణ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని వెల్లడించారు. శ్రీవారికి గో ఆధారిత నైవేద్యంతో ఈ కార్యక్రమాలను మొదలుపెట్టి నవనీతసేవను ప్రారంభించామన్నారు.
రైతు సాధిసార సంస్థ సహకారంతో ప్రకృతి వ్యయసాయ రైతుల నుండి శనగలు కొనుగోలు చేసి లడ్డూ ప్రసాదం తయారు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో 7 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, ఇలాంటి రైతులందరికీ గోవుల అవసరం ఉందని చెప్పారు. ఇప్పటివరకు 1700 వట్టిపోయిన ఆవులను రైతులకు అందించామని, శ్రీవారి ప్రసాదంగా భావించి పూజలు చేసి పోషించుకుంటున్నారని వివరించారు. టిటిడి ఆధ్వర్యంలో మేలుజాతి గోసంతతిని పెంచేందుకు పిండమార్పిడి కోసం ఒప్పందం చేసుకున్నామని, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. పంచగవ్యాలతో ఆయుర్వేద ఔషధాల తయారీ కూడా జరుగుతోందని, శ్రీనివాస ఆయుర్వేద ఫార్మశీ ద్వారా సుమారు 85 రకాల ఔషధాలను తయారు చేస్తున్నామని వివరించారు.
జెఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ గోశాలల నిర్వహణ, గోవుల ఆరోగ్యం, వట్టిపోయిన ఆవులను సమర్థవంతంగా వ్యవసాయానికి వినియోగించుకోవడం తదితర అంశాలపై ఈ సదస్సులో అవగాహన కల్పిస్తామన్నారు. నిరాదరణకు గురవుతున్న గోవులను గోశాల నిర్వాహకులు చేరదీయాలని, అనంతరం వాటిని టిటిడి సహకారంతో రైతులకు అందిస్తామని తెలిపారు.
తిరుపతి ఇస్కాన్ సంస్థ అధ్యక్షులు శ్రీ రేవతి రమణదాస్ మాట్లాడుతూ టిటిడి గోవుకు విశేష ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగానే జాతీయ ప్రాణిగా గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని, ఇందుకోసం తమ సంస్థ కూడా కృషి చేస్తోందని చెప్పారు. గోవులు సంతోషంగా ఉంటే సమాజం సుఖశాంతులతో ఉంటుందన్నారు. దేశీయ గోవులను చూస్తేనే మంచి అనుభూతి కలుగుతుందని, వాటి సమక్షంలో కొంత సమయం ఉంటే కొన్ని రకాల వ్యాధులు దూరమవుతాయని చెప్పారు.
అనంతరం గో గ్రాసాలు అనే అంశంపై కేరళకు చెందిన డా. శ్రీకుమార్ ప్రభుజీ, గోవుల ఆరోగ్యం – చికిత్సా విధానంపై అనువంశిక ఆయుర్వేద వైద్యులు డా. జి.శశిధర్ ప్రసంగించారు. ఆ తరువాత పంచగవ్య ఉత్పత్తులు – పరిచయం అనే అంశంపై శ్రీ శ్రీరామ ప్రభు, పంచగవ్య ఉత్పత్తులు – ప్రాక్టికల్స్ పై శ్రీ భక్తి భూషణ్ ప్రభుజీ, పంచగవ్య ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై శ్రీ మైనంపాటి శ్రీనివాసరావు ఉపన్యసించారు.
ఆకట్టుకున్న స్టాళ్లు
టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తీలు స్టాళ్లతోపాటు పలు ప్రాంతాల నుండి ఏర్పాటుచేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వీటిలో మహారాష్ట్ర కొల్హాపూర్‌కు చెందిన వేణుమాధవి ట్రస్టు, కర్నూలు జిల్లా అహోబిలానికి చెందిన హరేకృష్ణ నేచురల్ ఫుడ్స్, చిత్తూరు జిల్లా మంగళంపేటకు చెందిన గోవనం ఆశ్రమం, వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ముక్తిధామం పంచగవ్య చికిత్సాలయం, కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన పుణ్యకోటి గోశాల కేంద్రం నిర్వాహకులు తమ పంచగవ్య, ఆయుర్వేద ఉత్పత్తులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ గోశాల సంచాలకు డాక్టర్ హరనాథరెడ్డి, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.