నాయకత్వానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం చేరుకునేందుకు ఒక ప్రణాళిక ఉండాలి. అప్పుడే ఏదయినా సాధ్యం అవుతుంది. స్పష్టమయిన ప్రణాళిక, వ్యూహంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకత్వానికి తెచ్చుకున్న రాష్ట్రంలో ఏం చేయాలి ? ఎలా ముందుకువెళ్లాలి ? అన్న విషయంపై స్పష్టమయిన అవగాహన కలిగిఉండడం తెలంగాణ రాష్ట్రం చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో సాగునీటికి, తాగునీటికి, కరంటుకు కష్టాలు ఎదుర్కొంటున్న కాలం. ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ సమీక్షలతో కేవలం ఆరునెలలలో కరంటు సమస్యను కొలిక్కి తీసుకువచ్చారు. వ్యవసాయానికి నాణ్యమయిన కరంటును అందుబాటులోకి తీసుకువచ్చారు. 2018 జనవరి 1 నుండి వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు. రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి, మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటలు బాగుచేసి సాగునీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. కేవలం మూడేళ్లలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో సాగునీటికి రైతాంగానికి ఢోకా లేకుండా పోయింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఆ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తే తెలంగాణ అంతా సస్యశ్యామలం అవుతుంది.
2014 నాటికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కోటీ 34 లక్షల ఎకరాలు కాగా అది 2021 నాటికి అది ఉద్యాన పంటలతో కలిపి 2 కోట్ల 14.50 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2021-22 నాటికి 2.49 కోట్ల టన్నులకు చేరింది. సాగునీటి రాకతో రైతాంగం వరి సాగు వైపు ఎక్కువ మొగ్గుచూపారు. దీనిమూలంగా వచ్చే దుష్పరిమాణాలను దూరదృష్టితో గమనించిన తెలంగాణ ప్రభుత్వం రైతులను పంటల వైవిధ్యీకరణ వైపు మళ్లించేందుకు సిద్దమయింది. ప్రధానంగా ప్రతి ఏటా దేశం దాదాపు 90 వేల కోట్ల రూపాయల విలువయిన 22 మిలియన్ మెట్రిక్ టన్నుల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో నూనెగింజల పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు ప్రధానంగా ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను మళ్లించాలని నిర్ణయించింది. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా రెండేళ్ల క్రితం ప్రణాళిక ప్రారంభించింది. తెలంగాణ నేలలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమని కేంద్రప్రభుత్వం నివేదిక ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో రైతులను ఆయిల్ పామ్ తోటల సందర్శనకు తీసుకువెళ్లి అవగాహన కల్పించారు. తెలంగాణలో వివిధ జిల్లాలలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు 11 ఆయిల్ పామ్ కంపెనీలను ఎంపికచేసి 1502 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలను ఏర్పాటు చేశారు.
అందుబాటులో మొక్కలు, కళ్ల ముందు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ల నిర్మాణంతో రైతాంగం ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వస్తున్నారు. దీంతో కేవలం ఏడాదిలో 52 వేల ఎకరాలలో కొత్తగా ఆయిల్ పామ్ మొక్కలు నాటి రికార్డు తెలంగాణ రికార్డు సృష్టించింది. మార్చి నెలాఖరు నాటికి మరో 70 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటేందుకు అన్నీ సిద్దం చేశారు. 2023 – 24 లో నాటేందుకు అందుబాటులో కోటి ఆయిల్ పామ్ మొక్కలు సిద్దమవుతున్నాయి. అవి పూర్తయితే మరో లక్ష 50 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగులోకి వస్తుంది. ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తూనే ఆయా జిల్లాలలో ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ ద్వారా 458 ఎకరాల భూమి సేకరించింది. నిర్మల్, వనపర్తి, మంచిర్యాలలలో ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ప్రీ యూనిక్, మ్యాట్రిక్స్ కంపెనీలకు టీఎస్ ఐఐసీ ద్వారా భూమి కేటాయింపుకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది. మిగతా కంపెనీలు ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు భూమి కేటాయించేందుకు ధరఖాస్తులను పరిశీలిస్తున్నది. దీంతో పాటు కామారెడ్డి జిల్లా బొప్పాస్ పల్లి విత్తన క్షేత్రంలో ఆయిల్ పామ్ రీసెర్చ్ గార్డెన్ ఏర్పాటుకు నిర్ణయించింది. నల్లగొండ జిల్లా డిండి వ్యవసాయ క్షేత్రం, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం మాల్ తుమ్మెద విత్తన క్షేత్రంలో ఆయిల్ పామ్ మొక్కల క్షేత్రాల ఏర్పాటు అంశం పరిశీలనలో ఉన్నది.
దీంతో పాటు ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను చైతన్యం చేసేందుకు కంపెనీలు గ్రామాల వారీగా అవగాహనా సమావేశాలు నిర్వహించి, రైతువేదికలలో శిక్షణలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయిల్ పామ్ మీద ఆదాయం వచ్చే వరకు రైతులు అంతర పంటలు వేసుకునేందుకు ఇందులో రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రోత్సాహకంగా ఒక్కో మొక్కకి 193 రూపాయల రాయితీ చొప్పున ఎకరానికి 57 మొక్కలకు గాను 11వేల రూపాయలు రాయితీ ప్రభుత్వం ఇస్తున్నది. ఎకరం డ్రిప్ కోసం 22 వేల రాయితీ, నాలుగేళ్లపాటు ఎరువులు, ఇతర అవసరాలకోసం ఎకరానికి రూ.16,800 సబ్సిడీ ఇస్తున్నది. ఇలా రైతుకి ఒక ఎకరా ఆయిల్ పామ్ సాగు చేస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం రాయితీ 49,800 రూపాయలు కావడం గమనార్హం. స్పష్టమయిన ప్రణాళిక, దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విషయంలో ముందుకు సాగుతున్నది. రాబోయే కాలంలో దేశంలో ప్రధాన పామాయిల్ ఉత్పత్తిదారుగా తెలంగాణ నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
సందీప్ రెడ్డి కొత్తపల్లి