సత్య పేరుతో తెలుగులో విడుదలైన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, ఊర్మిలా మండోద్కర్ జంటగా నటించిన ఈ చిత్రం 90స్ లో భారీ విజయం సాధించి ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అలాగే కమల్ హాసన్, అమల జంటగా నటించిన చిత్రం సత్య. జనవరి 19, 1988లో విడుదలైన ఈ గ్యాంగ్‌స్టర్ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ నిర్మించారు. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది అప్పట్లో ఈ చిత్రం. ఇప్పుడు మరో తమిళ చిత్రం ‘రంగోళి’ సినిమా ‘సత్య’ పేరుతో తెలుగులోకి ఈ రోజు విడుదలైంది. అయితే ఇది క్లీన్ ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రం. ఇందులో హమరేష్, ప్రార్థన జంటగా నటించారు. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ప్రముఖ సినిమా జర్నలిస్ట్ శివ మల్లాల ఈ సినిమాని తెలుగులోకి అనువాదం చేసి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.
స్టోరీ ఏంటంటే…
సముద్రం అంతటి విశాలమైన సర్కారు కళాశాలలో చదువుతున్న సత్య(హమరేష్)ను తీసుకొచ్చి…. బావి లాంటి కార్పొరేట్ కళాశాలలో మంచి చదువుల కోసం తన తండ్రి గాంధీ(ఆడుకలం మురుగుదాస్) చేర్పిస్తాడు. ఇస్త్రీ చేసి పొట్టపోసుకునే కుటుంబమైనా… క్వాలిటీ విద్య తన కుమారునికి ఇప్పించాలనే కోరికతో లక్షలు అప్పులు చేసి ఈ కళాశాలలో చేర్పిస్తారు. అయితే సత్య అక్కడ తోటి విద్యార్థులతో వివక్షను ఎదుర్కోవడంతో పాటు… లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తో చాలా కష్టాలనే ఫేస్ చేస్తారు. అక్కడే పారు(ప్రార్థన) పరిచయం కూడా అవుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. అయినా… ఎందుకో సత్య ఆ కార్పొరేట్ కళాశాలలో ఇమడలేకపోతుంటారు. అదే సమయంలో తన చదువుకోసం తన తండ్రి చేసే అప్పులను చూసి తల్లడిల్లిపోతాడు. ఈ క్రమంలో సత్య తన చదువును ఎలా కొనసాగించారు? పారుతో తన ప్రేమ వ్యవహారం ఎంత వరకూ కొనసాగించారు? తోటి విద్యార్థులతో తన స్నేహం ఎలా కొనసాగించారు? అందుకు ఉపాధ్యాయులు చేసిన సహకారం ఎలాంటిది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్టోరీ… స్క్రీన్ ప్లే విశ్లేషణ: క్వాలిటీ విద్య పేరుతో ఎన్ని కార్పొరేట్ కళాశాలలు వచ్చినా…. చాలా మంది పేద విద్యార్థులు నేటికీ ప్రభుత్వ కళాశాలలనే ఇష్టపడుతూ ఉంటారు. అక్కడి వాతావరణం… స్నేహితుల మధ్య ఉండే అప్యాయతా అనురాగాలను ఆస్వాధిస్తూ… తమ కళాశాల జీవితాన్ని హాయిగా గడిపేస్తూ ఉంటారు. అలాంటి విద్యార్థి కథే ‘సత్య’. ఇందులో ఎంతో సరదాగా కళాశాల జీవితాన్ని గడిపే సత్యను తీసుకెళ్లి… మంచి విద్యను అందించాలనే పేరుతో ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ లో చేర్పిస్తాడు తన తండ్రి. అయితే ఆ వాతావరణం అంతా చాలా డిఫరెంట్ గా ఉండటంతో ఆ విద్యార్థి ఎలా డైజెస్ట్ చేసుకోలేకపోయారో ఇందులో చాలా చక్కడా చూపించారు దర్శకుడు. నిజంగా ఆ పాత్రలో మనమే ఉన్నామా అనేలా ఉంటుంది. చాలా మంది తమని తాము ప్రతి పాత్రలోనూ… అక్కడ జరిగే సన్నివేశాల్లో ఊహించుకుంటారు. అలాగే ఓ పేద కుటుంబంలో ఫీజుల కోసం తల్లిదండ్రులు పడే బాధలు ఇందులో ఉన్నాయి. క్వాలిటీ విద్యను అందించాలనే తపనతో లక్షలు అప్పులు చేసి… ఫీజు కట్టే ఓ తండ్రి పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. అలాంటి ఓ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ కథ ఇది కావడంతో చాలా మందికి నచ్చుతుంది.
ప్రభుత్వ కళాశాలల్లో ఉండే చదువుల మీద… అక్కడి వాతావరణం మీద తీసే సినిమాలలో సోల్ ఉంటుంది. స్టూడెంట్స్ మధ్య ఉండే రిలేషన్స్… అక్కడ జరిగే చిన్న చిన్న గొడవలు, ప్రేమలు, లెక్చరర్ల మందలింపులు, చదువుల్లో వారి ప్రోత్సహం… ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి కళాశాల జీవితంతో ముడిపడి ఉంటాయి. అలాంటి సన్నివేశాలన్నీ ‘సత్య’ సినిమాలో మనకు కనిపిస్తాయి. వాటికి కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఈ సినిమాకి హైలెట్ ఏంటంటే… ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. సముద్రంలాంటి గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే స్టూడెంట్ ని తీసుకెళ్లి బావి లాగా ఉండే ప్రైవేట్ కాలేజీలో వేస్తే… ఆ తండ్రికి కొడుక్కి మధ్య జరిగే సంభాషణ… వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ అన్నీ మన మనసుకు తాకుతాయి. కార్పొరేట్ చదువులకు లక్షలు డబ్బులు కట్టేందుకు తల్లిదండ్రులు పడే బాధలు, కష్టాలను ఇందులో చూపించారు. అలాంటి సీన్స్ అన్నీ ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోయినా… సెకెండాఫ్ లో ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, ఓ పేద కుటుంబం… ఓ అబ్బాయిని మంచి చదువులు చదివించాలంటే ఎంత కష్టపడాలి అనేది చాలా హృద్యంగా చిత్రీకరించారు. ఇలాంటివన్నీ సెకెండాఫ్ లో మనసును తాకుతాయి. కొంచెం స్లోగా ఉన్నా… సినిమా చాలా సరదాగా సాగిపోతుంది.
తన డెబ్యూ మూవీనే అయినా… హమరేష్ చాలా బాగా నటించారు. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకునిగా ఎంతో ఎమోషన్ చూపించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి… ఉన్నట్టుండి కార్పొరేట్ కళాశాలకు వెళితే… అక్కడ తోటి విద్యార్థులతో ఎదురయ్యే సమస్యలు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే ఓ సాధారణ కుర్రాడిగా బాగా నటించారు. అతనికి జోడీగా నటించిన ప్రార్థన కూడా చాలా క్యూట్ గా నటించింది. హమరేష్ తోటి కుర్రాళ్లు కూడా బాగా నటించారు. సాధారణంగా స్టూడెంట్స్ మధ్య వచ్చే ఇగోలు, కొట్లాటలు అన్నీ మన చుట్టూ జరుగుతున్నట్టు కనిపించేలా వీళ్లు నటించారు. అందులో మనం కూడా ఉన్నట్టు ఫీలయ్యేంతలా కుర్రాళ్లంతా నటించి ఆకట్టుకున్నారు. హమరేష్ తండ్రిగా ‘ఆడుకలం’ మరుగదాస్ చక్కగా నటించారు. ఓ ఇస్త్రీ పని చేసుకునే వ్యక్తి ఎలా ఉంటారో… అలా కనిపించి మెప్పించారు. తన కుమారుడితో వచ్చే సీన్స్ లోనూ, భార్యతో వచ్చే సన్నివేశాలు, కూతురుతో రిలేషన్, అలాగే బయటి వ్యక్తులతో వ్యవహరించే తీరు అన్నీ…. ఓ సాధారణ కుటుంబ పెద్ద ఎలా ఉంటారో అలా కనిపించారు. హమరేష్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే హమరేష్ అక్కగా నటించిన నటి కూడా పర్వాలేదు అనిపించింది.
దర్శకుడు వాలి మోహన్ దాస్ కుర్రాడు కావడంతో… తను చూసిన కళాశాల వాతావరణం… అక్కడ ఉండే స్టూడెంట్స్ మనస్తత్వాలు, పేదరికంలో ఉండే కుటుంబం… వారి మధ్య ఉండే ఎమోషన్స్ అన్నీ చాలా అబ్జర్వ్ చేసి ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లేలను రాసుకున్నట్టు అనిపిస్తుంది. చాలా సరదాగా… ఎమోషనల్ గా సినిమాని తీశారు. అయితే ఇందులో పెద్దగా మలుపులు, మెరుపులేమీ కనిపించవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు పెద్దగా రిజిష్టర్ కావు. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్నీ బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. తమిళంలో ఈ సినిమాని సతీష్ నిర్మించగా… తెలుగులో శివం మీడియా బ్యానర్ లో శివ మల్లాల ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా అనువాదం చేసి… సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. కర్షియల్ హంగులతో… భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తున్న ఈ తరుణంలో… ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు. కాబట్టి ఓ సారి ఈ సినిమాని సరదాగా చూసేయండి.
రేటింగ్: 3