సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సారంగదరియా’. నూతన దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రాజా రవీంద్ర మెయిన్ లీడ్ పోషించారు. అతనితో పాటు మొయిన్ మొహమ్మద్, మోహిత్, యశస్విని, మధులత, దేవి, శివ చందు, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షవర్దన్, కాదాంబరి కిరణ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేసే కృష్ణ కుమార్(రాజా రవీంద్ర)కి అర్జున్(మొయిన్ మొహమద్), సాయి(మోహిత్ పేడాడ) అనే ఇద్దరు కుమారులు, అనుపమ(యశస్విని) అనే ఒక కుమార్తె ఉంటారు. అర్జున్… కావ్య(దేవి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఇద్దరి క్యాస్టులు వేరు వేరు కావడంతో అమ్మాయి తండ్రి అంగీకరించకపోవడంతో లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. దాంతో తాగుడుకు బానిస అవుతాడు. రెండో కుమారుడు సాయి… అదే ఊరికి చెందిన ఫాతిమ(మధులత)ను ప్రేమిస్తుంటారు. అయితే వీరిద్దరిది మతాలు వేరు కావడంతో అందుకు ఫాతిమా తండ్రి అంగీకరించడు. కూతురు అనుపమ(యశస్విని)ని అదే గ్రామానికి చెందిన రాజు(శివ చందు) ప్రేమిస్తుంటాడు. అయితే తనకున్న వ్యక్తిగత కారణాల వల్ల అనుపమ రాజు ప్రేమను అంగీకరించదు. అయినా రాజు… అనుపమను ప్రేమిస్తున్నా అంటూ వెంటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో రాజు తండ్రికి.. అనుపమ గురించి ఓ భయంకరమైన నిజం తెలిసి… కృష్ణ కుమార్ కుటుంబాన్ని అవమానిస్తాడు. దాంతో కృష్ణ కుమార్… అనుపమను తీవ్రంగా మందలించడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుంది. ఈ క్రమంలో అనుపమ ఈ అవమానాల నుంచి బయటపడటానికి తను ‘మిస్ బ్యూటీ క్వీన్ కాంపిటీషన్’లో పాల్గొని కిరీటాన్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది. మరి అనుపమ అందుకోసం ఎలా ప్రిపేర్ అయ్యింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురయిన సవాళ్లు ఏంటి? అసలు అనుపమకున్న వ్యక్తిగత ఇబ్బందులు ఏంటి? దాని వల్ల ఆమె కుటుంబం ఇలాంటి అవమానాలు ఎదుర్కొంది? దానిని నుంచి బయటపడేందుకు ఆమె అనుకున్న మిస్ బ్యూటీ కాంపిటీషన్ లో టైటిల్ ను నెగ్గిందా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఫ్యామిలీ డ్రామా స్టోరీలకు కథ సమకాలీన అంశానికి సంబంధించినదై ఉండాలి. దానిని డ్రైవ్ చేయడానికి కావాల్సిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకు బాగా ఎంగేజ్ అవుతారు. అలాగే డ్రామా పండాలి అంటే… పాత్రల మధ్య ఎమోషన్స్ ఉండాలి. అందుకు తగ్గట్టుగా సంభాషణలు పలకాలి. అప్పుడే ఫ్యామిలీ డ్రామా చిత్రాలు సిల్వర్ స్క్రీన్ పైన ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. బాక్సాఫీస్ ను కళకళలాడిస్తాయి. ఈ ‘సారంగదరియా’ చిత్రం కూడా మంచి ప్లాట్ తో తెరకెక్కింది. ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి ప్లాట్ ను వెండితెరపై చూసుండం. అలాంటి ప్లాట్ ను తీసుకుని దర్శకుడు… ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా కథను ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా తెరకెక్కించారు. ఓ సిన్సియర్ లెక్చరర్… అతనికి ఉన్న ముగ్గురు సంతానం… ముగ్గురూ ఓ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటే… వారి భవిష్యత్తును చక్కదిద్దడానికి ఓ తండ్రి పడే కష్టాల సమాహారమే ఈ చిత్రం సారాంశాం. ఇలాంటి కథ… కథనాలను వెండితెరపై చూపించాలి అంటే మొదట ఈ సినిమా నిర్మాతలకు గట్స్ ఉండాలి. దానిని తెరమీద కన్వెన్సింగ్ గా చూపించడానికి దర్శకుడు కూడా పకడ్బంధీ సరంజామాతో రెడీ అవ్వాలి. అప్పుడే సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు కూడా ఈ సినిమాని వెండితెరపై చూపించడానికి ఇలాంటి అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యే చాలా ఎమోషనల్ గా తెరకెక్కించారు. అందుకు ప్రతి ఒక్క ఆడియన్ కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశానికి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతారు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చుతుంది.
అయితే కాస్త నోటెడ్ నటీనటులు ఉండి వుంటే… ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే సూచనలుండేవి. ఒక్క రాజా రవీంద్ర, కాదాంబరి కిరణ్, హర్షవర్దన్, శ్రీకాంత్ అయ్యంగార్, కమేడియన్ అనంత్, విజయమ్మ తదితరులు మాత్రమే క్యారెక్టర్స్ ఆర్టిస్టులున్నారు. లీడ్ రోల్ పోషించిన వారంతా వెబ్ సిరీస్, యూట్యూబ్ లో నటించిన అనుభవం ఉన్నవారే. మొయిన్ మొహమ్మద్ మాస్ అప్పియరెన్స్ తో ఆకట్టుకున్నారు. లీడ్ రోల్ పోషించిన రాజా రవీంద్ర తనదైన శైలిలో ఓ లెక్చరర్ ఎలా ఉంటారో అలా నాచురల్ గా కనిపించి మెప్పించారు. శ్రీకాంత్ అయ్యంగార్ కూడా సెకెండాఫ్ లో ఎంట్రీ ఇచ్చి మెప్పించారు. కొత్త నటుడు మోహిత్ కూడా తనదైన కొంటెతనం, అల్లరి యువకుని పాత్రలో ఆకట్టుకున్నారు. లీడ్ రోల్ పోషించిన యశస్విని కూడా క్లైమాక్స్ లో బాగా ఆకట్టుకుంటుంది. ఇక మిగతా పాత్రలన్నీ ఓకే.
దర్శకుడు రాసుకున కథ… కథనాలు బాగున్నాయి. చాలా యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలకు ఇది పర్ ఫెక్ట్ ఉదాహరణ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. లెజెండ్రీ సింగర్ కె.ఎస్.చిత్ర పాడిన ‘అందుకోవా’, ‘నా కన్నులే..’, ‘ఈ జీవితమంటే..’ అనే పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘కులం అంటే రక్తం కాదు.. పుట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం’.., ‘మందు, సిగరెట్, పేకాట, బెట్టింగ్‌లకంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. అది మనకు తెలియకుండానే మనం రాజీ పడి బతికేలా చేస్తుంది.. నువ్వింతే.. ఇంతకు మించి ఏం చేయలేవని చెప్పి బాస్ అయి కూర్చుంటుంది’.. ‘ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం.. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది’ అనే డైలాగ్స్ సినిమాలోని కథ, పాత్రల లోతుని చూపిస్తున్నాయి. నిర్మాతలు ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ తీసుకుని ధైర్యంగా బడ్జెట్ పెట్టడం ఓ సాహసమే అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3