శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజూ యాదవ్ దుందుడుకుగా వ్యవహరించి తమ కార్యకర్తకు కొట్టడాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ర్యాలీ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ధర్నా చేస్తున్న తమ కార్యకర్తను ఆమె చెంపదెబ్బలు కొట్టారు అని చెబుతున్న పవన్ కళ్యాణ్ అసలు ఆమె అలా ఎందుకు కొట్టాల్సి వచ్చింది.. అంతమంది ఉండగా సదరు సాయి అనే కార్యకర్తను మాత్రమే ఎందుకు కొట్టారు ? అయన మీద వెనుకబడిన యాదవ సామాజిక వర్గానికి చెందిన అంజూ యాదవ్‌కు ఏమైనా కక్షలు కార్పణ్యాలు.. ఆస్థి తగాదాలు ఉన్నాయా? లేదు కదా మరెందుకు కొట్టారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ… అది కూడా రావణుడి మాదిరిగా పది తలలతో కూడిన దిష్టిబొమ్మను తగులబెడుతూ తలమీద కాళ్ళు వేసి తొక్కుతున్న కార్యకర్తలను చెదరగొట్టేందుకు అంజూ యాదవ్ ప్రయత్నించారు. ఈ తరుణంలో జనసేన కార్యకర్తలు నియంత్రణ కోల్పోయి పోలీసుల మీదకే దాడి చేసే పరిస్థితి నెలకొంది. ఇక వేరేమార్గం లేక పరిస్థితి అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంపదెబ్బ కొట్టారు. లాఠీఛార్జ్ చేయాల్సిన ఉద్రిక్తత ఉన్నా కాస్త సామరస్యంగా పరిస్థితి అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంప దెబ్బ కొట్టారు. ఒక బీసీ మహిళా పోలీస్ ఇలా తమ మీద అధికారం చూపడాన్ని సహించలేని పెత్తందారు పవన్ కళ్యాణ్ ఇలా ఆమె మీద రాజకీయ దాడి చేస్తున్నారని యాదవ వర్గాలు గుర్రుమంటున్నాయి .
ఆమెకు ఎవరైనా ఒకటే ..
అంజూ యాదవ్ డ్యూటీలో ఎంత క్రమశిక్షణలో ఉంటారో తప్పు చేసినవాళ్లు విషయంలో అంతే కఠినంగా ఉంటారని ఆ ప్రాంతంలో పేరుంది. ఏడాది క్రితం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ఓ ధర్నాలో పాల్గొనగా ఆమెను సైతం ఇలాగే దండించి శాంతి భద్రతలు కాపాడారు . తెలుగుదేశం కార్యకర్తలు అయినా సరే శాంతి భద్రతలకు.. సామాజిక ప్రశాంతతకు విఘాతం కలిగితే ఏమాత్రం సహించలేని అంజూ యాదవ్ అప్పటికప్పుడే పరిస్థితులు అదుపు చేస్తుంటారు. అయితే ఇలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరున్న అంజూ యాదవ్ కేవలం బీసీ మహిళ అనే కారణంతో చిన్న చూపు చూస్తూ అవమానించడాన్ని ఆ వర్గం ప్రజలు అంగీకరించడం లేదు. తమ ఆడబిడ్డ ఎదుగుదలను సహించలేని పెత్తందారీ పోకడలున్న పవన్ కళ్యాణ్ ఇలా ఆమెను టార్గెట్ చేస్తున్నారని యాదవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మహిళలు స్ఫూర్తిమంతంగా ఉండాలి.. ధైర్యంగా ఉండాలి.. అన్యాయాలను ఎదిరించాలీ అని వాక్రుచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సిన్సియర్ గా విధులు నిర్వర్తిస్తున్న మహిళా బీసీ పోలీస్ అధికారిని టార్గెట్ చేస్తూ ధర్నా చేయడం ఆయన పెద్దరికపు, అహంకారపూరిత మనస్తత్వానికి ప్రతీక అని యాదవ యువత ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు తాము సరైన సమయంలో బుద్ధి చెబుతామని అంటున్నారు