దక్షిణ మధ్య రైల్వే తన ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుత వర్షాకాలంలో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా వాటిని సమగ్రంగా ఎదుర్కొనేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలను జోన్ చేపడుతుంది. ముందస్తు చర్యలలో భాగంగా జోన్ పరిధిలో ఇరవై నాలుగు గంటలూ నిఘా ఏర్పాటు చేసి 87 ప్రమాదకర సెక్షన్లను మరియు 915 వంతెనలను జోన్ గుర్తించింది. ఆటంకాలు లేకుండా పెట్రోలింగ్ నిర్వహణకు క్షేత్రస్థాయిలో సిబ్బంది పూర్తి స్థాయిలో రక్షిత దుస్తులు మరియు పరికరాలతో సిద్ధంగా ఉన్నారు. విభిన్న విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించి పలు చర్యలు తీసుకోబడ్డాయి. రైళ్ల నిర్వహణ మరియు మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ బృందాలను జోన్ ఏర్పాటు చేసింది.
వర్షాకాలం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే చేపట్టే ముందు జాగ్రత్త చర్యలలో ఈ క్రింది అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబడినవి:
1.తరచూ రైల్వే ట్రాకుల పర్యవేక్షణ :
వర్షాకాలంలో రైల్వే ట్రాకులపై వరద నీరు పారకుండా మరియు రైళ్లు ఆగకుండా ఉండేందుకు పంపులు మరియు నీటి కాలువలు సజావుగా పనిచేస్తున్నాయనే నిర్ధారణకు తరచూ ట్రాక్ పర్యవేక్షణను జోన్ చేపడుతుంది. జోన్‌లోని అన్ని డివిజన్లలో రోజు వారీగా ట్రాకులను పర్యవేక్షిస్తారు మరియు పరిస్థితులను సంబంధిత అధికారులకు తెలియజేస్తారు.
2. ప్రమాదకర ప్రాంతాలు / వంతెనల వద్ద పెట్రోలింగ్ :
వర్షాకాలం మొత్తం జోన్ వ్యాప్తంగా గుర్తించిన ప్రమాదకర ట్రాకులు మరియు వంతెనలపై ప్రెట్రోలింగ్ పెంచడం మరియు నిఘా నిరంతరం కొనసాగించడం. ఈ సమయంలో ఏదేని సెక్షన్‌లో అసాధారణ వర్షపాతం లేదా తుఫాను నమోదయిన సందర్భంలో వాతావరణం తిరిగి సాధారణ స్థితికి చేరుకునేంత వరకూ పెట్రోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు.
3. కీలకమైన సెక్షన్లలో పూర్తి స్థాయిలో కాపలాదారుల ఏర్పాటు :
నూతనంగా నిర్మించిన వంతెనలు మరియు అప్రోచ్ రోడ్లు వంటి కీలక ప్రాంతాలలో పూర్తిస్థాయిలో కాపలాదారుల ఏర్పాటు. ఆ కాపలాదారులు నీటి మట్టం స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తూ రైళ్ల రాకపోకలు సజావుగా సాగేలా చూస్తారు.
4. రైల్వే ప్రభావిత చెరువులు (ఆర్‌ఏటిలు) :
జోన్‌లోని రైల్వే మార్గాన్ని ప్రభావితం చేసే సుమారు 1917 చెరువులను సంబంధిత రైల్వే మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులచే సంయుక్తంగా గుర్తించబడ్డాయి. చెరువుల పరిస్థితి మరియు మరమ్మతులపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో రాష్ట్ర స్థాయి సమావేశాలను కూడా నిర్వహించారు. వర్షాకాలంలో చెరువుల తాజా స్థితిపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమన్వయం కలిగుండాలి.
5. రిజర్వాయర్లు మరియు డ్యాముల వద్ద నీటి మట్టం స్థాయి :
రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయంతో డ్యాములు మరియు రిజర్వాయర్ల పరిధిలో ఉన్న రైల్వే వంతెనలను సూక్ష్మంగా పరిశీలించేలా తగిన ఏర్పాట్లు. దీంతో మిగులు జలాలను విడుదల చేసినప్పుడు రైల్వే సమయానుకూలంగా తగిన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి.
6. వాతావరణ మరియు తుఫాను హెచ్చరిక సమాచారం :
వాతావారణ శాఖ వారు జారీ చేసే జిల్లాల వారీగా వాతావరణ సమాచారం, హెచ్చరికలు, తుఫాను సమాచారంపై దృష్టి సారించడం. ఈ సమాచారాన్ని సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ తగిన చర్యలు చేపట్టడం.
7. నీటి స్థాయి మట్టం పర్యవేక్షణ : గుర్తించిన వంతెనలపై 22 ఆటోమేటెడ్ నీటి మట్టం స్థాయి పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేయడంతో నిరంతరం అక్కడి నీటిస్థాయి విలువలు అందుబాటులో ఉంటాయి.
8. సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవడం : వర్షాకాలం అత్యవసర పరిస్థితులలో వరదలతో ఏవేని అనుకోని ఘటనలు సంభవించినా వాటిని ఎదుర్కోవడానికి ఆరు డివిజన్లలో గుర్తించిన ప్రాంతాలలో స్టేషన్లు మరియు గూడ్స్ వ్యాగన్లలో ట్రాక్/వంతెనల పునరుద్ధరణకు ఇసుక, బండరాళ్లు, ఖాళీ సిమెంట్ సంచులు, టార్ఫలిన్ షీట్లు, గిర్డర్లు మరియు స్టీల్ క్రిబ్స్ వంటి అవసరమయ్యే సామగ్రిని సిద్ధం చేసుకోవడం.
వర్షాకాలంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అప్రమత్తతో సిద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్ కుమార్ జైన్ జోన్‌లోని అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. భద్రతా చర్యలు చేపట్టడంలో క్రియాశీలకంగా ఉంటూ ‘‘భద్రతా చర్యలలో ఎటువంటి రాజీ లేకుండా’’ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆరు డివిజన్ల అధికారులను ఆదేశించారు. ఒక వేళ రైళ్లను క్రబమబద్ధీకరిస్తే లేదా రైళ్ల సర్వీసులకు ఆటంకాలు ఏర్పడితే ప్రయాణికుల రైళ్ల రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఆ సమాచారాన్ని వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలని ఆయన అన్నారు.