కలర్ ఫొటో సినిమాతో హీరోగా పరిచయమైన సుహాస్… ఆ తరువాత వరుస సినిమాలు చేస్తున్నారు కానీ… ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. అంబాజీ పేట మ్యారేజ్ బ్యూరో ఓ మోస్తారుగా ఆడింది. ఆ తరువాత వచ్చిన ప్రసన్నవదం కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఇప్పుడు శ్రీరంగ నీతులు అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు గొర్రెపురాణం అంటూ మళ్లీ వచ్చారు. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు మూవీ టీమ్. ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ సినిమా రిలీజ్ కావడం హీరో సుహాస్ కీ ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. వీటిని రుజువు చేసేలా వున్నాయి ఈ సినిమా ప్రమోషన్స్. ఎట్టకేలకు సడీ సప్పుడు లేకుండా సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ గొర్రెపురాణం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి
కథ: ఓ ముస్లిం కుటుంబం ఓ గొర్రెను అల్లారు ముద్దుగా పెంచుతుంది. ఆ గొర్రె అంటే కుటుంబంలోని ఓ అమ్మాయికి అలవిమాలిన ప్రేమ. ఓ రోజు ఆ కుటుంబ పెద్ద గొర్రెను కోసేసి… బిర్యానీ వండుకుని తిందామని ఇంట్లో చెబుతాడు. అది విన్న ఆ అమ్మాయి తెల్లారితే గొర్రెను తన తండ్రి ప్రాణాలు తీసేస్తాడని తల్లడిల్లిపోయి… ఆ అమ్మాయి ఇంట్లో వున్న గొర్రెను వదిలేస్తుంది. దాంతో ఆ గొర్రెను వెతుక్కుంటూ సదరు ముస్లిం కుటుంబానికి చెందిన వారు వెళతారు. దాన్ని ఎలాగైన బంధించి తీసుకురావాలని వెంటపడటంతో ఆ గొర్రె ఓ గ్రామంలో వున్న గ్రామదేవత ఆలయంలోకి దూరి తలదాచుకుంటుంది. అయితే ఆ గ్రామానికి చెందిన కొంత మంది గ్రామస్తులు తామే ఆ గొర్రెను గ్రామదేవతకు బలిస్తామని మొండిగా వాదిస్తారు. ఇద్దరి మధ్య పంచాయితీ జరుగుతుంది. ఈ విషయం మీడియాకు పొక్కగానే… ఆ పంచాయతీ కాస్త వైరల్ గా మారుతుంది. దాంతో మొత్తం వ్యవహారం హిందూ ముస్లింల మధ్య గొడవలకు దారితీస్తుందని చెప్పి… ఆ గొర్రెను అరెస్టు చేసి జైలుకు పంపుతారు పోలీసులు. ఆ జైలులో ఓ మర్డర్ కేసులో జైలు జీవితాన్ని గడుపుతుంటాడు రవి(సుహాస్). అదే సెల్ లోనే గొర్రెను కూడా వేస్తారు. ఆ తరువాత గొర్రె ఎలా బయటకు వచ్చింది? రవి మర్డర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? గొర్రెకు, రవికి మధ్య వున్న సంబంధం ఏమిటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఇప్పటి వరకూ మనం వెండితెరపై పాము, ఏనుగు, కుక్క, ఈగ, అదే హాలీవుడ్ లోనైతే పులి, సింహం, రాక్షస బల్లులు, తదితర చిన్న, పెద్ద జంతువుల బేస్ సినిమాలు చూసుంటాం. అయితే ఇప్పుడు సాధు జంతువుగా పేరున్న గొర్రెను ప్రధాన పాత్రను చేస్తూ… దాని చుట్టూ స్క్రీన్ ప్లేను రాసుకున్నారు. ఇది ఎవ్వరికీ అర్థం కాని గొర్రె పురాణం అని చెప్పొచ్చు. గొర్రెకు గాత్రదానం దర్శకుడు తరుణ్ భాస్కర్ చేశారు. ఇది గొర్రెపురాణమే కానీ… ఇందులో వున్నదంతా మీడియా మీద… రాజకీయ నాయకుల మీద చీప్ వ్యంగ్యాస్త్రాలు సంధించడానికే తీసినట్టు అనిపిస్తుంది. వాటితోనే టైంపాస్ చేస్తారులే ప్రేక్షకులు అన్నట్టు సాగుతుంది సినిమా. రాజకీయ నాయకులు, మీడియా చెప్పే వాటిని ప్రజలు గొర్రెల్లాగ ఏదైనా నమ్మేస్తారు అనే కోణంలో ఈ గొర్రెపురాణం సాగి… ఆడియన్స్ కు విసుగు తెప్పిస్తుంది. ఏకోశాన సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు దర్శకుడు, నిర్మాత. హీరో సుహాస్ పాత్ర నిడివి చాలా తక్కువ. అతని పాత్రకు ఓ జస్టిఫికేషన్ అనేది లేకుండా తీశారు. ఈ కారణంగానే అనుకుంటా సుహాస్ ఈ చిత్రం ప్రమోషన్స్ కు ముఖం చాటేశారు. సినిమాని వాయిదా వేయమని చెప్పారు. అయితే నిర్మాత మాత్రం సుహాస్ మాటలు పట్టించుకోకుండా సినిమాను ఈరోజు రిలీజ్ చేసేశారు. తీరా సినిమా చూస్తే… సుహాస్ కి పెద్దగా ప్రాధాన్యత లేకుండా వుంది. గతంలో కూడా సోషియల్ సెటైరిక్ సినిమాలు వచ్చాయి. అవన్నీ ప్రజలను మేల్కొలిపే విధంగా సమాజానికి పనికొచ్చేలా వుండేవి. మరి ఈ సినిమా ఏ ఉద్దేశంతో తెరకెక్కిందో నిర్మాత, దర్శకులకే తెలియాలి.
సుహాస్ పాత్ర గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిడివి చాలా తక్కువ కాబట్టి… ఉన్నంత సేపూ ఓకే. ఇక గొర్రె యాక్షన్ గురించి చెప్పుకోవడానికి ఏమీ వుండదు. అందుకు గాత్రం అందించిన తరుణ్ భాస్కర్ చాలా సిల్లీ కామెడీ మాటలతో నవ్వించే ప్రయత్నం చేశారు. అలాగే మరొ నటుడు గెటప్ శీను వాయిస్ కూడా కాసేపు నవ్విస్తుంది. నటులు, రఘు, జెన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
దర్శకుడు ఎంచుకున్న ప్లాట్ బాగున్నా… దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో తడబడ్డారనే చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలకు అనుభం కావాలనేది ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. సమాజానికి ఏమైనా చెప్పదలచుకున్నారా? లేక వర్తమానంలో ఇదే జరుగుతోంది మీరు మేల్కొండని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? అనేది అసంబద్దంగానే వుంచారు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిడివి చాలా తక్కువే కాబట్టి ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు అంతంత మాత్రమే. సంగీతం పర్వాలేదు. ఫైనల్ గా టైమ్ వేస్ట్ సినిమా… OTT కోసం వెయిట్ చేయడం బెటర్.
రేటింగ్: 1.5