టాలీవుడ్ దర్శకత్వ పట్టికలో జయశంకర్ పేరు వినగానే ఒక వైవిధ్యమైన ఆలోచన గుర్తొస్తుంది. ప్రస్తుతం థియేటర్లలో భారీ వసూళ్లు సాధిస్తున్న కొన్ని చిత్రాలను గమనిస్తే, ఆయన ఐడియాలజీ ఎంతటి విజన్ ఉన్నదో ఇట్టే అర్థమైపోతుంది. నిజం చెప్పాలంటే, ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలు ఆయన పాత ప్రాజెక్ట్‌లకు అప్డేటెడ్ వెర్షన్లు అనిపిస్తున్నాయి.
‘క’ (KA) లో కనిపించిన జయశంకర్ మార్క్!
కిరణ్ అబ్బవరం కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ‘క’. అయితే, ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు జయశంకర్ 2015 నాటి షార్ట్ ఫిలిం ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ గుర్తుకు రావడం సహజం. మనిషికి, దేవుడికి మధ్య ఉండే అనుబంధాన్ని ఒక వినూత్నమైన స్క్రీన్ ప్లేతో ఆనాడే అద్భుతంగా ఆవిష్కరించారు జయశంకర్. ఆ కాన్సెప్ట్ లోని డెప్త్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై ‘క’ రూపంలో సక్సెస్ అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏఐ (AI) కాన్సెప్ట్ కు ఆద్యుడు: ‘విటమిన్ షీ’ టూ ‘LIK’
ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ ట్రైలర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కానీ, ఈ మొబైల్ అడిక్షన్ (నోమోఫోబియా), మన జీవితాల్లోకి చొరబడే AI అసిస్టెంట్ అనే కథాంశాన్ని 2020లోనే ‘విటమిన్ షీ’ ద్వారా జయశంకర్ టచ్ చేశారు. కాలం కంటే ముందుగానే టెక్నాలజీ వల్ల వచ్చే అనర్థాలను వినోదాత్మకంగా చూపించడం ఆయనకే చెల్లింది.
దురదృష్టం వెక్కిరించిన ‘అరి’ (Ari)
భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అరుదైన పాయింట్ తో జయశంకర్ రూపొందించిన చిత్రం ‘అరి’ (Ari: My Name is Nobody). ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ సినిమా, కంటెంట్ పరంగా ఎంతో లోతైనది. అయితే, సినిమా విడుదల సమయంలో శ్రీకాంత్ అయ్యంగార్ వివాదం తలెత్తడం ఈ ప్రాజెక్ట్ కు పెద్ద శాపమైంది. ఆ గొడవ వల్ల ఒక గొప్ప సినిమా ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది.
బాటమ్ లైన్:
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ట్రెండ్ కు తగ్గట్టు కాకుండా, ట్రెండ్ సెట్ చేసే కథలను ఎంచుకోవడంలో జయశంకర్ ఎప్పుడూ ముందే ఉంటారు. నేటి సూపర్ హిట్లకు ఆయనే ఒక అదృశ్య ‘ఇన్స్పిరేషన్’ అనడంలో సందేహం లేదు!









