అల్లు రామలింగయ్య జీవిత ఛాయ చిత్ర మాలిక పుస్తకం ఆవిష్కరించడం ఎంతో గర్వంగా వుంది. ఈ పుస్తకం తొలి ప్రతిని మెగాస్టార్ చిరంజీవి కి అందించడం ఆనందంగా వుంది అన్నారు మాజీ ఉప రాష్ట్రతి ఎం. వెంకయ్య నాయుడు. ఆయన శనివారం పార్క్ హయత్ లో జరిగిన అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయన ఈ ఛాయ చిత్ర మాలిక పుస్తకం కోసం కృషి చేసిన రచయితలకు అభినందనలు తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… సినిమా అన్నిరకాలుగా అందరినీ ఉత్సాహ పరుస్తుంది. కొన్ని విలువలతో కూడిన సినిమాలు రావాలి. అవి సమాజానికి ఎంతో ఉపయోగం కూడా. గ్లామర్ తో పాటు హ్యూమర్ … గ్రామర్ తో వుండాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది. ఒకప్పుడు హాస్యం అనేది నాటకాల్లో మధ్య మధ్యలో వుండేది. అల్లు రామలింగయ్య లాంటి వాళ్ళు వచ్చిన తరువాత ఆయన చేసిన పాత్రల తాలూకు వల్ల హాస్యానికి సినిమాల్లో ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు మన మధ్యనే వున్న బ్రంహానందం హాస్యానికి ఎంతో గుర్తింపు తెచ్చారు. అల్లు రామలింగయ్య కూడా తన హాస్యంతో ఎంతో మందిని ఆహ్లాదంగా నవ్వించారు. సినిమా సమాజాన్ని ప్రతిబింబించేలా వుండాలి.. అలాంటి సినిమాల్లో అల్లు రామలింగయ్య నటించారు. అంటరానితనాన్ని రూపు మాపడానికి కృషి చేశారు. ఆమ్యామ్య.. అనే పదం లంచానికి మరో రూపంలో సృష్టించిన ఘనత ఆయనది. హాస్యానికి ఎక్స్పైరీ డేట్ వుండదు. సమకాలీన అంశాలను దృష్టిలో పెట్టుకొని నవ్వించడం ఎంతో ఆరోగ్య కరం. కేవలం నటించడమే కాకుండా సమాజానికి ఉపయోగ పడే కార్యక్రమాలు చేయాలి. అలా చేయడంలో చిరంజీవి ముందు వున్నారు. ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించి ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు. సినిమా ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను బాగా ప్రచారం చేయాలి. అప్పుడే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు తెలుగు సినిమా పరిశ్రమకి రెండు కళ్ళు లాంటి వారు అయితే… మెగాస్టార్ చిరంజీవి మూడో కన్ను. అల్లు అర్జున్ చాలా మెచ్యూర్ గా నటిస్తున్నారని గతంలో అల్లు అరవింద్ కి ఫోన్ చేసి చెప్పా. అందరూ అలా రాణించాలని సూచించారు.
అనంతరం అల్లు రామలింగయ్య అవార్డులను సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుకి, సునీల్, తదితరులకు అందజేశారు. ఈ కార్య క్రమానికి తనికెళ్ళ భరణి వ్యాఖ్యాత.
ఈ కార్యక్రమంలో చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, రాజేంద్ర ప్రసాద్, అశ్వినీ దత్, శ్యాం ప్రసాద్ రెడ్డి తదిరులు పాల్గొన్నారు.