సీఎం జగన్ గాల్లో తిరిగితే ప్రజల కష్టాలు తెలియవని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజలు పీకల్లోతు వరదల్లో మునిగి ఉన్నారని, జగన్ మాత్రం కాలికి మట్టి అంటకుండా గాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదల ప్రభావం, ప్రజల పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. 6 జిల్లాల్లో 550కి పైగా గ్రామాల్లో గోదావరి వరద ప్రభావం ఉందని ఆయన తెలిపారు. వరదపై ప్రభుత్వ సన్నద్దత లేదని, బాధితులకు సాయమూ చేయలేదని మండిపడ్డారు.
వరద బాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. విపత్కర పరిస్థితుల్లో మంత్రులు, ప్రభుత్వ పెద్దల నిరంతర పర్యవేక్షణ ఏది? అని ప్రశ్నించారు. ఓ నాలుగు రోజులు ప్రజలకు ఆహారం, మంచినీరు ఇవ్వలేరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వరదలపై సీఎం, మంత్రులు, అధికారుల అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పునరావాస కాలనీలు పూర్తి చేసుంటే ఈ కష్టాలు తప్పేవని ఆయన పేర్కొన్నారు. ఒక్కరోజులో కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచుతామని కొత్త డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నా వరద సమాచారం ఇవ్వలేదని, కనీస సాయం చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం వదిలేసినా బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి కూడా సాయం అందిస్తుందని ప్రకటించారు. గురు, శుక్రవారాల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తానని చంద్రబాబు తెలిపారు.