కోర్ట్, బ్యాండ్ మేళం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్ మరోసారి యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నక్షత్ర హీరోయిన్‌గా నటించిన ‘తెల్లకాగితం’కు రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. నందు సవిరిగాన కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతం, కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ:
రాము (హర్ష్ రోషన్) తల్లిదండ్రులను కోల్పోయి అన్నా వదినల సంరక్షణలో పెరుగుతుంటాడు. పదో తరగతిలో చదువుతున్న సమయంలో తన క్లాస్‌మేట్ ఆశ (నక్షత్ర)తో పరిచయం ప్రేమగా మారుతుంది. రాము ప్రేమను ఆశ కూడా అంగీకరిస్తుంది.
తెలిసీ తెలియని వయసులో ఇద్దరూ తీసుకున్న ఓ నిర్ణయం వారి జీవితాల్లో అనూహ్యమైన మార్పులకు కారణమవుతుంది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచే ప్రయత్నంలో ఇద్దరూ ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటారు.
ఆ వయసులో తీసుకున్న నిర్ణయం వారి భవిష్యత్తును ఎలా మార్చింది? కుటుంబాలపై దాని ప్రభావం ఏంటి? చివరకు రాము, ఆశ జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
‘తెల్లకాగితం’ ప్రధానంగా టీనేజ్ వయసులో తీసుకునే నిర్ణయాలు, వాటి పర్యవసానాలు, కుటుంబ బంధాలు, ప్రేమ, బాధ్యత వంటి అంశాల చుట్టూ కథను నడిపింది. మనసు తెల్లకాగితం లాంటిదని.. ఆ వయసులో మనం వేసే ప్రతి అడుగు భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందనే భావనను టైటిల్‌కు తగ్గట్టుగా కథలో చూపించే ప్రయత్నం చేశారు.
రాము, ఆశ పరిచయం.. వారి మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాలు సహజంగా సాగుతాయి. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ, యూత్‌ఫుల్ సన్నివేశాలు సినిమాకు మంచి ప్రారంభాన్ని ఇస్తాయి. పాటలు కూడా కథలోని ప్రేమ భావనకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. ‘తెలుసా తెలుసా’ వంటి మెలోడీ పాటలకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది.
కథ ముందుకు వెళ్లే కొద్దీ ప్రేమకథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఇక్కడి నుంచి దర్శకుడు టీనేజ్ వయసులో అవగాహన, బాధ్యత ఎంత ముఖ్యమో చెప్పే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యుల భావోద్వేగాలను కూడా కథలో భాగం చేయడం బాగుంది.
ముఖ్యంగా యూత్ మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా ఆలోచించేలా చేసే పాయింట్ ఇందులో ఉంది. తెలియని వయసులో తీసుకునే నిర్ణయాలు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఎమోషనల్‌గా చూపించారు. ప్రీ-రిలీజ్ సమయంలో చిత్రబృందం కూడా సినిమాను ఇన్నోసెంట్ లవ్ స్టోరీతో పాటు హార్డ్ హిట్టింగ్ ఎమోషన్ ఉన్న కథగా పేర్కొన్న విషయం తెలిసిందే.
కొన్ని సన్నివేశాల్లో కథనం కాస్త నెమ్మదించినప్పటికీ.. చివరి భాగంలో కథ ఇచ్చే సందేశం సినిమాకు బలంగా నిలుస్తుంది. టీనేజ్ ప్రేమకథను కేవలం రొమాన్స్‌కే పరిమితం చేయకుండా దాని వెనుక ఉన్న బాధ్యతను కూడా చూపించడం సినిమాకు ప్రత్యేకత.
నటీనటులు:
హర్ష్ రోషన్ రాము పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. టీనేజ్ కుర్రాడి అమాయకత్వం, ప్రేమ, అయోమయం, భావోద్వేగాలను హావభావాలతో బాగా పలికించాడు.
నక్షత్ర ఆశ పాత్రలో ప్రత్యేకంగా ఆకట్టుకుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ సహజమైన నటనతో మెప్పించింది. అమాయకత్వంతో పాటు భావోద్వేగాలను కూడా చక్కగా పలికించింది. ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.
అజయ్… తన పాత్రలో హుందాగా నటించాడు. శరణ్య ప్రదీప్ తనకు లభించిన పాత్రను చక్కగా పోషించింది. రాజ్ కుమార్ కసిరెడ్డి ఎప్పటిలాగే నెగిటివ్ రోల్ పోషించి కన్నింగ్ మావయ్యగా కనిపించాడు, ఇతర నటీనటులు కూడా తమ పరిధిలో ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్‌గా ‘తెల్లకాగితం’ ఉన్నతంగా ఉంది. విజయ్ బుల్గానిన్ సంగీతంలో పాటలు కథకు తగ్గట్టుగా సాగుతాయి. ముఖ్యంగా యూత్‌ఫుల్ మెలోడీస్ సినిమాకు ఫీల్‌ను తీసుకొస్తాయి.
కె.వి. గుహన్ అందించిన విజువల్స్ సహజంగా, అందంగా ఉన్నాయి. కథకు అవసరమైన వాతావరణాన్ని కెమెరా పనితనం బాగా ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
రచయిత నందు ఎంచుకున్న పాయింట్‌లో మంచి ఎమోషన్, సందేశం ఉన్నాయి. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి టీనేజ్ ప్రేమకథను కుటుంబ భావోద్వేగాలతో ముడిపెట్టి చాలా గ్రిప్పింగ్ గా తెరకు ఎక్కించాడు.
చివరగా:
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది
రేటింగ్: 3.25









